రైతులకు ఇచ్చింది సున్నా :రఘు
Mar 2, 2023, 21:21 IST
|
రైతులకు లక్ష కోట్లు ఇవ్వమంటే ఇస్తారా?
ప్రజాధనాన్ని న్యాయవాదుల కోసం దుర్వినియోగం చేయవద్దు
పార్టీలో నెంబర్ 2 విజయ సాయి రెడ్డి కాకపోవచ్చు
ఎన్నో వేల, లక్షల కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే
హవ్వ... పట్టాభి బెయిల్ పిటిషన్ పై అభ్యంతరమా?
సుబ్బారావు గుప్తపై గంజాయి కేసు నమోదు చేయడం విడ్డూరం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
రైతులకు లక్ష కోట్ల రూపాయలిచ్చి సెటిల్ చేయండి ఆ తర్వాత చూసుకుందామని అప్పటివరకు అమరావతియే రాజధాని అని సుప్రీం కోర్టు చెబితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. పార్లమెంట్ చట్టం చేసిన రాజధానిని కాదని, జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కోసం కలవరిస్తున్నారు. తాను పెట్టిన ముహూర్తానికో, పెట్టించుకున్న ముహూర్తానికో విశాఖపట్నం వెళ్లాలనుకోవడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాజధాని అంశంపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వ పెద్దలు పదేపదే వెళ్తున్నారని, ఏమిటి ఈ ఉన్మాదమని ప్రశ్నించారు. సాధారణంగా అయితే కోర్టులు జరిమానా విధిస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులను నియమించుకోవడం వల్ల ఆ ముప్పు తప్పుతోంది . సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జోసెఫ్, నాగరత్నం, గతం లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి
పనిచేసిన అమానుల్లా ఖాన్ మాత్రం యాదృచ్ఛికంగా ఒక్క రోజు కోసం ఈ బెంచ్ లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, రాజధాని కేసు పైబుధవారం సాయంత్రం
నోటీసులు ఇచ్చారన్నారు. సీనియర్ న్యాయమూర్తి జోసెఫ్ వద్ద పప్పులు ఉడకవని తెలిసి కూడా పప్పులను ఉడికించే ప్రయత్నం ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. న్యాయమూర్తి జోసెఫ్ మాట్లాడుతూ ఈ కేసును ఇప్పటికే వాయిదా వేసి తేదీని కూడా ప్రకటించాము. మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. న్యాయమూర్తి ప్రశ్నతో తడబడిన ప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శేఖర్ నాప్డే స్పందిస్తూ మంగళవారం టేకప్ చేస్తానని చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం బుధ గురువారాలలో మాత్రమే ఓల్డ్ సివిల్ అప్పిల్స్ (అప్పీల్ లీవ్ గ్రాంట్ అయిన వాటిని సివిల్ అప్పీల్ కన్వర్ట్ చేస్తారు) టేకప్ చేస్తున్నారని, సోమ, శుక్రవారాలలో కొత్త వాటిని స్వీకరిస్తున్నారు. అందుకే మంగళవారం అయితే ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో బుధ, గురువారాలలో కూడా తమ వాదనలను వినాలని ఈ ప్రతిపాదన పెట్టామని చెప్పారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక నియమావళిని ఏర్పాటు చేసిన తరువాత బుద్ధి ఉన్నవారు ఎవరైనా ఇలా అడుగుతారా? అంటూ ప్రశ్నించారు. న్యాయ శాస్త్రంలో జగన్మోహన్ రెడ్డికి ఏబిసిడిలు కూడా తెలియవు. ప్రధాన