మోడీ! ఎందుకు ఈ కిరాతకం ?
*మోదీ ఎందుకీ కిరాతకం..?*
*ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు*
నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్‌ఎస్ బహిరంగ సభకు టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై ప్రసంగించారు. ‘ఇవాళ నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు హైదరాబాద్ నుంచి మునుగోడు వచ్చారు. నిన్నామొన్న కొంత మంది ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని.. మీకు వంద కోట్ల రూపాయలు ఇస్తాం.. మీరు పార్టీ విడిచిపెట్టి రమ్మని చెప్పి.. వాళ్లను ఎడమకాలి చెప్పుతో కొట్టి అమ్ముడుపోవుడు కాదురా.. మేం అంగట్లో సరుకు కాదు.. తెలంగాణ బిడ్డలమని.. తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు ఎత్తారు.
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రెగా కాంతారావు లాంటివారు కావాలి రాజకీయాలకు. జాతి గౌరవాన్ని, దేశగౌరవాన్ని అంగట్లో పశువుల్లా అమ్ముడుపోకుండా.. వందకోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టి తెలంగాణను కాపాడిన బిడ్డలు. వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొలగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? అని ప్రశ్నించారు.
మోదీ ఎందుకీ కిరాతకం ?
‘నరేంద్ర మోదీని అడుగుతున్నా నీకు ఇంకా. దేశంలో ప్రధాని పదవిని మించి పదవి ఇంకా లేదు కదా. ఒకసారి కాదు రెండుసార్లు అవకాశం వచ్చింది కదా? ఎందుకు ఈ కిరాతకం. ఎందుకీ అరాచకం. దేశం కోసం, సమాజానికి ఏ రకంగా మంచిదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నరు. మోదీ అండదండలు లేకుండానే ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఇప్పుడు చంచల్‌గూడ జైలులో ఉన్నరు. వాళ్లు ఆఫర్ చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరగాలి. దీని వెనుక ఎవరు ఉన్నరో వారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కాదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా? ఆలోచించాలని కోరుతున్నా’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
గాడిదలకు గడ్డేసి.. ఆవులకు పాలు పిండితే వస్తయా
‘మౌనంగా ఉంటే.. ఆ మౌనమే శాపమైతది. ప్రేక్షకుల్లా చూసి మనది కాదు అనుకూనే సందర్భం కాదు. ప్రతి విద్యావంతుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు ఊరికి వెళ్లిన తర్వాత చర్చ చేయాలి. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసే టప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడుదలకు గడ్డేసి.. ఆవులు పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదికి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాలి’ అని సీఎం కేసీఆర్ సూచించారు..