జార్ఖండ్ పై బిజెపి దృష్టి?
సోరేన్ పై అనర్హత వేటుకు ఈసిఐ సిఫార్సు
మహారాష్ట్ర తరహా పరిణామలు జార్ఖండ్ లో తలెత్తేలా కనిపిస్తోంది. హేమంత్ సోరెన్‌ను గద్దె దించడానికి చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆయనపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధుల చట్టం- 1951 కింద శాసన సభ్యుడిగా ఆయనను అనర్హుడిగా గుర్తించేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
దీనిపై ఇదివరకే జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తన అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ సూచించారు.ఆయన చేసిన సూచనల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీల్డ్ కవర్‌లో తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అందులో ఉన్న సారాంశం ఏమిటనేది తెలియరావట్లేదు. మైనింగ్ లీజ్ విషయంలో హేమంత్ సోరెన్.. ప్రజా ప్రతినిధుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ ఫిర్యాదులు చేసింది.
దీంతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సారథ్యంలో జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.
జార్ఖండ్ అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తిమోర్చా-కాంగ్రెస్ సంకీర్ణ కూటమికి 48 స్థానాల బలం ఉంది. రాష్ట్రీయ జనతా దళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ (ఎంఎల్)కు ఒక్కో స్థానం ఉంది. ఈ మూడు పార్టీలు జేఎంఎం-కాంగ్రెస్ సంకీర్ణానికి మద్దతు ఇస్తోన్నాయి. భారతీయ జనతా పార్టీకి ఉన్న సీట్ల సంఖ్య 26. మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, ఇద్దరు స్వతంత్రులతో కలుపుకొని బీజేపీ 30 స్థానాలతో ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది.
హేమంత్ సోరెన్ మీద అనర్హత వేటును వేయాల్సిన పరిస్థితే వస్తే- సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చడానికి బీజేపీ పావులు కదుపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈసీ తన అభిప్రాయాన్ని గవర్నర్‌కు తెలియజేయడం పట్ల హేమంత్ సోరెన్ స్పందించారు. దీని వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ ఎంపీలు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తోన్నాయని, దీనికి కొందరు జర్నలిస్టులు సహకరిస్తోన్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.