home page

వరద సాయం గుండు సున్నా!

ఇది తెలంగాణ పై కేంద్రం వివక్ష : కేటీఆర్ 

 | 
Ktr
వరద సాయం గుండు సున్నా
కేంద్రము.. విపత్తు!
తెలంగాణపై వివక్ష.. పార్లమెంటు సాక్షిగా ఒప్పుకొన్న కేంద్రం
నాలుగేండ్లలో తెలంగాణకు పైసా ఇవ్వని కేంద్రం
2020 హైదరాబాద్‌ వరదలకు, ఇప్పుడు గోదావరి వరదలకు మీరు సాయం అందించలేదు. ఎందుకు?' -మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌
నాలుగేండ్లు.. ప్రతి సీజన్‌లోనూ వరదలు వస్తున్నాయి. వెళ్తున్నాయి. వరదలు వచ్చిన ప్రతిసారీ విపత్తు సహాయం చేయాలని రాష్ట్రం కోరుతూనే ఉన్నది. కానీ.. కేంద్రం ఒక్క పైసా విదల్చలేదు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు మాత్రం పోచికోలు ముచ్చట్లు చెప్తూ కాలం వెళ్లదీస్తుంటారు. కుప్పలు తెప్పలుగా కేంద్రం డబ్బులు వెదజల్లుతున్నట్టు ఊదరగొడుతుంటారు. ఇదిగో నిజం.. మంగళవారం లోక్‌సభ సాక్షిగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌.. అస్సాం ఎంపీ ప్రద్యూత్‌ బోర్డోలాయ్‌ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు లోని సారాంశం.. 'నాలుగేండ్లలో తెలంగాణకు వరద సాయం నిమిత్తం మేం ఒక్క పైసా ఇవ్వలేదు' అని. 2018 నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు 21 రాష్ర్టాలకు రూ.44,219 కోట్లు పంపిణీ చేశామని నిత్యానందరాయ్‌ ఏకంగా జాబితా విడుదలచేశారు.
ఆ 21 రాష్ర్టాల్లో తెలంగాణ మాత్రం లేదు. 2018 నుంచి ఇప్పటివరకు జాతీయ విపత్తు సహాయ నిధి కింద ఏ రాష్ర్టానికి ఎంత వరదసాయం చేశారని అస్సాం ఎంపీ అడిగారు. వరదలు వచ్చిన రాష్ర్టాలకు ఈ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. తెలంగాణలో 2019, 2020లో భారీగా వరదలు వచ్చాయి. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు కేంద్ర బృందాలు వచ్చి టూర్‌ చేసి వెళ్లాయి కూడా! తెలంగాణకు మాత్రం రూపాయి సాయం అందలేదు. నాలుగేండ్లలో వివిధ రాష్ర్టాలకు వరద సాయంగా కేంద్రం రూ.44,129.91 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది జూలై 12 వరకు రూ.52.74 కోట్లు సాయం అందించింది. అంటే మొత్తంగా వరద సాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ.44,182.65 కోట్లు అందించింది. ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, బీహార్‌కు భారీ మొత్తంలో వరద సాయాన్ని అందించింది. ఏపీకి నాలుగేండ్లుగా రూ.1004.88 కోట్లు, రూ.570.91కోట్లు, రూ.657.03కోట్లు, రూ. 351.43 కోట్లు ఇచ్చారు. తెలంగాణకు మాత్రం గుండు సున్నా చుట్టింది.
Map

సాయం అడిగినా.. స్పందన కరువు

బీజేపీ పాలిత రాష్ర్టాలకు కేంద్రం అడగకపోయినా. సాయం చేస్తున్నది. మిత్రపక్ష రాష్ర్టాలకు అడిగిందే తడువుగా ఇస్తున్నది. కానీ ఇతర రాష్ర్టాలు మాత్రం కేంద్రానికి కనిపించడంలేదు. ముఖ్యంగా తెలంగాణను మోదీ, షా ద్వయం పరిగణనలోకి తీసుకోవడంలేదు. 2020 అక్టోబర్‌లో అతిభారీ వర్షాలకు హైదరాబాద్‌ అతలాకుతలమైంది. కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలు తీర్చేందుకు గానూ సీఎం కేసీఆర్‌ స్వయంగా కల్పించుకొని తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు ఇవ్వాలని, మొత్తం సాయంగా రూ.5 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. కానీ ఆ లేఖ బుట్టదాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వ వేదన.. అరణ్య రోదన అయింది. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్రం పట్టించుకోలేదు. దీంతో సీఎం కేసీఆర్‌ వరద బాధితులకు రూ. 10వేల చొప్పున పరిహారం అందించారు.

కిక్కురుమనని బీజేపీ నేతలు

రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలుగా ఆరోపణలుచేసే బీజేపీ రాష్ట్ర నేతలు.. రాష్ర్టానికి కేంద్రం చేస్తున్న నష్టంపై కిక్కురుమనడం లేదు. నాలుగేండ్లుగా వరద సాయం చేయలేదని కేంద్రమే ఒప్పుకొన్నది. అయినప్పటికీ ఇవేవి బీజేపీ నేతలకు కనిపించవు. ఇక్కడి ప్రజల ఓట్లతో పదవులు అనుభవిస్తూ.. ఆ ప్రజలకు, రైతులకు అన్యాయం జరుగుతుంటే కేంద్రాన్ని మాత్రం పల్లెత్తు మాట అనరు. అన్యాయంపై ప్రశ్నించరు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి బాధితులకు భరోసా కల్పిద్దామనే ఆలోచన ఇసుమంత కూడా లేదు. హైదరాబాద్‌ వరదల సమయంలోనూ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే రూ.10 వేల ఆర్థిక సాయం చేసినా.. దానిపైనా బీజేపీ నేతలు విష ప్రచారం చేశారు.