home page

ఆప్ సిసోడియాపై అస్సాం సిఎం భార్య 100 కోట్లు పరువునష్టం దావా

అస్సాంలో పీపీఇ కిట్లు కుంభకోణం ఆరోపణ చేసిన సిసోడియా 

 | 
Sisodia
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ భార్య రింకి శర్మ భూయాన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అసోంలో కరోనా పిపిఇ కిట్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని పేర్కొంటూ సిసోడియా తన పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలకు దిగడంపై రింకి శర్మ స్పందించారు. 
ఇప్పటి సిఎం హిమంత రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా తీవ్రత దశలో పిపిఇ కిట్ల కుంభకోణం చోటుచేసుకుందని, శర్మ భార్య, కుమారుడి కంపెనీల నుంచి కిట్స్ తెప్పించి, ఇతర కంపెనీల కన్నా ఎక్కువ ధరలక కాంట్రాక్టు ఇచ్చారని ఇటీవల సిసోడియా విలేకరుల సమావేశంలో ఆరోపించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఉటంకించారు. 
ఈ ఆరోపణకు వ్యతిరేకంగా రింకి శర్మ స్పందించి కోర్టుకు వెళ్లారు. పరువు నష్టం దావా వేశారు. దీనితో ఈ నెల 25న సిసోడియా కామ్రూప్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని వీలు కాకపోతే తన లాయరు ద్వారా వాదనలు విన్పించుకోవచ్చునని న్యాయస్థానం ఆదేశించింది.
ఆమె మంగళవారం కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలోని సివిల్ జడ్జి నంబర్ 1 కోర్టులో దావా వేసినట్లు భుయాన్ శర్మ తరపు న్యాయవాది పద్మాధర్ నాయక్ తెలిపారు. “సిసోడియా అనవసరంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పేరును కూడా వివాదంలోకి లాగారు. అందుకే మేము నష్టపరిహారం కోరుతున్నాము,” అని ఆయన చెప్పారు. 
డిజిటల్ మీడియా పోర్టల్స్ – న్యూ ఢిల్లీకి చెందిన ది వైర్, గౌహతి ఆధారిత ది క్రాస్‌కరెంట్ జూన్ 1న సంయుక్త పరిశోధనా నివేదికలో అస్సాం ప్రభుత్వం నాలుగు కరోనా సంబంధిత అత్యవసర వైద్య సరఫరా ఆర్డర్‌లు చేసిందని, చాలావరకు సరైన ప్రక్రియలు పాటించకుండానే ఉన్నాయని పేర్కొంది.
2020 మార్చి 18 నుండి 23 మధ్య సమాచార హక్కుదరఖాస్తులకు వరుస ప్రత్యుత్తరాలను ఉటంకిస్తూ మీడియా సంస్థలు, నాలుగు ఆర్డర్‌లను రినికి భుయాన్ శర్మ, కుటుంబ వ్యాపార సహచరుడు ఘనశ్యామ్ ధనుకా యాజమాన్యంలోని మూడు సంస్థలు పొందాయని పేర్కొన్నాయి. 
ఒక ట్వీట్‌లో, భుయాన్ శర్మ ఆ కథనాలను ఖండిస్తూ, ఎటువంటి పొరపాటు జరగలేదని, తాము “ఒక్క పైసా” తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆమె నేషనల్ హెల్త్ మిషన్, అస్సాం నుండి ఒక రసీదుని జత చేశారు. ఆమెతో పాటు, ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ, ప్రస్తుత అస్సాం ప్రభుత్వం విడివిడిగా అన్ని ఆరోపణలను ఖండించాయి. ఆరోపణలను “తప్పుడు, ఊహాత్మక, హానికరమైన, స్వార్థ ప్రయోజనాలకు సంబంధించినవి”గా పేర్కొన్నాయి. 2020లో బిజెపి నేతృత్వంలోని మొదటి రాష్ట్ర ప్రభుత్వంలో శర్మ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.