home page

ఖాసిం రిజ్వీ లేనిదే నిజాం చరిత్ర ఏదీ?

రజాకార్ల ప్రతిరూపం రిజ్వీ

 | 
Rizvi

తెలంగాణ విలీనమా? విమోచనమా?

రజాకార్లు, సయ్యద్‌ ఖాసీం రజ్వీ ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్ర లేదు. 

రజాకార్లకు సయ్యద్‌ ఖాసీం రజ్వీ ఎలా నాయకుడయ్యాడు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఉర్దూ భాషలో రజాకార్‌ అంటే.. ఎలాంటి పారితోషికం ఆశించకుండా సేవ చేసే వాలంటీర్‌. కానీ రజాకార్లు తమ ఉన్మాదంతో చీకటి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. 1947 జూలై నాటికి హైదరాబాద్‌ సంస్థానం వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది రజాకార్లు ఉండేవారు. వారిలో 75 వేల మంది శిక్షణ పొందినవారు. రజాకార్ల కార్యకలాపాల కోసం అప్పట్లోనే రోజుకు దాదాపు 30 వేల రూపాయల దాకా ఖర్చు చేసేవారు. ఆ సొమ్మంతా ప్రజల నుంచి బలవంతంగా పన్నుల రూపంలో వసూలు చేసిందే. ఈ రజాకార్లు.. 1927లో నిజాంకు అనుకూలంగా స్థాపితమైన 'మజ్లిస్‌ ఈ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం)'కు చెందిన పారామిలటరీ దళం. ఎంఐఎం నేత బహదూర్‌ యార్‌ జంగ్‌ ఈ దళాన్ని ఏర్పాటు చేశాడు. 1944లో జంగ్‌ మరణానంతరం ఎంఐఎం నాయకత్వం ఖాసిం రజ్వీ చేతుల్లోకి వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన నిజాం రాజు పునాదులు.. జాగీర్దార్లు, దొరలపైనే ఆధారపడి ఉండేవి.

నవాబు పాలనకు, ఆ దొరల అకృత్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతం కావడం, ప్రజలు హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి అనుకూలంగా ఉండడంతో.. వారిని అణచివేయడానికి ఖాసీం రజ్వీ తన రాక్షసమూకను ప్రయోగించాడు. నిజాంకు, ప్రభుత్వానికి వ్యతిరేకులైనవారిని కాల్చిచంపేయడం... ప్రజల ఆస్తిపాస్తులను దోచుకున్నంత దోచుకుని, నాశనం చేయడం, ఇళ్లు, వాకిళ్లు కాల్చేయడం, మహిళలను చెరబట్టి వారిపై అత్యాచారం చేయడం, వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించడం, భార్యల ముందే వారి భర్తల ప్రాణాలు తీయడం, ఇళ్లల్లోకి చొరబడి చాయ్‌ కావాలని అడగడం.. పాలు లేవని చెబితే మహిళల చనుబాలతో చాయ్‌ పెట్టివ్వాలని వేధించడం, రైళ్లల్లో దోపిడీలు.. ఇలా వారి దమనకాండకు, దారుణాలకు హద్దులే ఉండేవి కావు. నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడని పాత్రికేయుడు షోయబుల్లాఖాన్‌ను కాల్చి చంపారు. ఆయన చేతులు నరికేశారు.

1947 సెప్టెంబరు 2న పరకాలలో.. జాతీయపతాకాన్ని ఎగురవేసేందుకు వచ్చిన ప్రజలపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి 15 మంది ప్రాణాలు బలిగొన్నారు. 1948 ఆగస్టు 27వ తేదీన.. బైరాన్‌పల్లిలో 400 మంది నిజాం సైనికులు చేసిన ఘోరాలు జలియన్‌ వాలాబాగ్‌ దురంతానికి ఏమాత్రం తీసిపోవంటే అతిశయోక్తి కాదు. నాడు ఆ పల్లెను చుట్టుముట్టిన రజాకార్లు.. 88 మందిని నాలుగు వరుసల్లో నిలిపి ఉంచి.. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అనే కనికరమైనా లేకుండా అందరినీ తుపాకులతో కాల్చిచంపేశారు. ఆరోజు ఆ నరరూప రాక్షసులు మొత్తం 118 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. మహిళలను వివస్త్రలను చేసి.. కొన ఊపిరితో కొట్టుకుంటున్న వారి ముందు.. చనిపోయినవారి శరీరాల చుట్టూ.. బతుకమ్మ ఆడించారు. ఇలా చెప్పుకొంటూ పోతే వారి అరాచకాలకు అంతే లేదు. నిత్యం రజాకార్లు రక్తపుటేర్లను పారిస్తుంటే.. ప్రజలంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని బతికేవారు. ప్రజల మీదే కాదు.. ఒక దశ దాటిన తర్వాత నిజాంపైన కూడా రజ్వీ ఒత్తిడి తెచ్చి తాను చెప్పినట్టల్లా ఆడేలా చేయగలిగాడు.

