తెలంగాణలో నేల చూపులు చూస్తున్న రియల్ ఎస్టేట్
నిలిచిపోయిన భారీ వెంచర్లు
ఆంధ్రప్రదేశ్ కంటే మేలు అంటున్న రియల్టర్లు
తెలంగాణలో స్థిరాస్తి రంగం మందగించింది. రెండేళ్లుగా ఊపు మీద ఉన్న రియల్టీ.. ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. ముఖ్యంగా ఐటీ, రీజినల్ రింగ్ రోడ్డు పేర భారీగా సాగిన భూముల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి.
కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు స్థిరాస్తి రంగం స్తబ్ధుగా ఉన్నా.. ఆ తర్వాత గణనీయంగా పుంజుకుంది. మునుపెన్నడూ లేని రీతిలో స్థలాల అమ్మకాలు సాగిపోయాయి. ఇతర వ్యాపార రంగాలు కుదేల్ కావడంతో పెట్టుబడికి రియల్టీ రంగమే మంచిదనే భావనతో సామాన్య, మధ్యతరగతి మొదలు కార్పొరేట్ సంస్థలు భూముల వైపు కన్నేశాయి. దీంతో భూముల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. సాధారణ ప్రజలకు అందనంత దూరంలో ప్లాట్ల ధరలకు రెక్కలొచ్చాయి.
ఈ నేపథ్యంలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. ఈ క్రమంలో.. కరోనా ప్రభావం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడం, రిజిస్ట్రేషన్ ధరల పెంపు తదితర కారణాలు స్థిరాస్తి రంగంలో ఒడిదొడుకులకు కారణంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి మరో రెండేళ్ల వరకు ఉండే అవకాశం లేకపోలేదని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
శివార్లలో రయ్ రయ్..
కరోనా నేర్పిన చేదు అనుభవాల దృష్ట్యా చాలా మంది నగర శివార్లలో సొంతింటి వైపు మొగ్గు చూపారు. దీంతో శివార్లలో ధరలు ఆకాశాన్నంటాయి. భూములమ్ముకున్న రైతులు ప్రాంతీయ రహదారి అలైన్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో తమ పెట్టుబడులను మళ్లించారు. ఇదే అదనుగా ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారులు భూముల విలువలను నాలుగైదు రెట్లు పెంచేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని అవలంబిస్తుండటంతో యజమానులు లబోదిబోమంటున్నారు. అగ్రిమెంట్ గడువు ముగుస్తున్నా.. కొనే వారు రాకపోవడంతో కొన్న రేట్లకే అమ్మేందుకు ముందుకు వస్తున్నారు. అయినా, ఆసక్తి చూపించకపోవటంతో ఆకాశం వైపు చూస్తున్నారు.
ఎన్నికల మూడ్..
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో డెవలపర్లు, పెట్టుబడిదారుల్లో ఎన్నికల మూడ్ వచ్చేసింది. కొంతమంది డెవలపర్లకు స్థానిక రాజకీయ నాయకులతో ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా నిధులను ఏర్పాటు చేస్తుంటారు. దీంతో ఆయా డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించడం కంటే చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను విక్రయించడం మీదే దృష్టిసారిస్తున్నారు. దీంతో బల్క్ ల్యాండ్స్ కొనుగోళ్లు తగ్గాయని ఓ డెవలపర్ తెలిపారు. అందుకే బల్క్ ల్యాండ్ డీల్స్ పూర్తిగా క్షీణించాయని చెప్పారు.
నాడు కిట కిట, నేడు కటకట
నిన్నమొన్నటి వరకు పశ్చిమ హైదరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడాయి. ఎప్పుడైతే 111 జీవోను ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అప్పట్నుంచి రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల వాతావరణంలోకి పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు వెళ్లిపోయారు. దీంతో ఈ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయని గండిపేట సబ్ రిజిస్ట్రార్ సహదేవ్ తెలిపారు. 111 జీవోపై ఎలాంటి అంక్షలు ఉంటాయనే స్పష్టత కోసం కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు. ఇక్కడ రూ.కోటి పెట్టి అపార్ట్‌మెంట్ కొనేబదులు.. కొంచెం దూరం వెళ్లి అదే ధరకు విల్లా కొనుగోలు చేయవచ్చనే అభిప్రాయం కస్టమర్లలో ఏర్పడింది. మార్చిలో 1,513 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా.. ఏప్రిల్‌లో 1,247, మేలో 1,234 అయ్యాయని తెలిపారు.