home page

ఒక రాష్ట్ర0- రెండు రాజధానుల గొడవ !

రెండో రాజధానికి బీజేపీ వ్యతిరేకత 
 | 
simla
హిమాచల్ ప్రదేశ్  రాష్ట్రానికి రెండో రాజధానిగా ధర్మశాల 

రెండు రాష్ట్రాలు ఒక రాజధాని గొడవ !

ఒక రాష్ట్రానికి రెండు, మూడు రాజధానులు ఉండడమనేది కొత్త విషయమేమీ కాదు. మనదేశంలోని పలు రాష్ట్రాలకు రెండు, మూడు రాజధానులున్నాయి. పాలనా సౌలభ్యం, వాతావరణ పరిస్థితులు, దూరాభారం సహా పలు కారణాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానులను ఎంచుకుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల రగడ జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగిన పర్యాటక మంత్రుల జాతీయ సదస్సులో పాల్గొన్న వారు  ప్రస్తుతం అక్కడి రెండు రాజధానులపై ప్రజలు, నాయకులు ఏమంటున్నారనే అంశాలతో అందిస్తున్న ప్రత్యేక కథనం

దేవ్ భూమి, వీర్ భూమిగా పిలిచే హిమాచల్ ప్రదేశ్ వంటి అద్భుతమైన పర్వత రాష్ట్రాన్ని సందర్శించాలనేది చాలా మంది కల. వర్ణించతరం కానంత అద్భుతమైన ప్రకృతి సోయగాలు, హిమాలయాల అందాలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఉత్తరప్రదేశ్, లడఖ్, జమ్మూ, కాశ్మీర్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లతో ఈ రాష్ట్రం సరిహద్దులను కలిగి ఉంటుంది. ప్రపంచ నలుమూలల నుంచి ఏడాది పొడవునా పర్యాటకులు వస్తుంటారు. హిమాచల్ ప్రదేశ్‌కు సిమ్లా ప్రధాన రాజధాని నగరం. రాజధానిగా ఈ నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది కేవలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాదు, యావద్దేశానికి కూడా రాజధానిగా కొన్నేళ్లపాటు కొనసాగింది. ఢిల్లీ కేంద్రంగా బ్రిటీష్ పాలన జరిగినన్నాళ్లూ వేసవిలో బ్రిటీష్ పాలకులు సిమ్లాకు మకాం మార్చేసేవారు. అలా సిమ్లా దేశానికి వేసవి రాజధానిగా కొనసాగింది. ఆ తర్వాత భారత్-పాక్ విభజన జరిగినప్పుడు అవిభాజ్య పంజాబ్ రాజధానిగా ఉన్న లాహోర్ నగరం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోవడంతో భారత్‌లోని పంజాబ్‌కు కొత్త రాజధాని నగరాన్ని ఎంపిక చేయాల్సి వచ్చింది. చండీగఢ్ నగరాన్ని ప్రణాళికబద్ధంగా నిర్మించేవరకు తాత్కాలికంగా సిమ్లా నాటి భారత్ పంజాబ్‌కు రాజధానిగా నిలిచింది. భాషాప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా నాటి పంజాబ్‌ను మూడు ముక్కలు చేసి పంజాబీ మాట్లాడేవారితో కూడిన ప్రస్తుత పంజాబ్, హిందీ మాట్లాడేవారితో హర్యానా, పర్వతప్రాంత భాష మాట్లాడేవారితో హిమాచల్ ఏర్పడ్డాయి. అప్పటి నుంచి సిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాజధానిగా కొనసాగుతూ వస్తోంది.
  

దేశానికి, ఉమ్మడి పంజాబ్ రాష్ట్రానికి, ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న సిమ్లాకు ఇప్పుడు కొత్తగా పోటీ ఏర్పడింది. రాష్ట్రంలోని ధర్మశాల పట్టణాన్ని ఆ రాష్ట్రానికి రెండో రాజధానిగా పాలకులు నిర్ణయించారు. అప్పటి నుంచి సిమ్లాను వేసవి రాజధానిగా, ధర్మశాలను శీతాకాల విడిదిగా పాలకులు ఉపయోగిస్తున్నారు. శీతాకాలంలో సిమ్లాలో సంభవించే భారీ హిమాపాతం పాలనా కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుంటుంది. 2017లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర సింగ్ ధర్మశాలను హిమాచల్ ప్రదేశ్ రెండవ రాజధానిగా ప్రకటించారు. ధర్మశాలలో దలైలామా నివాసం ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్‌ను 1960లో ధర్మశాలకు మార్చారు. ఒకరకంగా టిబెట్ దేశానికి ప్రవాస రాజధానిగా ధర్మశాల చలామణి అవుతోంది. అద్భుతమైన పర్యాటక ప్రాంతం కూడా కావడంతో టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అప్పటి ప్రభుత్వం ధర్మశాలను రాజధానిగా ప్రకటించడం దిగువ-ఎగువ హిమాచల్ ప్రదేశ్ మధ్య అంతరాన్ని, వివక్షను తగ్గిస్తుందని భావించారు. 1971లో హిమాచల్‌కు రాష్ట్ర హోదా లభించినప్పటి నుంచి దిగువ హిమాచల్ జిల్లాలు – కాంగ్రా, ఉనా, హమీర్‌పూర్, బిలాస్‌పూర్, చంబా, మండి ప్రాంతాల్లోని ప్రజల పట్ల వివక్ష కొనసాగుతుందనే భావన ఉంది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రా, హమీర్‌పూర్, ఉనా 25 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్నాయి. కాంగ్రా రాజకీయంగా ప్రభావం చూపుతున్నప్పటికీ, ఇక్కడ ఆర్థికాభివృద్ధి ఎగువ హిమాచల్‌తో సమానంగా లేదు. 1993-94లో మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ తన ‘శీతాకాల విడిది’ని ప్రారంభించారు.

