రాష్ట్ర ప్రభుత్వాలను అప్పుల్లో ముంచుతున్న కేంద్రం
బిజెపి అసంంబద్ధ ఆర్ధిక విధానం
రాష్ట్రవాటాల్లో కోత: అడిగితే వాత
సామాన్యులపై ఎడాపెడా పన్నులు మోపి ఆదాయాన్ని పెంచుకొంటున్న కేంద్ర ప్రభుత్వం.. రాబడిలో రాష్ర్టాలకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటాను కుదిస్తూ వాటిని అప్పులపాలు చేస్తున్నది.
వసూలైన పన్నుల నుంచి రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా నిధులు విడుదల చేయకుండా రూ.వేల కోట్లు తన వద్దే ఉంచుకొంటున్నది
- రాష్ట్రాలను రుణగ్రస్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు
- ఆదాయం దండిగా వస్తున్నా రాష్ర్టాలకు మొండిచేయి
- షేరబుల్ పన్నుల్లో రాష్ర్టాల వాటా భారీగా కుదింపు
- నాన్-షేరబుల్ పన్నుల్లో సింహభాగం కేంద్రానికే:
- సామాన్యులపై ఎడాపెడా పన్నులు మోపి ఆదాయాన్ని పెంచుకొంటున్న కేంద్ర ప్రభుత్వం.. రాబడిలో రాష్ర్టాలకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటాను కుదిస్తూ వాటిని అప్పులపాలు చేస్తున్నది. వసూలైన పన్నుల నుంచి రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా నిధులు విడుదల చేయకుండా రూ.వేల కోట్లు తన వద్దే ఉంచుకొంటున్నది. దీంతో వ్యవసాయం, రవాణా, విద్య, వైద్యం లాంటి కీలక రంగాల కోసం రాష్ర్టాలు భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి . కేంద్రం వసూలు చేసే పన్నులు షేరబుల్, నాన్-షేరబుల్‌గా ఉంటాయి. షేరబుల్ పన్నుల్లో కేంద్రం రాష్ర్టాలకు విధిగా నిర్దిష్ట వాటాను విడుదల చేయాలి. ఇవి కాకుండా సెస్సులు, సర్‌చార్జీల్లాంటి నాన్-షేరబుల్ పన్నుల్లో మాత్రం కేంద్రం తనకు ఇష్టమైనంత వాటాను రాష్ర్టాలకు విడుదల చేయవచ్చు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం.. షేరబుల్ పన్నుల్లో కేంద్రానికి 59%, రాష్ర్టాలకు 41% దక్కాల్సి ఉన్నప్పటికీ అలా జరగటం లేదు. షేరబుల్ పన్నుల్లో 63 శాతాన్ని కేంద్రం తనవద్దే ఉంచుకొని, రాష్ర్టాలకు 37% మాత్రమే వాటా ఇస్తున్నట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నాన్-షేరబుల్ పన్నుల రూపంలో వచ్చే రాబడిలో కూడా సింహభాగాన్ని కేంద్రమే తీసేసుకొంటున్నది.
రాష్ట్రాల వాటాల్లో కోతల పరంపర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ, వ్యయాల్లో భారీ వ్యత్యాసానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయకపోవడం ఒక కారణమైతే.. కేంద్రం వసూలు చేసే నాన్-షేరబుల్ పన్నుల్లో రాష్ట్రాలకు కచ్చితమైన వాటా నిర్ణయించకపోవడం మరో కారణం. 2015లో నాన్-షేరబుల్ పన్నుల నుంచి రాష్ర్టాలకు 13.5% వాటా ఇచ్చిన కేంద్రం.. 2018లో 10.6 శాతానికి తగ్గించింది. 2021లో కూడా కోత పెట్టింది.
కొవిడ్ కష్టకాలంలోనూ..
కొవిడ్ సంక్షోభం ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలనూ ఆర్థికంగా కుంగదీసినప్పటికీ మోదీ సర్కార్‌కు మాత్రం ఆదాయం తగ్గలేదు. సామాన్యులపై ఎడాపెడా పన్నులు మోపడమే ఇందుకు కారణం. 2014 ఆర్థిక సంవత్సరంలో షేరబుల్, నాన్-షేరబుల్ పన్నుల ద్వారా కేంద్రానికి మొత్తం రూ.11.4 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఆ తర్వాత నుంచి ఇది అంతకంతకూ పెరిగి 2021లో రూ.20.3 లక్షల కోట్లకు చేరింది. 2023 ఆర్ధిక సంవత్సరంలో ఇది రూ.27.6 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. అయినప్పటికీ రాష్ర్టాలకు కేంద్రం ఇచ్చే నిధులు నానాటికీ తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న నిధులను కేంద్రం నిర్ధేశిత అవసరాలకు ఖర్చు పెట్టడం లేదు. 2019లో సామాజిక, సంక్షేమ రంగాల పేరిట కేంద్రం రూ.9 వేల కోట్లు వసూలు చేసినప్పటికీ ఆ నిధులను ఆయా రంగాలకు ఖర్చు చేయలేదు. ఆ ఏడాది వసూలు చేసిన మొత్తం సెస్సుల్లో 40% నిధులను అసలు విడుదలే చేయలేదని కాగ్ తప్పుబట్టింది. అలాగే క్రూడాయిల్‌పై కేంద్రం రూ.1.28 లక్షల కోట్ల సెస్సు వసూలు చేసినప్పటికీ ఆ నిధులను ఆ రంగాలకు వెచ్చించలేదు.