న్యాయమూర్తి ఒక నియమావళిని రూపొందించిన తరువాత తమ వాదనలను వినాలని న్యాయమూర్తిని అడగడం హాస్యాస్పదంగా ఉంది. అప్పటికప్పుడు బెంచ్ లు మారాయని భావించి ఉంటారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ముందస్తు తేదీని ప్రకటించమని న్యాయమూర్తులను కోరడం కూడా ఒక భూతే. న్యాయమూర్తి జోసెఫ్ ను ఉద్దేశించి మీకు అభ్యంతరం లేకపోతే, ప్రధాన న్యాయమూర్తి వద్ద మెన్షన్ చేస్తామని చెప్పడం, దానికి తాను అనుమతించడం ఏమిటీ?, తనకేమిటి సంబంధం అని న్యాయమూర్తి ఎదురు ప్రశ్నించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇలా అడగడం కూడా తప్పేనని ఆయన అన్నారు. దీనితో, తోలు చెప్పు నీళ్లలో నానబెట్టి తమ వారి గూబ మీద కొట్టినట్లయింది. ఎర్లీ హియరింగ్ కు అడగకుండా తమ వాదనలను వినాలని కోరారని, దానితో అమరావతి రైతుల తరఫున న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలకు అనుగుణంగా ఉండాలంటే బుధ గురువారాలలో లీవ్ గ్రాంట్ చేసి ఈ మేటర్ ను అడ్మిట్ చేస్తే లిస్టులో వస్తుందని చెప్పారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది శేఖర్ నాప్డే కంగారుపడుతూ 2011 నుంచి పెండింగ్ కేసులు ఉన్నాయని, ఆ లెక్కన ఈ కేసు లిస్ట్ కావాలి అంటే ఎన్ని రోజుల సమయం పడుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఒక్క కేసు కోసం తాను రూపొందించిన నియమావళిని మార్చుకోరు కదా అని ఆయన ప్రశ్నించారు. అడగమన్నవారికైనా బుద్ధి ఉండాలి. అడగమన్నది ఎవరు అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడగమన్నారా అని నిలదీశారు. తనకు విశాఖ వెళ్లిపోవాలని ఉంది అని అడగమంటే, న్యాయవాదులు ఫీజు లభిస్తుంది కదా అని అడుగుతారని రఘు రామకృష్ణంరాజు అపహాస్యం చేశారు. న్యాయస్థానం ఒక నిబంధనను ప్రవేశపెట్టిన తర్వాత, అతిక్రమించి అడిగితే నవ్వుల పాలవుతారు. న్యాయ శాస్త్రంలో ఏ బి సి డి లు కూడా తెలియని వెర్రి వాళ్ళ నా, ఉగ్రవాదులనా మనం ఎన్నుకున్నదని ప్రజలు బాధపడే పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి ముందు మెన్షన్ చేస్తే, ఈరోజు జరిగినట్టుగానే రేపు కూడా పరాభవం తప్పకపోవచ్చు. న్యాయవాదులు ఫీజుల కోసం వాదించేందుకు సిద్ధమైన, ప్రజాధనాన్ని మరింతగా దుర్వినియోగం చేయడం సరి కాదని రఘురామకృష్ణం రాజు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. రాజధాని కేసు బెంచ్ మారగానే యాదృచ్ఛికంగా న్యాయమూర్తి అమానుల్లా ఖాన్ ఉన్నప్పుడే ఎందుకు మెన్షన్ చేశారన్న అనుమానాలు ఎవరికైనా కలగడం సహజం. తాను న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అనుమానించడం లేదు. తమ ప్రభుత్వ పెద్దలను మాత్రమే అనుమానిస్తున్నాను. న్యాయమూర్తి తన సీట్లో కూర్చున్న తర్వాత అవేమీ పట్టించుకోరు అన్న విషయాన్ని తమ వారు తెలుసుకుంటే మంచిదని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఇప్పటికైనా ఆ దేవుడు తమవారికి న్యాయ శాస్త్ర పరిణితిని, మరింత బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.
