home page

కెసిఆర్ పేరు ఎత్తని మోడి

విజయ సంకల్ప సభ లో ప్రధాని మోడీ ప్రసంగం 

 | 
మోడీ

అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన ప్రధాన మంత్రి 

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన బీజేపీ 'విజయ సంకల్ప' బహిరంగ సభలో ప్రధాని మోదీ ఎలాంటి రాజకీయ విమర్శలు చేయలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు అసలు ప్రస్తావనకు తేలేదు.

తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న కేసీఆర్ ఆరోపణలపై లెక్కలతో సహా కేంద్ర సాయాన్ని వివరించారే తప్ప కేసీఆర్ పేరు కూడా ఎత్తకుండా మోదీ ప్రసంగం సాగింది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ పక్కా రాబోతుందని మోదీ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై వాగ్బాణాలు సంధిస్తారని బీజేపీ శ్రేణులు భావించాయి. అయితే.. మోదీ ప్రసంగం రాజకీయ విమర్శలకు తావు లేకుండా సాగింది. భారీ జన సందోహం మధ్య జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పేరును ప్రధాని మోదీ ప్రస్తావించకపోవడం వెనుక బీజేపీ వ్యూహమేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌.. శనివారం ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం జల విహార్‌లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో యశ్వంత్‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ కార్పొరేట్ల సేల్స్‌మెన్ అని దుయ్యబట్టారు. మాటకు ముందు, తర్వాత 'భారత్‌ మాతాకీ జై' అనే ప్రధాని మోదీ శ్రీలంకలో జరిగిన ఆందోళనలు, ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు మౌనం దాల్చారు!?'' అంటూ సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో దీనిపై స్పందించాలని, లేని పక్షంలో ప్రధానిని దోషిగానే భావించాల్సి ఉంటుందని అన్నారు. అయినప్పటికీ మోదీ కౌంటర్ ఇవ్వకుండా మౌనం వహించడంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

కేసీఆర్ అన్నేసి మాటలంటే మోదీ ఎందుకు ఊరుకుంటారని.. సరైన రీతిలో కేసీఆర్‌కు సమాధానం చెబుతారని బీజేపీ శ్రేణులు బలంగా వాదించాయి. కానీ.. అలా జరగకపోవడం, తెలంగాణ సంస్కృతి, ఇక్కడి నాగరికత, దేవాలయాల విశిష్టత గురించి చెప్పి.. తెలంగాణలో తమ ప్రభుత్వం రాబోతోందని మాత్రమే ప్రధాని మోదీ చెప్పడంతో సభకు తరలివెళ్లిన బీజేపీ కార్యకర్తలు నిరాశకు లోనయ్యారు. తాను శాశ్వత ప్రధానినన్న భావనలో మోదీ ఉన్నారని, కానీ, మార్పు తథ్యమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మోదీ స్పందించకపోవడం గమనార్హం. తెలంగాణకు కేంద్రం ఏం సాయం చేసిందనే విషయాన్ని వివరించడం పైనే ప్రధాని మోదీ పూర్తిగా దృష్టి సారించి ప్రసంగాన్ని ముగించారు.