చట్టం పరిహాసం చేయడమేనా?యోగీ ఎవరిచ్చారు ఈఅధికారం
సుప్రీం కోర్టు సీజేఐ కు న్యాయకోవిదుల లేఖ
సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని వినతి
సీఎం యోగి వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయారు
నిరసనకారులు పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు వారి ఇండ్లపైకి బుల్డోజర్లను పంపించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని, దీనిపై కోర్టు ఐచ్ఛికంగా చర్య చేపట్టాలని ప్రముఖులు లేఖలో కోరారు. ఈ ఉదంతం రాజ్యాంగాన్ని పరిహాసం చేయడమే కాకుండా మానవ హక్కులను కాల రాసేలా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కస్టడీలో యువకులను లాఠీలతో కొట్టడం, నిరసకారుల ఇండ్లను ఎలాంటి నోటీసు లేకుండా కూల్చేయడం, ముస్లింవర్గానికి చెందిన నిరసనకారులను తరిమి తరిమికొట్టడం వంటి చర్యలు జాతి అంతరాత్మను కుదిపేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. నిరసనలు తెలిపే వారికి ఈ చర్యలు ఒక పాఠంగా మిగిలిపోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉటంకించారు. సీఎం వ్యాఖ్యల వల్లే పోలీసులు మరింతగా రెచ్చిపోయి నిరనసకారులను చిత్రహింసలకు గురిచేశారని గుర్తుచేశారు. కొవిడ్ లాక్‌డౌన్‌లో వలస కార్మికుల దుస్థితిపై, పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పందించిందని, అదే రీతి న ఈ విషయంలోనూ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ యూపీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్నారని జావేద్ అహ్మద్, అతని సన్నిహితుల ఇండ్లను యూపీ సర్కారు బుల్డోజర్లతో నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.