నవాబు మధ్యవర్తి' జగిత్యాల' ఉస్మానొద్దీన్
భారత సైన్యం ముందు లొంగిపోయిన నిజాం
నవాబు వెంట వెనక ఉస్మానొద్దీన్ (రౌండప్‌లో)
జగిత్యాల: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారతావనిలో కలువగా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.
ఈ నేపథ్యంలో అప్పటి హోంమంత్రి సర్దార్‌వల్లభాయ్ పటేల్, చివరి నిజాం నవాబ్ మీర్ఉస్మాన్ అలీఖాన్‌ల మధ్య జరిగిన చర్చలు రజాకార్ల చర్య, పోలీసుల ప్రతిచర్య తదితర కీలక సందర్భాల్లో జగిత్యాలకు చెందిన మహ్మద్ ఉస్మానొద్దీన్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్‌పటేల్ భారత రాయబారి కె.మున్షిలు హైదరాబాద్ నవాబుతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేసిన మహ్మద్ ఉస్మానొద్దీన్ చేతుల మీదుగానే ఇటు నవాబుకు అటు పటేల్, మున్షికి అందాయి. రజాకార్ల ప్రాబల్యం పెరిగి పోలీసు వ్యవస్థపై నిజాం విశ్వాసం కోల్పోయిన సమయంలో భారత్ మున్షి ద్వారా ఉస్మానొద్దీన్పై నమ్మకం పెరిగింది. సర్దార్ పటేల్ మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికిన సమయంలో ఉస్మానొద్దీన్ నవాబు వెంటే ఉన్నాడు.
రజాకార్ల దమనకాండలో పాల్గొన్న పోలీసులు, ఉద్యోగులను భారత ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించినప్పటికి ఉస్మానొద్దీన్ సత్ప్రవర్తన మూలంగా అతనికి ఎలాంటి శిక్ష విధించలేదు. ఉస్మానొద్దీన్ బాల్యం జగిత్యాలలోనే గడవగా నవాబు వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిగా ఉండడం మొదటి భార్య మృతి చెందగా రెండవ వివాహం చేసుకోవడంతో అతనికి జగిత్యాలకు మధ్య దూరం పెరిగింది. ఉస్మానొద్దీన్ కుమారుడు యూసుఫ్సాజిద్ జగిత్యాలలో పోస్టుమాస్టర్‌గా పనిచేసి ఆరేళ్ల కిందట మృతి చెందాడు.