ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం: తృణమూల్ కాంగ్రెస్
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అయితే తాను ఎటువంటి పోస్టర్ కు మద్దతు ఇవ్వలేదని, ధూమపానం గురించి ప్రస్తావన తేలేదని మహువా స్పష్టం చేశారు.
అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు జితేన్ ఛటర్జీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భోపాల్ పోలీసులు ఆమెపై ఐపీసీలోని 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మహువా మోయిత్రా వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కూడా స్పందించారు. ''మహువా మోయిత్రా ప్రకటనతో హిందూ మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందూ దేవతలను అవమానించడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు'' అని ఆయన చెప్పారు.
అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ మోయిత్రా ఓ పోస్టు చేశారు. తాను కాళీ ఆరాధకురాలనేని చెప్పారు. తాను దేనికీ భయపడనని అన్నారు. ''మీ గూండాలకు, మీ పోలీసులకు, మరి ముఖ్యంగా మీ ట్రోల్స్‌కు'' భయపడనని చెప్పారు. సత్యానికి వెనక మద్దతుగా నిలిచే దళాలు అవసరం లేదని ట్వీట్ చేశారు.అసలేం జరిగిందంటే..
నటి లీనా మణిమేగలై తన తాజా చిత్రం కాళీ కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్ తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల కోల్‌కతాలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఎంపీ మహువా మోయిత్రా మాట్లాడుతూ.. కాళీ దేవిని ''మాంసాహారం, మద్యపానం స్వీకరించే దేవత''గా ఊహించుకునే హక్కు తనకు ఉందని.. ప్రతి వ్యక్తికి తమదైన రీతిలో దేవుడిని పూజించే హక్కు ఉందని అన్నారు. ''ఉదాహరణకు మీరు భూటాన్ లేదా సిక్కింకు వెళితే.. అక్కడివారు పూజలు చేసినప్పుడు వారి దేవుడికి విస్కీ ఇస్తారు. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి మీ దేవుడికి విస్కీని ప్రసాదంగా ఇస్తానని చెబితే.. అది దైవదూషణ అని వారు అంటున్నారు'' అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"నాకు కాళీ దేవి మాంసాహారం, మద్యపానాన్ని స్వీకరించే దేవత. మీరు తారాపీత్ (పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని ఒక ప్రధాన శక్తి పీఠం)కి వెళితే.. అక్కడ మీరు ధూమపానం చేసే సాధువులను చూస్తారు. అది అక్కడ ప్రజలు పూజించే విధానం. హిందూమతంలో కాళీ ఆరాధకురాలిగా ఉన్న నాకు, కాళిని ఆ విధంగా ఊహించుకునే హక్కు ఉంది. అది నా స్వేచ్ఛ'' అని చెప్పారు. ''మీ దేవుణ్ణి శాకాహారిగా, తెల్లని దుస్తులు ధరించి పూజించే స్వేచ్ఛ మీకు ఉంది.. అలాగే నాకు అది (మాంసం తినే దేవతను ఊహించు) చేసే స్వేచ్ఛ ఉంది'' అని పేర్కొన్నారు.
తీవ్రంగా మండిపడ్డ బీజేపీ..
మహువా మోయిత్రా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. హిందూ దేవుళ్లను అవమానించడం పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు అధికారిక వైఖరిగా మారిపోయిదంటూ మండిపడింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. మోయిత్రాను టీఎంసీ సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
తమకు సంబంధం లేదన్న తృణమూల్ కాంగ్రెస్..
మోయిత్రా వ్యాఖ్యలను ఆమె సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ''ఇండియాటూడే కాన్‌క్లేవ్‌లో మోయిత్రా చేసిన వ్యాఖ్యలు, కాళీ దేవిపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతమైనవి. వాటిని ఏ పద్ధతిలో లేదా రూపంలో పార్టీ ఆమోదించలేదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అటువంటి వ్యాఖ్యలనుతీవ్రంగా ఖండిస్తుంది'' అని టీఎంసీ ట్వీట్ చేసింది.
అయితే తన వ్యాఖ్యలపై మంగళవారం స్పందించిన మోయిత్రా.. తాను ఏ సినిమా లేదా పోస్టర్‌కు మద్దతు ఇవ్వలేదని చెప్పారు. ధూమపానం అనే పదాన్ని ప్రస్తావించలేదని చెప్పారు.