ముఖ్యంగా భారతదేశంలో విలీనానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని.. అలా ఒప్పుకొంటే ప్రభుత్వంపైనే దాడి చేస్తామని బెదిరించాడు. అయితే.. కాలక్రమంలో రజాకార్లపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. సహనం నశించిన ప్రజలు విప్లవసంఘాలు పెట్టి, ఆయుధాలు సంపాదించి వారిపై ఎదురుదాడులు చేయడం మొదలుపెట్టారు. రజాకార్ల క్యాంపులను వెతికి వెతికి ధ్వంసం చేసేవారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి తదితరులు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి రజాకార్లకు, నిజాం పోలీసు, మిలటరీ దళాలకు చెమటలు పట్టించారు. మరోవైపు.. నిజాం రాజ్యంలో రజాకార్ల దారుణమారణకాండపై.. నాడు హైదరాబాద్‌లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఏజెంట్‌ జనరల్‌ కేఎం మున్షీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేసేవారు. భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై పోలీసుచర్య జరపడానికి రజాకార్ల అరాచకాలు ఒక ప్రధాన కారణం. తరాలపాటు సాఫీగా సాగిన అసఫ్‌ జాహీ వంశ పాలన తుది దశలో రజ్వీ మూలంగా అప్రతిష్ఠపాలైంది.

ఎవరీ ఖాసిం రజ్వీ?

ఖాసిం రజ్వీ పేరున్న వక్త, న్యాయవాది. స్వస్థలం ఉత్తరప్రదేశ్‌. నాటి హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉన్న లాతూర్‌(ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న) పట్టణానికి వలస వచ్చాడు. 1946 డిసెంబరులో ఎంఐఎం అధ్యక్షుడిగా ఎదిగి అనూహ్యంగా నవాబ్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌కు ఆంతరంగికుడయ్యాడు. నిజాం ప్రభుత్వంలో చివరి దశలో రజ్వీ మాటే చెల్లుబాటైంది. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలనే ప్రతిపాదనకు అడ్డుపడుతూ వచ్చాడు. హైదరాబాద్‌ స్వతంత్ర దేశంగా ఉండాలని ఎంతగానో ఉవ్విళ్లూరాడు. ఒక దశలో నిజాం కూడా అయోమయంలో రజ్వీ మాటలను నమ్మాడు.

విమానం మిస్‌..

హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. ఇక్కడే ఉంటే జనం చేతిలో చావు తప్పదన్న విషయం రజ్వీకి అర్ధమైంది. దీంతో పాకిస్థాన్‌కు పారిపోయేందుకు విఫలయత్నం చేశాడు. 1948 సెప్టెంబరు 16న తెల్లవారుజామున అరబ్బు దేశాలకు ఆయుధాలు విక్రయించే ఆస్ట్రేలియా దళారి అయిన కాటన్‌ విమానంలో పాక్‌కు చేరాలని భావించాడు. అయితే హకీంపేటలోని విమాన స్థావరానికి చేరుకొన్న రజ్వీను ఎక్కించుకోకుండానే విమానం ఎగిరిపోయింది. దానిని అందుకునేందుకు రన్‌వేపై రజ్వీ పరిగెత్తుకొంటూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత హైదరాబాద్‌ దారుస్సలాంలోని ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో భారత సైనికులు రజ్వీని అరెస్టు చేశారు. 1948 మద్రాస్‌ రైలు దోపిడీ కేసులో హైదరాబాద్‌ సంస్థానం పోలీసు చట్టం కింద అరెస్టయిన రజ్వీ.. కొత్త భారత రాజ్యాంగం ప్రకారం హైదరాబాద్‌ చట్టం చెల్లదని వాదించాడు. ఇతర కేసుల్లో ప్రత్యేక న్యాయస్ధానం 1950లో ఏడేళ్ల జైలుశిక్ష విధించింది.

కరాచీలో మరణం

శిక్ష అనంతరం మహారాష్ట్ర యరవాడ జైలు నుండి హైద్రాబాద్‌కు వచ్చిన రజ్వీ.. ఎంఐఎం అధ్యక్ష పదవిని ఇతరులకు అప్పగించే ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు యువకుడైన అబ్దుల్‌ వహేద్‌ ఒవైసీ(ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తాత) సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఆయనకు అధ్యక్షపదవి అప్పచెప్పి 1957 సెప్టెంబరు 11న పాక్‌కు వెళ్లిపోయాడు. రజ్వీ 1970లో కరాచీలో మరణించాడు. ఆయన కూతుళ్లు పాక్‌ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తూ.. ఒకరు శాసనసభకు, మరొకరు పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు. కొద్ది సంవత్సరాల క్రితం రజ్వీ మనుమరాలు అతీయాఖాన్‌ హైదరాబాద్‌ను సందర్శించింది.Rizvi