మళ్లీ మేము ముగ్గురం గెలుస్తాం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీనియర్ శాసనసభ్యుడు ఆనం రామ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తాను రానున్న ఎన్నికలలో విజయం సాధిస్తామని రఘురామకృష్ణం రాజు ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డికి ఐదేళ్ల వరకు మళ్లీ ఎన్నిక కావలసిన అవసరం లేదు. గతంలో జుగుస్సాకరమైన ట్విట్లు చేసిన ఆయన, గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారినట్టు ప్రస్తుతం సంస్కారవంతమైన ట్విట్లను చేస్తున్నారు. ఉన్నత విద్యావంతుడైన విజయసాయిరెడ్డి నీచమైన భాష లో, తుచ్చస్థాయిలో మాట్లాడుతారని తాను ఎప్పుడూ భావించలేదు. కానీ ఆయన ట్విట్లు మాత్రం అందుకు భిన్నంగా ఉండేవి. రాజ్యసభ ప్యానల్ చైర్మన్ పదవి కి ఎన్నికైన అనంతరం విజయసాయిరెడ్డిని తొలగించి, మళ్లీ ఎంపిక చేసిన తరువాత ఆయనలో స్పష్టమైన మార్పు కనిపించింది. రాజ్యసభ ప్యానల్ చైర్మన్ గా ఆ కుర్చీలో కూర్చునేది తక్కువ సార్లే అయినప్పటికీ, లభించే గౌరవమే వేరు. గౌరవానికి గౌరవం ఇవ్వడం తమ పార్టీ వారికి రుచించినట్లు లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలి సభ వేదికగా ఉత్తుత్తి బటన్ నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు చేసినట్టుగా నాటకమాడినప్పటికీ విజయ సాయి రెడ్డి ఆహా..ఓహో అనకుండా, నిజమైన బటన్ నొక్కి రైతుల ఖాతాలు డబ్బులు జమ చేసిన ప్రధానమంత్రిని అభినందించారని గుర్తు చేశారు. విజయ సాయి రెడ్డి ట్విట్టర్ ఖాతాకు ఎక్కువమంది ఫాలోవర్స్ ఉండటంతో, ఆయన ఖాతాను ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక వ్యక్తి వినియోగించేవారని తెలుస్తోంది. ఇతరుల భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలవాటే. తెలుగులో ఒక అంకె, సంఖ్య కలిగిన టీవీ ఛానల్ లలో విజయసాయిరెడ్డిని దూరం పెడుతున్నారా?, విజయసాయిరెడ్డి పని అయిపోయినట్లేనా?? అని వార్తా కథనాలు ప్రసారం చేయడం పరిశీలిస్తే, నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా ఉంది అని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తమ పార్టీ వారు డైరెక్టుగా స్పాట్ పెట్టకుండా, కలెక్టర్, ఇతర అధికారులకు చెప్పి అవమానించే ప్రయత్నం చేస్తారు. సెక్యూరిటీని తగ్గిస్తారు. విజయసాయి రెడ్డికి పెద్దగా సెక్యూరిటీ ఉన్నట్లు లేదు. విశాఖలో లోగో లాంచ్ కార్యక్రమానికి కూడా ఆయన్ని ఆహ్వానించలేదని తెలిసింది. ఇన్నాళ్లు విశాఖను ప్రేమించిన విజయసాయిని విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి ఒక్కసారి వచ్చి వెళ్ళమంటారా?, ఇంతటితో మన బంధం తెగిపోయిందని తేల్చివేస్తారా?? అన్నది ప్రశ్నార్ధకమే. ఆర్థిక నేరాభియోగ కేసుల్లో A2గా ఉన్నప్పటికీ, పార్టీలో మాత్రం నెంబర్ టూ గా లేనట్టే అనుకోవాలి. కేసులు తేలే వరకు ఆయన్ని A 2 గానే కొనసాగిస్తారు. క్లయింట్ సరైన వాడు కాకపోతే చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఇప్పటికే విజయసాయి రెడ్డి వద్ద నున్న అనుబంధ శాఖలన్నీ క్షవరం చేయడంతో, ఇక ఆయన పార్టీలో నెంబర్ 2 కాదని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆగ్రహం వస్తే, తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. జాతీయ కార్యదర్శిగా విజయసాయిరెడ్డిని కొనసాగిస్తారో, లేకపోతే ఆ పదవిని సజ్జల రామకృష్ణారెడ్డికి, లేదంటే ఆయన కుమారుడికి ఇస్తారో చూడాలి అని రఘురామకృష్ణం రాజు అన్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఆత్మాహుతికి రెడీ అయినా లారీ యజమానులు
కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఎంతోమంది లారీ యజమానులు ఆత్మాహుతికి సిద్ధపడ్డారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అప్పుల్లో మునిగిపోయిన జేపీ కంపెనీ ముందు పెట్టి తమ పార్టీ వారే ఇసుక విక్రయాలను కొనసాగించారు. ఇసుకతోలే కాంట్రాక్టును స్థానికులకు అప్పగించడంతో, వారు పెళ్లాల మీద ఉన్న పుస్తెలు కుదవపెట్టి, అప్పులు చేసి లారీలను కొనుగోలు చేసి ఇసుకను తోలారు. భవన యజమానుల వద్ద ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో సహా, ఇసుక బకాయిలను వసూలు చేసుకుని లారీ యజమానులకు ఇవ్వాల్సిన 500 నుంచి 600 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. ఇసుక తరలించే కాంట్రాక్టును ఇచ్చినందుకు కూడా మా వారికి బాగానే ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. ఇసుకతోలినందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో, ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదు. దీనితో లారీ యజమానులపై బ్యాంకులు మీద పడ్డాయి.. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాలు ఉంటే ఎన్ పి ఏ లు తప్పవు. ఈ దిక్కుమాలిన సమాజం మాత్రం లారీ వాడే ఎగగొట్టాడని అంటారు. జగన్మోహన్ రెడ్డి సాధించిన రెండంకెల అభివృద్ధి అంటే మూడేళ్ల పాటు ఇసుక అమ్మి, డబ్బులు కలెక్ట్ చేసుకుని లారీ యజమానులకు ఇవ్వకపోవడమేనా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు ఇలా ఎన్నో ఉన్నాయి. చిన్నాచితకా కాంట్రాక్టర్లతో మొదలుకొని ఎంతోమందికి, దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయల బకాయిలు ఉండి ఉంటాయని తెలిపారు. అప్పుల బాధలు భరించలేక లారీ యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వ బకాయిల గురించి బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే, వాటి నుంచి రక్షణ కోసం ప్రభుత్వం స్టే లను పొందడం పరిపాటిగా మారిందన్నారు. తల తాకట్టు పెట్టి ఊడిగం చేసిన వారికి డబ్బులు ఇవ్వకపోతే వారే ఏమైపోతారన్న మానవత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వారి దగ్గర డబ్బులు కొట్టేసి, సమాజంలోని కొంతమందికి ఉచిత పథకాలను అందజేసి, వారి ఓట్ల ద్వారానే గెలుస్తామని అనుకుంటే పొరపాటేనని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.
పట్టాభికి బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతమట
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి కి బెయిల్ ఇస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఒంగోలులో తమ పార్టీకి చెందిన సుబ్బారావు గుప్తా అనే వ్యక్తి, తమ పార్టీ నాయకులతో విభేదించినందుకు ఆయనపై గంజాయి రవాణా కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. గతంలో తనని అరెస్టు చేసినప్పుడు, తన సామాజిక వర్గానికి చెందిన వారితోనే తన పైన విమర్శలు చేయించారని, ఇప్పుడు సుబ్బారావు గుప్త పై కూడా ఆర్యవైశ్య సంఘాలతో విమర్శలు చేయిస్తారేమోనని ? మండిపడ్డారు .