home page

సంజయ్ రౌత్ అరెస్టు

శివసేనపై మరోఈడీ దాడి

 | 
Sanjay routh
ముంబై: శివసేన  ఎంపీ సంజయ్ రౌత్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. ల్యాండ్ స్కామ్  కేసులో సంజయ్‌రౌత్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రూ.వెయ్యి కోట్లకు  పైగా భూ కుంభకోణానికి పాల్పడినట్లు సంజయ్ రౌత్‌పై ప్రధానంగా ఆరోపణలున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సంజయ్‌రౌత్‌ను ఈడీ ప్రశ్నించింది. కొన్ని గంటల పాటు ఈడీ ఆయనను విచారించింది. సాయంత్రం అదుపులోకి తీసుకుంది. సంజయ్ రౌత్ అరెస్ట్ వార్తలు కలకలం రేపడంతో శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. సంజయ్ రౌత్‌కు  మద్దతుగా, బీజేపీకి  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలకు సంజయ్ రౌత్ అభివాదం చేశారు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఈడీ ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. మరోవైపు సంజయ్ రౌత్ సతీమణి వర్ష రౌత్‌కు, ఆయన ఇద్దరు సన్నిహితులకు చెందిన దాదాపు రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏప్రిల్‌లో జప్తు చేసింది. దాదర్‌ ప్రాంతంలోని వర్ష రౌత్‌కు చెందిన ఓ ఫ్లాట్, ఆమెకు, స్వప్న పట్కర్‌కు ఉమ్మడిగా అలీబాగ్‌లోని కిహిం బీచ్ వద్ద ఉన్న ఎనిమిది స్థలాలను జప్తు చేసింది. సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడైన సుజిత్ పట్కర్ భార్య స్వప్న పట్కర్. ప్రవీణ్ రౌత్, సుజిత్ పట్కర్‌లతోగల సన్నిహిత వ్యాపార, ఇతర అనుబంధం గురించి సంజయ్ రౌత్‌ను ప్రశ్నించాలని ఈడీ భావిస్తోంది. సంజయ్‌కు ప్రవీణ్, సుజిత్ అత్యంత సన్నిహితులు. సంజయ్ సతీమణి వర్ష ఆస్తి లావాదేవీల గురించి కూడా ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

గురుగ్రామ్ ప్రాంతంలోని పట్రా చావల్ రీ-డెవలప్‌మెంట్‌కు సంబంధించిన రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణం కేసులో ప్రవీణ్ రౌత్‌ను అరెస్టు చేసింది. ఆయన ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పట్రా చావల్ రీడెవలప్‌మెంట్‌లో గురు ఆశీష్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమేయం ఉందని, 47 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 672 మంది కౌలుదారులు అద్దెకు ఉంటున్నారని తెలిపింది. ఇది మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్‌మెంట్‌కు చెందినదని పేర్కొంది.