home page

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్!

నిరాశ పడిన రిషీ సునాంక్ 

 | 
Liz trus

21 వేల ఓట్ల ఆధిక్యత సాధించిన ట్రస్

బ్రిటన్‌ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌.. రిషి సునాక్‌కు నిరాశ
లండన్‌: ఉత్కంఠ వీడింది. బ్రిటన్‌ ప్రధాన మంత్రి రేసులో లిజ్‌ ట్రస్‌(47) విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తూ.. ట్రస్‌ గెలిచినట్లు ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సర్‌ గ్రాహం బ్రాడీ. ట్రస్‌ విజయంతో.. బ్రిటన్‌కు మూడవ మహిళ ప్రధాని ఘనత దక్కినట్లయ్యింది. 

ఆరువారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారం.. ఆపై పోలింగ్‌తో బ్రిటన్‌ తదుపరి ప్రధాని ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. పోటీలో నిలిచిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కు నిరాశే ఎదురైంది. బోరిస్‌ జాన్సన్‌ వారసురాలిగా ట్రస్‌ ఎన్నికైంది. ఈ విషయాన్ని కన్జర్వేటివ్‌ పార్టీ సైతం అధికారికంగా ప్రకటించింది.లీజ్‌ ట్రస్‌కు వచ్చిన ఓట్లు 81,326 పోలుకాగా, రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి.  దీంతో 21 వేల ఓట్ల తేడాతో ట్రస్‌ నెగ్గినట్లయ్యింది.

భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌(42), మంత్రి లిజ్‌ ట్రస్‌ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కన్జర్వేటివ్‌ పార్టీలో ఎక్కువ మంది విదేశాంగ మంత్రి అయిన లిజ్‌ ట్రస్‌ వైపే మొగ్గుచూపారు. ఆన్‌లైన్, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు ఓటు వేసి కన్జర్వేటివ్‌ పార్టీ నేతను ఎన్నుకున్నారు.