యూసీసీ అమలు దేశంలో బహుళత్వం పై దాడి :విపక్షం
యూసీసీ పై మోదీ ముందడుగు!
Jun 29, 2023, 08:47 IST
| హిందూ మతం కోసం కమలం కుతూహలమా?
యుసిసి అమలు దేశ బహుళత్వం, వైవిధ్యంపై దాడి
ప్రతిపక్షాల విమర్శ
న్యూఢిల్లీ : ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) అమలు దేశ బహుళత్వం, వైవిధ్యంపై దాడి చేయడమేనని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. దేశంలో యుసిసి అమలు చేయాలని, కానీ ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నట్టు ప్రధాని మోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. భోపాల్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. హిందూ మతంలో ముందుగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలనీ, దేశంలోని ప్రతి ఆలయంలో ఎస్‌టీలు, ఎస్‌సీలు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ ప్రశ్నించారు. యూసీసీ తమకు అవసరం లేదని, ఎందుకంటే రాజ్యాంగం ప్రతి మతానికి రక్షణ కల్పించిందని అన్నారు. ప్రధాని మొదట దేశంలో పెరుగుతున్న పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగంపై స్పందించాల్సి వుందని కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ పేర్కొన్నారు.
ఒకవైపు మణిపూర్ మండిపోతోందనీ, కానీ ప్రధాని మణిపూర్ అంశంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ట్రిపుల్ తలాక్ అనేది ఇస్లాంలో విడదీయరాదని భాగమైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతర్, జోర్డాన్, సిరియా వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మృతిపై ముస్లిం వర్గాన్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. ప్రజలకు రెండు రకాల రూల్స్ ఉంటే ఒక కుటుంబం ఎలా పనిచేస్తుందని, అప్పుడు దేశం ఎలా పనిచేస్తుందని ఆయన ప్రశ్నించారు.
ఒకవేళ ఉమ్మడి పౌరస్మృతి కావాలంటే దాన్ని పార్లమెంట్‌లో బీజేపీ ప్రవేశపెట్టవచ్చనీ, వాళ్లను ఎవరు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో యూసీసీ ప్రవేశపెట్టకుండా, ప్రతిపక్షాలపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. భారత్‌లో ఉన్న బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని ప్రధాని మోడీ సమస్యగా చూస్తున్నారని, యూసీసీ పేరుతో దేశ ఔనత్యాన్ని తగ్గిస్తారా అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసి మండిపడ్డారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే.. : పి. చిదంబరం
ప్రధాని మోడీ ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) ప్రతిపాదనపై కాంగ్రెస్ నాయకులు పి. చిదంబరం విరుచుకుపడ్డారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్వేషపూరిత నేరాల సమస్యల నుండి దేశ ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రధాని యుసిసి ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారని బుధవారం విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజాన్ని విభజించేందుకు బిజెపి యుసిసిని వినియోగిస్తుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం యుసిసిని ప్రజలపై బలవంతంగా రుద్దదని, ఎందుకంటే ప్రజల మధ్య విభజనలను వ్యాప్తి చేయడమే మెజారిటీ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని అన్నారు.
ప్రధాని మోడీ యుసిసిని ఓ సాధారణ ప్రకియలా కనిపించేలా చేస్తున్నారని, అయితే ఇది ఆచరణ సాధ్యం కాదని వెల్లడించిన గత లా కమిషన్ నివేదికను చదవాలని అన్నారు. బిజెపి మాటలు, చేతల కారణంగా నేడు దేశం విడిపోయిందని, ప్రజలపై విధించే యుసిసి విభజనలను మరింత విస్తృతం చేస్తుందని అన్నారు. సుపరిపాలనను అందించడంలో విఫలమైన బిజెపి, ఓటర్లను విభజించేందుకు యుసిసిని ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చిందని మండిపడ్డారు.
యుసిసిని హైలెట్ చేసేందుకు ప్రధాని దేశాన్ని ఒక కుటుంబంతో సమానం చేశారని, ప్రజల కోణంలో నిజంగానే అనిపిస్తుందని, కానీ వాస్తవికతలో భిన్నంగా ఉంటుందని అన్నారు. ఓ కుటుంబం రక్తసంబంధాలతో ముడిపడి ఉంటుందని, కానీ దేశం చట్టపరమైన పత్రమైన రాజ్యాంగం ద్వారా ఓచోటకు చేర్చబడుతుందని అన్నారు. కుటుంబంలో వైవిధ్యమున్నట్లే, రాజ్యాంగం భారత దేశంలోని ప్రజల మధ్య వైవిధ్యం మరియు భిన్నతానికి గుర్తింపునిచ్చిందని తెలిపారు.