భారత సంతతికి చెందిన ప్రధానులు ,ప్రముఖులు !
బ్రిటిష్ గడ్డపై భారతీయుడు
బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు .రెండు వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటన్కు ఇవాళ భారత సంతతికి చెందిన వ్యక్తి సారథ్యం వహించడం చరిత్రకే చరిత్ర
గడిచిన 200 ఏళ్లలో బ్రిటన్ ప్రధానుల్లో రిషి సునాక్ అత్యంత పిన్నవయస్కుడిగా గుర్తింపు పొందారు. వివిధ దేశాల అధినేతలుగా భారత సంతతి వ్యక్తుల జాబితాలో చేరారు రిషి సునాక్. ఈ సందర్భంగా దేశాల అధినేతలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతి వ్యక్తుల వివరాలు తెలుసుకుందాం..
►ప్రవింద్ జుగ్నాథ్.. భారత సంతతికి చెందిన ప్రవింద్ జుగ్నాథ్ 2017లో మారిషస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రవింద్ పూర్వీకులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మారిషస్‌కు వలస వెళ్లారు. ఆయన హిందూ కుటుంబంలో జన్మించారు.
► పృథ్విరాజ్ సింగ్ రూపున్.. 2019లో మారిషస్ ఏడవ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు పృథ్విరాజ్ సింగ్ రూపున్. ఆయన భారత మూలలున్న ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు.
► ఆంటోనియా కోస్టా.. భారత మూలలు కలిగిన ఆంటోనియా కోస్టా 2015లో పోర్చుగల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గోవాలో ఆయనను బబుష్‌గా పిలుస్తారు. కొంకణి భాషలో అత్యంత ప్రియమైన వ‍్యక్తిగా దాని అర్థం.
► ఛాన్ సంటోఖి.. చంద్రికాపెర్సాద్ ఛాన్ సంటోఖి.. సురినామిస్ దేశంలో కీలక రాజకీయ నేత. మాజీ పోలీసు అధికారి. 2020లో సురినామిస్ 9వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇండో-సురినామిస్ హిందూ కుటుంబంలో 1959లో జన్మించారు సంటోఖి.
► మొహమెద్ ఇర్ఫాన్ అలీ.. గయానా 9వ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా 2020, ఆగస్టు 2న ప్రమాణ స్వీకారం చేశారు మొహమెద్ ఇర్ఫాన్ అలీ. లియోనోరాలోని ఇండో-గయానీస్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్ అలీ.
► హలిమా యాకోబ్.. భారత మూలలున్న హలిమా యాకోబ్ సింగపూర్ రాజకీయ నాయకురాలు, మాజీ న్యాయవాది. 2017 నుంచి 8వ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సింగపూర్ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. హలిమా తండ్రి పూర్వీకుల కారణంగా ఆమె భారతీయ ముస్లింగా గుర్తింపు పొందారు.
► వేవల్ రామ్‌కలవాన్.. సీషెల్లోస్ రాజకీయ నాయకుడు, 2020, అక్టోబర్ 26 నుంచి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 1961, మార్చి 15న మహేలో జన్మించారు. 1993-2011, 2016-2022 వరకు ప్రతిపక్ష ఎంపీగా కొనసాగారు. ఆయన గ్రాండ్ పేరెంట్స్ భారత్‌లోని బిహార్ రాష్ట్రానికి చెందిన వారే.
► కమలా హారీస్.. భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యాక్షురాలిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. 2019లో అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ.. విజయవంతం కాలేకపోయారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.