home page

తెలంగాణ కాంగ్రెస్ జంబో కమిటీ

నలుగురు వైస్ ప్రెసిడెంట్లు 

 | 
Congress hand

కోమటిరెడ్డి కి దక్కని అవకాశం 

తెలంగాణలో  వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. తనదైన వ్యూహాలతో ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీల్లో పలు మార్పులు, చేర్పులు చేసింది.

అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీని 18మందితో ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురిని నియమించింది. 26 జిల్లాల అధ్యక్షులతో పాటు.. 24 మంది టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్లను, 84 మంది జనరల్‌ సెక్రటరీలను నియమించింది. ఐదు జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అయితే ఏ కమిటీలోనూ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం కల్పించలేదు. గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు.. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని, బీజేపీ నేత, తన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డికి సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షోకాజు నోటీసులు జారీచేసింది. దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అవకాశం కల్పించలేదు.

మాణికం ఠాగూర్ ఛైర్మన్‌గా 18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ కమిటీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు.. మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కె. జానా రెడ్డి, టి. జీవన్ రెడ్డి, డాక్టర్‌ జె. గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర్ రాజ నరసింహ, రేణుకా చౌదరి, పి. బలరాం నాయక్, మధు యాష్కీ గౌడ్, చిన్నా రెడ్డి, శ్రీధర్ బాబు, వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్‌కు అవకాశం కల్పించారు. అలాగే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌లు రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండనున్నారు.

మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా మాజీ క్రికెటర్‌ ఎండీ అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్‌లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అలాగే వనపర్తి జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ స్థానంలో రాజేంద్రప్రసాద్ యాదవ్ కు అవకాశం కల్పించగా, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోమురయ్య స్థానం లో రాజ్ ఠాకూర్‌ను, మహాబూబ్ నగర్ జిల్లాకు కొత్వాల్ స్థానం లో జి.మధుసూధన్ రెడ్డిని, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ స్థానం లో ఆది శ్రీనును కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రోహిణ్ రెడ్డిని నియమించింది.