తాకాలంలో దిగువ హిమాచల్‌లోని ప్రభుత్వ అధికారులతో కలిసి అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేవారు. ఇది ఒక విధమైన సంప్రదాయంగా మారింది. పలువురు ముఖ్యమంత్రులు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వచ్చారు. 2005లో వీరభద్ర సింగ్ ప్రభుత్వ హయాంలో మొదటిసారిగా ఇక్కడ శీతాకాల సమావేశాలు జరిగినప్పుడే ధర్మశాల రెండవ రాజధాని హోదాను పొందింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో మినీ సచివాలయం, సచివాలయం కొత్త భవనాలు కూడా వచ్చాయి. అంతకు మించి క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పేమీ లేదు. పైగా రెండవ రాజధాని ప్రకటన మరింత రాజకీయ విభేదాలను సృష్టించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఇదే అంశాన్ని అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. ఐదేళ్లు గడిచినా రెండో రాజధాని కాగితాలకే పరిమతమైంది. కొన్ని కార్యాలయాలను సిమ్లాలోనే ఉంచి మరికొన్నిటిని ధర్మశాల ఉన్న కాంగ్రా జిల్లాకు మార్చాలని భావించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రెండు రాజధానుల కసరత్తుకు బ్రేకులు పడ్డాయి. బీజేపీ పాలన మొదలయ్యాక గత ఐదేళ్లలో సిమ్లా నుంచి ప్రభుత్వ కార్యాలయాలను మార్చలేదు. ధర్మశాలలోని సెక్రటేరియట్‌లో సెక్రటరీ స్థాయి అధికారులను నియమించలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుంటారు. రెండవ రాజధానిగా ధర్మశాల ఉండడం వల్ల ప్రజలు, ముఖ్యంగా దిగువ హిమాచల్‌లోని జిల్లాలకు చెందిన వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దిగువ, ఎగువ ప్రాంతాల మధ్య సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఈ పని చేసిందంటారు.

రెండవ రాజధానిని సరిగ్గా అమలు చేస్తే సిమ్లా కంటే ధర్మశాలకు దగ్గరగా ఉన్న అనేక జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనేది ప్రతిపక్షాల వాదన. సిమ్లాకు ప్రయాణించడం ఇప్పటికీ దిగువ బెల్ట్‌లలోని సుదూర ప్రాంతాల వారికి సమస్యగానే ఉంది. ధర్మశాలలో పలుమార్లు వార్షిక శీతాకాల సమావేశాలను నిర్వహించారు. ఇక్కడ ఇంతవరకు మౌలిక సదుపాయాల అభివృద్ది జరగలేదు. సిమ్లా నుంచి విద్య, పారిశ్రామిక కార్యాలయాలను మార్చాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఉంది. ఆఫీసులను మార్చడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, సిమ్లాలో రద్దీని కూడా తగ్గించవచ్చనే వాదన ఉంది.

అయితే ధర్మశాలకు రెండో రాజధాని హోదాను బీజేపీ వ్యతిరేకిస్తోంది. రాజకీయ మైలేజీ కోసమే వీరభద్ర 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేశారనేది బీజేపీ నేతల ఆరోపణ. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న హిమాచల్‌ వంటి రాష్ట్రానికి శాఖల బదిలీకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని వారంటున్నారు. చిన్న రాష్ట్రానికి రెండు రాజధానులు అవసరం లేదని, దూరమే ప్రామాణికమైతే, ఉత్తరాదిన ఉన్న ఢిల్లీ దేశ రాజధానిగా ఉండడం వల్ల దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏమిటనేది వారి ప్రశ్న. పరిస్థితులను బట్టి, ఖర్చులను తగ్గించుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టడం ప్రభుత్వ విధానంగా ఉండాలనిేది వారి అభిప్రాయం. దిగువ హిమాచల్‌పై వివక్ష ఉందనడంలో సందేహం లేదు. అయితే అదంతా గతమని, పనికిరాని చర్చ అని అంటారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు, ప్రజలు అవగాహనతో ఉన్నారని, హిమాచల్ అభివృద్ధే ఇందుకు సాక్ష్యమనేది వారి వాదన. రెండు రాజధానుల వల్ల రాష్ట్ర ఖజానాపై భారమే తప్ప మరే ప్రయోజనం లేదని కొందరు విశ్లేషకులూ భావిస్తున్నారు. అదనపు మౌలిక సదుపాయాలు, అదనపు ఆర్థిక భారమంంటున్నారు. చిన్న రాష్ట్రమైన హిమాచల్‌కు ఒక రాజధాని సరిపోతుందని భావిస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో ఈ గవర్నెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని దూరమనే సమస్యనూ పరిష్కరిస్తున్నామని అధికారులు అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మూడు రాజధానులుండాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. అమరావతితో పాటు విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని భావిస్తున్నా అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. గతంలో అందరూ కలిసి అమరావతిని రాజధానిగా సమష్టిగా నిర్ణయించారు కాబట్టి ప్రజాభీష్టం ప్రకారం దానికే కట్టుబడి ఉండాలని ఇక్కడా బీజేపీ వాదిస్తోంది.