home page

చంద్రబాబు పై కేసా? : హవ్వ!

 | 
Raghu
సినీ అభిమానులు తలుచుకుంటే మన పార్టీ మటాష్

 చిరంజీవి రెండు మంచి మాటలు చెబితే తట్టుకోలేక విమర్శలా?... ఇదెక్కడి విడ్డూరం!

హవ్వ... చంద్రబాబుపై 307 కేసా?

 నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

  సినీ హీరోలు ఆగ్రహించి మన పార్టీకి వ్యతిరేకంగా ఒక్క పిలుపునిస్తే చాలు వారి అభిమానులు, గాలిలో దీపంలా రెపరెపలాడుతున్న మన పార్టీ తొక్కుకుంటూ వెళ్తారని... అప్పుడు మన పార్టీ మటాషవడం ఖాయమని నరసాపురం ఎంపీ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు.. మెగాస్టార్ చిరంజీవి రెండు మంచి మాటలు చెబితే తట్టుకోలేక ఆయన్ని విమర్శించడం ద్వారా

 మన నెత్తిన మనమే బస్మాసుర హస్తం పెట్టుకున్నట్లయిందన్నారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... సినీ హీరోల అభిమానులంతా కలిసి తమ సినిమా కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక కులమంతా ఏకమైనట్టుగా సినీ అభిమానులు కూడా ఏకమైతే, మన పార్టీకి ఇక్కట్లు తప్పవని హెచ్చరించారు. ఏడు, ఎనిమిది మంది అగ్ర హీరోలకు పెద్ద సంఖ్యలో సినీ అభిమానులు ఉన్నారు. సినిమా పరిశ్రమపై మా పార్టీ నాయకులు, కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యల పట్ల వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ హీరోలు తమ అభిమానులకు పిలుపునిస్తే పార్టీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సినీ అభిమానులకు, కులానికి సంబంధం లేదన్నారు. చిరంజీవికి కాపులు మాత్రమే అభిమానులు కాదని, అన్ని కులాలలోనూ అభిమానులు ఉన్నారని గుర్తు చేశారు. బీసీ ఎస్సీ సామాజిక వర్గాలలోని ప్రజలు ఎక్కువమంది చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తారని పేర్కొన్నారు. కక్ష కార్పన్యాలతో ఒళ్లంత నిండిపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈనెల 11వ తేదీన విడుదల కానున్న బోలా శంకర్ చిత్రం టికెట్ ధరల పెంపు కు అనుమతినిచ్చే ఫైలు టచ్ చేయవద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. 100 కోట్ల రూపాయలకు ఎక్కువగా ఖర్చు చేసి నిర్మించిన చిత్రానికి, టికెట్ ధరలను పెంచుకునే వెసులు బాటు కల్పించాలి. అదేమీ చిరంజీవి సొంత సినిమా కాదు. నిర్మాతలు డబ్బులు పెట్టి నిర్మించిన చిత్రం. ప్రభుత్వం తన సంకుచిత్వాన్ని ప్రదర్శిస్తే కొంప మునుగుతుందన్నారు . సినిమా అభిమానులకు వయస్సుతో నిమిత్తం లేదని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక హీరో అభిమానులేనని చెప్పారు.

 మంత్రులు... మా పార్టీ నేతల విమర్శలు అర్థరహితం

 సినిమా ఇండస్ట్రీ అనేది చిన్నదని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకనీ మెగాస్టార్ చిరంజీవి ప్రశ్నించడాన్ని తట్టుకోలేక మంత్రులు, మా పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితంగా ఉన్నాయని రఘురామకృష్ణంరాజు అన్నారు. యువతకు ఉపాధి కల్పన కోసం అభివృద్ధిపై దృష్టి సారించాలని, రోడ్లు లేవు రోడ్లు బాగు చేసుకోవాలని హైదరాబాదులో జరిగిన సినిమా ఫంక్షన్ లో చిరంజీవి వ్యాఖ్యానించారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉద్దేశించినవై ఉండవచ్చు. కొంచెం అభివృద్ధిపై ఫోకస్ చేయండి అని చిరంజీవి అంటే అది మననే అన్నారని మంత్రులు, మా పార్టీ నాయకులు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. దేశంలోనే ఎవరూ చేయనంత అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి చేశారని, ప్రపంచ నేతలు జో బైడెన్, పుతిన్ లు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి తమకు ఎక్కడ పోటీ వస్తాడోనని భయపడుతున్నట్లుగా సాక్షి దినపత్రికలో కథనాలను రాసుకుంటూ, చిరంజీవి నాలుగు మంచి మాటలు చెబితే ఆయన్ని విమర్శించడం విడ్డూరంగా ఉంది. రాజకీయాల్లో కుల్లును భరించలేక, నిజజీవితంలో నటించడం చేతకాక ఒక పార్టీని ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 17% ఓట్లను సంపాదించి, కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి గురించి మంత్రులు మా పార్టీ నాయకులు అవమానకరంగా మాట్లాడడం సిగ్గుచేటు.. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పిచ్చుక అని ఒప్పుకున్న తర్వాత పిచ్చుకలా ఉండాలని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. సినిమా పరిశ్రమ టర్నోవర్ ఏటా 2000 కోట్ల రూపాయలు. ఒక నెలలో తాడేపల్లి ప్యాలెస్ కు చేరే ఆదాయం రెండు వేల కోట్ల రూపాయలకు పైచిలుకే... సినిమా పరిశ్రమ అంత చిన్నదైనా ఎంతోమందికి ఉద్యోగ,ఉపాధి

అవకాశాలను కల్పిస్తోంది. సినిమా హాల్ లల్లో క్యాంటీన్, సైకిల్ స్టాండ్ ల నిర్వాహణ ద్వారా ఎంతో మంది ఉపాధిని పొందుతున్నారు. అటువంటి సినిమా పరిశ్రమ గురించి రాష్ట్రంలో ఇతర సమస్యలేవి లేవన్నట్లుగా రాజ్యసభలో మా పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయ సాయి రెడ్డి సినిమా హీరోలు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారని, హీరోలకు ఇచ్చే పారితోషకం పై సీలింగ్ విధానాన్ని అమలు చేసి ఆ మొత్తాన్ని ఇతర నటీనటులకు పంచాలని కోరడం హాస్యాస్పదంగా ఉంది. సినీ హీరోలకిచ్చే పారితోషికం గురించి మాట్లాడడానికి అన్నం తింటున్నారా?... కడుపుకు అశుద్ధం తింటున్నారా?? అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఎన్నికల్లో సొమ్ములు ఖర్చు పెట్టి, ఓట్లు కొనేసిన ఒక పార్టీ 150 సీట్లు రావడం అన్యాయం, అలా సీట్లు రాకుండా ఒక రూల్ తీసుకురండి అంటే ఒప్పుకుంటారా అని విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. మా పార్టీ తరఫున గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించి 42 వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని, ఆ ఆస్తులన్నింటినీ ఎమ్మెల్యేలతో పాటు 30 మంది ఎంపీలకు కూడా సమానంగా పంచాలని కోరడం తప్పు. ఎందుకంటే ