home page

2వేల కోట్లతో కొత్త జాతీయ రహదారులు

ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ రహదారులు

 | 
Roads

త్వరలో నాలుగు కొత్త రోడ్లకు పనులు ప్రారంభం 

ఈనెలాఖరులోగా టెండర్‌లు పిలవాలని  

ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం


సుమారుగా రూ.2,432 కోట్లు ఖర్చు.
ఏడాదిన్నరలోగా పనులు పూర్తయ్యేలా 

అధికారుల ప్రణాళికలు


మరికొన్నిచోట్ల ఆరు వరుసల రహదారుల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: రానున్న రెండు నెలల్లో నాలుగు జాతీయ రహదారుల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతం రాష్ట్ర రహదారులుగా ఇరుగ్గా ఉన్న ఈ రోడ్లు జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన చోట్ల నాలుగు వరుసలుగా, మిగతా ప్రాంతాల్లో 10 మీటర్లు వెడల్పుతో అధికారులు వాటిని విస్తరించనున్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి సుమారుగా రూ.2,432 కోట్లు ఖర్చు కానుండగా ఈనెలాఖరులోగా వీటికి టెండర్‌లను పిలవాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. వీటి ఖర్చును మొత్తం కేంద్రమే భరించనుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో రాష్ట్రానికి నాలుగు జాతీయ రహదారులను మంజూరు చేయగా, అందులో ఒకదానిని నాలుగేళ్ల క్రితం, మిగతా మూడింటిని గతేడాది జాతీయ రహదారులుగా గుర్తించింది. తాజాగా వాటి పనులు ప్రారంభించేందుకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. అందులో భాగంగా వాటికి టెండర్లు పిలిచేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాట్లు చేస్తోంది.

కొన్ని చోట్ల సింగిల్ రోడ్లే..
గతేడాది జాతీయ రహదారుల హోదా దక్కించుకున్న మెదక్- టు సిద్దిపేట, సిద్దిపేట- టు ఎల్క తుర్తి, వలిగొండ- టు తొర్రూరు రోడ్లకు సంబంధించి డిపిఆర్‌లను పరిశీలించిన కేంద్రం పనులకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఈ నాలుగు రోడ్ల పనులు మొదలై ఏడాదిన్నరలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రోడ్లు ఏడు మీటర్ల వెడల్పే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే సింగిల్ రోడ్లుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువగానే ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటిని జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తంగా ఈ నాలుగు రోడ్లకు కేంద్రమే నిధులను ఇవ్వనుంది.

జాతీయ రహదారుల సగటు ప్రతి వంద కిలోమీటర్లకు 3.02 కి.మీ.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల సగటు ప్రతి వంద కిలోమీటర్లకు 3.02 కిలోమీటర్లు కాగా ప్రస్తుతం తెలంగాణలో జాతీయ రహదారుల సగటు 3.44 కిలోమీటర్లుగా ఉంది. ఈ కొత్త రోడ్లతో ఈ సగటు మరి కొంత పెరగనుంది. కొత్తగా అభివృద్ధి చేయనున్న నాలుగూ కీలకమైనవని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నాలుగు జాతీయ రహదారుల్లో భాగంగా జనగామ టు -దుద్దెడల మధ్య దూరం 45.5 కిలోమీటర్లు కాగా, దీనికి రూ.423 కోట్లు ఖర్చు కానుందని, దీనికి (365 బి)గా ఎన్‌హెచ్ నెంబర్‌ను కేటాయించారు. అలాగే మెదక్ టు సిద్దిపేటల మధ్య 70 కిలోమీటర్ల దూరం కాగా దీనికి రూ.882 కోట్లు ఖర్చు కానుండగా (దీనికి 765 డిజి) ఎన్‌హెచ్ నెంబర్‌ను కేటాయించారు. వీటితో పాటు సిద్ధిపేట టు ఎల్కతుర్తిల మధ్య 64 కిలోమీటర్ల దూరం కాగా దీనికి రూ.578 కోట్లు ఖర్చు అవుతాయని దీనికి (765 డిజి) ఎన్‌హెచ్ నెంబర్‌ను, అలాగే వలిగొండ టు తొర్రూరుల మధ్య దూరం 69 కిలోమీటర్లు కాగా దీనికి రూ.549 కోట్లు ఖర్చు కానుండగా (దీనికి 930 పి) ఎన్‌హెచ్ నెంబర్‌ను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కేటాయించారు.

కొన్నిచోట్ల ఆరు వరుసల రహదారులు.
వీటితో పాటు కొన్నిచోట్ల ఆరు వరుసల రహదారులకు సైతం గతంలో కేంద్రం నుంచి అనుమతి లభించింది. అందులో బెంగళూరు హైవే, నిజామాబాద్ హైవేతో పాటు అప్పా జంక్షన్ టు మన్నెగూడ కూడలి వరకు రహదారులతో పాటు మహబూబ్‌నగర్ టు చించోలి (కర్ణాటక) రహదారిని జాతీయ రహదారిగా మార్చడానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఈ నిర్మాణాల కోసం సుమారుగా రూ.7038.68 కోట్లను ఖర్చు కానున్నట్టు కేంద్రం తెలిపింది. ఆ నిధులను కూడా త్వరలోనే కేంద్రం విడుదల చేయనుంది.

ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ కొత్తగా ఎక్స్‌ప్రెస్‌వేలు
దేశంలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ కొత్తగా ఎక్స్‌ప్రెస్‌వేలను కేంద్రం అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా గుజరాత్‌లోని సూరత్ చెన్నై వరకు యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కొన్ని పట్టణాల మధ్య ఎకనామిక్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో ఒకటి 280 కి.మీల నిడివి గల రోడ్డు ఉంది. మహారాష్ట్ర నుంచి ఎపిలోని కర్నూలు వరకు ఉన్న కారిడార్‌ను ఆరు వరుసల రహదారిగా నిర్మించనున్నారు. దీంతోపాటు కర్ణాటక టు తెలంగాణ సరిహద్దులో రాయచూర్ టు గద్వాల్ రోడ్డు నుంచి జులెకల్ గ్రామం వరకు ఒక ప్యాకేజీగా ఇక్కడి నుంచి కర్నూలు వరకు రెండో ప్యాకేజీగా టెండర్‌లను పిలవనున్నారు. దీనికి రూ.1,870 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.

తాజా వార్తల కోసం సందర్శించండి ,

www.mirrotoday.in