home page

తెలంగాణ చరిత్రలోనే 'రావి'

చిరస్మరణీయుడు నారాయణ

 | 
Raavi

చరిత్రలోనే చిరస్మరణీయులు

హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించి నిజాం రాజు వెన్నులో వణుకు పుట్టించిన పోరాట యోధుల్లో రావి నారాయణరెడ్డి ప్రముఖుడు.

ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేదప్రజల కష్టసుఖాలలో అనునిత్యం ప్రత్యక్షంగా మమేకమై వారితోనే తన జీవనాన్ని సాగించిన మహోన్నత వ్యక్తి రావినారాయణరెడ్డి.1908 జూన్‌ 4వ తేదీన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో రావి నారాయణరెడ్డి జన్మించారు. హైదరాబాద్‌ లోని నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లోనే గాంధీజీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, జయప్రకాశ్‌ నారాయణ లాంటి జాతీయ నాయకుల రచనలకు ప్రభావితుడై భారత స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. భారత జాతీయోద్యమ కాలంలో 1930లో జరిగిన అత్యంత కీలక ఘట్టమైన ఉప్పు సత్యాగ్రహోద్యమంలో హైదరాబాద్‌ రాజ్యం నుంచి తెలంగాణ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు.1931వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన హరిజన సేవాసంఘానికి ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్‌ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించి, రెండు వసతి గృహాలను కూడా నిర్వహించారు. హరిజన సేవాసంఘం కార్యక్రమాలలో భాగంగా అస్పశ్యతా నివారణ గురించి ప్రచారం చేస్తూ సహపంక్తి భోజనాలు నిర్వహించి ప్రజలంతా సమామనమని చాటిచెప్పడమే కాకుండా వారిలో విద్యావికాసాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. దేవరకొండలో 1931లో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభ సమావేశానికి తన సహవిద్యార్థులతో కలిసి ఆంధ్రోద్యమాన్ని ప్రచారం చేస్తూ హైదరాబాద్‌ నుంచి దేవరకొండ వరకు పాదయాత్ర నిర్వహించారు. 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన రావినారాయణ రెడ్డి 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరు వేదికగా జరిగిన ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభకు, భువనగిరి వేదికగా 1944లో జరిగిన నిజామాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. భువనగిరిలో జరిగిన మహాసభ సమావేశంలో అతివాద, మితవాద వర్గాల మధ్య కలిగిన అభిప్రాయ భేదాల కారణంగా ఆంధ్రమహాసభ రెండుగా చీలిపోయింది. ఒకటి జాతీయ మహాసభ కాగా మరొకటి రావినారాయణరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ఆంధ్రమహాసభగా ఏర్పడింది. దోరల వద్ద వెట్టి చేస్తున్న రైతులలో చైతన్యం నింపి వారు బందుకు (తుపాకి) ఎత్తేటట్లు చేశారు.
1946-48 మధ్య కాలంలో హైదరాబాదు రాజ్యంలో తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా నిజాం పోలీసుల దౌర్జన్యాలను, రజాకార్ల అకత్యాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా సంచరిస్తూ గెరిల్లా దళాలను సమకూర్చారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న నిజాం ప్రభుత్వానికి, దాని అనుయాయులైన భూస్వాములకు, పెత్తందార్లకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడానికి దళాలను సైతం ఏర్పాటు చేసారు.
200 ఎకరాల స్వంత భూమి నిరుపేదలకు పంపిణీ
భూమి లేని నిరుపేదలకు 200 ఎకరాల తన స్వంత భూమిని దానం చేసి ఉదారతను చాటిన గొప్ప మానవతావాది నారాయణరెడ్డి. ఆయన చేపట్టిన సాయుధ పోరాటానికి భయపడిన నిజాం ప్రభుత్వం 1946లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. నిజాం ప్రభుత్వం తెలంగాణ పోరాటయోధులపై పట్ల విధించిన నిషేధాజ్ఞల కారణంగా ఆయన రాత్రిళ్ళలో మారువేషం ధరించి గ్రామాల్లోని ప్రజలను చైతన్య పరిచేందుకు సమావేశాలు నిర్వహించేవారు.
1951-52లో స్వాతంత్య్రానంతరం దేశంలో జరిగిన తొలి లోక్‌ సభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) పార్టీ అభ్యర్థిగా పోటీచేసి దేశంలోనే అత్యధిక మెజారిటీ పొందిన ఘనత సాధించిన పార్లమెంటు సభ్యుడిగా రికార్డు సష్టించారు. దేశంలోనే అత్యధిక మెజార్టీ రావడంతో ముందుగా అన్నుకున్న మేరకు నాటి పార్లమెంట్‌ ను రావి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. 1957లో జరిగిన జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొంది 1962 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ్యుడిగా పదవిని నిర్వహించడమే కాకుండా ప్రతిపక్ష నేతగా కొనసాగారు.అహర్నిశలు పేద ప్రజల కోసం పోరాటాలు చేసి వారి మదిలో చిరస్థాయిగా నిలచిన రావి నారాయణరెడ్డి సెప్టెంబర్‌ 7, 1991 వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన చేసిన సేవలకు గాను భారతప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌ తో సత్కరించింది. ప్రపంచ ఉద్యమాలలో తెలంగాణ సాయుధ విప్లవ రైతాంగ పోరాటలకు స్థానం కల్పించిన యోదులల్లో ముఖ్యుడు. నడికుడీ రైలు మార్గని పార్లమెంట్‌ లో ప్రస్తావన చేసి పనులు నిర్వహించే విధముగా కృషి చేశారు.