అగ్ని పధ్ ద్వారా యువ సైన్యం
మోడీ ప్రభావం కోసం కేంద్రం తపన
Updated: Jun 15, 2022, 07:03 IST
| మామూలుగా జరిగే ప్రక్రియే, కానీ బిజెపి ప్రచారం
'అగ్నిపథ్’ పేరిట మోదీ సర్కారు స్కీం
పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికే
కొత్త విధానంపై మాజీ సైనికుల గరం
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్రంలోని మోదీ సర్కారు కొత్త స్కీం తెరపైకి తీసుకొచ్చింది.
సాయుధ దళాల్లో యువతను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకోవడానికి 'అగ్నిపథ్’ పేరిట కొత్త విధానాన్ని ప్రకటించింది. నాలుగేండ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం వెల్లడించారు. కేంద్ర క్యాబినెట్ అంతకుముందు ఈ స్కీమ్‌కు ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది తొలి బ్యాచ్ కింద 46 వేల మంది యువతను నియమించుకోనున్నట్టు రాజ్‌నాథ్ తెలిపారు. నాలుగేండ్ల సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన అగ్నివీరుల్ని (బ్యాచ్‌కు 25% మంది చొప్పున) శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. శాశ్వత కమిషన్‌లో ఎంపిక కాని వారికి ఈ స్కీమ్ కింద ఎలాంటి పింఛను ఉండదు. ఈ స్కీమ్‌పై మాజీ సైనిక అధికారులు పెదవి విరుస్తున్నారు. సెలక్ట్ కాని 75% మంది యువత పరిస్థితి ఏమిటి? నాలుగేండ్లు కఠోర శిక్షణ తీసుకున్న తర్వాత కూడా వాళ్లు నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సిందేనా? అని ప్రశ్నిస్తున్నారు. యూజీసీ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం అగ్నిపథ్ కింద సాయుధ దళాల్లో నాలుగేండ్లు పనిచేసిన అగ్నివీర్‌లకు స్కిల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ తెలిపారు.