బకాయిలు ఇప్పించండి:జెన్కో
ఆంధ్రప్రదేశ్ పిటీషన్ ఉపసంహరణ నేపధ్యం
: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావలసిన విద్యుత్ బకాయిలపై తెలంగాణ జెన్కో హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ జెన్కో బకాయి పడ్డ రూ.4,774 కోట్లు వెంటనే చెల్లించేలా ఆ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.
విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేంద్రాన్ని ఆదేశించేలా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర జెన్కో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
అయితే తెలంగాణ నుంచి బకాయిలు ఇప్పించాలని గతంలో ఏపీ జెన్కో రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కానీ ఇటీవల ఈ పిటిషన్ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బకాయి సమస్యను విభజన సమస్యల కమిటీ వద్ద పరిష్కరించుకుంటామని ఏపీ జెన్కో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బకాయిల చెల్లింపులో పిటిషన్లు దాఖలు చేస్తూ జాప్యం చేస్తోందని తెలంగాణ జెన్కో ఆరోపిస్తోంది. ఏపీ నుంచి తమకు బకాయిలు రావాలని తెలంగాణ, తెలంగాణ రాష్ట్రమే తమకు బకాయి పడిందని ఏపీ రెండు, మూడేళ్లుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే.
ఈనెల మూడవ వారంలో జరిగే విభజన సమస్యల పరిష్కార కమిటీ బకాయిల అంశాన్ని కూడా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ కమిటీ ఈనెల 23 లేదా ఆ తర్వాత సమావేశం కావాలని ప్రతిపాదించింది. 9, 10 షెడ్యూళ్లలో ఉన్న విభజన సమస్యలు, ఆస్తుల పంపకం తదితర అంశాలపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.