గోదావరి జిల్లాల నుంచే' వారాహి'!
పవన్ ప్రజాయాత్రకు శ్రీకారం!
Jun 2, 2023, 17:42 IST
|
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రెడీ-
ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక సంకేతాలు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది..
తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణతో పాటే జగన్ కూడా డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు అలర్ట్ అయి మహానాడులో మినీ మ్యానిఫెస్టో కూడా ప్రకటించారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది..
పవన్ చేపట్టబోయే వారాహి యాత్రపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చర్చలు ప్రారంభించారు. వారాహి యాత్ర రూట్ మ్యాప్, ఇతర అంశాలపై నేతలతో ఇప్పటికే పలుమార్లు చర్చించిన నాదెండ్ల.. ఇవాళ మంగళగిరిలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. వారాహి యాత్ర గోదావరి జిల్లాల నుంచే ప్రారంభమవుతుందన్న సంకేతాల నేపథ్యంలో ఇవాళ జనసేన గోదావరి జిల్లాల నేతలతో నాదెండ్ల నిర్వహించిన సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది..
పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఉత్తరాంధ్ర నుంచి వారాహి యాత్ర ప్రారంభిస్తారనే ప్రచారం సాగింది. టీడీపీ యువనేత నారా లోకేష్ ఇప్పటికే రాయలసీమ నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఉత్తరాంధ్ర నుంచి వారాహి యాత్ర ప్రారంభించేందుకు పవన్ ప్లాన్ చేశారు. కానీ ఉత్తరాంధ్రతో పోలిస్తే గోదావరి జిల్లాల్లో స్పందన ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అక్కడి నుంచి ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించి గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మరో ప్రచారం సాగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది..