శ్రీ లంక అధ్యక్షుడు ఇల్లు ముట్టడి
తిరగబడిన జనం: చేతులెత్తేసిన లంక సైన్యం
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్ష జంప్
*****
అధికారిక నివాసాన్ని చుట్టుముట్టిన ప్రజలు
**
ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కు తరలించిన సైన్యం
***
అసమర్థ పాలన, అనాలోచిత నిర్ణయాలు వెరసి ఓ దేశాన్ని కుదేలు చేశాయి. ప్రజలు తిండికి, మందులకు ఇతర అత్యవసరాలకు సైతం ఇబ్బందులు పడుతున్నారు.. ఎక్కడా చుక్క పెట్రోలు లేదు.. కొందాం అంటే దేశం ఖాజానాలో డాలర్లు లేవు.. చివరకు ప్రజలు విరిగి వేసారి అధ్యక్ష భవనం పై దాడికి తెగబడగా ఆయన్ను ఆర్మీ జవాన్లు వచ్చి తమ రక్షణలో దాచి ఉంచాల్సిన దుస్థితి వచ్చింది.
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్ష పదవీబాధ్యతల నుంచి దిగిపోవాలంటూ కొలంబోలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. రాజధాని కొలంబోలోని
అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు శనివారం చుట్టుముట్టారు. నిరసనకారుల ఆగ్రహాన్ని పసిగట్టి గొటబయ రాజపక్స అధికారిక నివాసం నుంచి ఆర్మీ హెడ్‌క్వాటర్స్‌కు తరలించామని శ్రీలంక రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని ఇంటెలిజెన్సీ వర్గాలు సమాచారమివ్వడంతో శుక్రవారం రాత్రే అధ్యక్షుడిని ఆర్మీ కార్యాలయానికి తరలించినట్టు వివరించారు. భద్రత దృష్ట్యా అధ్యక్షుడు గొటబయకు ఎస్కార్ట్ కల్పించామని ఆయావర్గాలు వివరించాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముడుతున్న ఆందోళనకారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో సమూహాన్ని చెదరగొట్టేందుకు బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా 30 మంది పౌరులు, పలువురు జవాన్లు గాయపడ్డారు.
అధ్యక్షుడి అధికారిక నివాసం రణరంగంగా మారింది. రాజీనామా చేయాలనే డిమాండ్లతో పెద్ద సంఖ్యలో నిరసనకారులు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ప్రతిపక్ష పార్టీలు సవాలు చేయడంతో పోలీసులు కర్ఫ్యూని ఎత్తివేశారు. దీంతో వేలాది మంది నిరసనకారులు అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లారు. భద్రతా బలగాల బారికేడ్లను దాటుకుని మరీ లోపలికి ప్రవేశించారు. 22 లక్షల మంది శ్రీలంక వాసులు తీవ్ర సంక్షోభం ఉండడంతో అధ్యక్ష పదవి నుంచి గొటబయ రాజపక్స తప్పుకోవాలని శ్రీలంకేయులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని కొలంబో నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారు. ప్రణాళికకు అనుగుణంగా శుక్రవారం రాత్రే వేలాది మంది కొలంబో చేరుకున్నారు. ఈ పరిస్థితులను ఇంటెలిజెన్సీ వర్గాలు గమనించాయి.
నిరసనకారుల చేతుల్లో శ్రీలంక జాతీయ జెండాలు కనిపించాయి. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, ఉద్యమకారులు, బార్ అసోషియేషన్ సభ్యులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పెట్రోలు లేనందున దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వారంరోజులు పాటు విద్యాసంస్థలను మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వారం రోజులు నష్టపోయే సిలబస్ ను వచ్చేవారం కవర్ చేయాలని స్కూళ్ళు, కాలేజీలను సూచించింది.దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయ్.. పాలు, బియ్యం, గోధుమలు కొనేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.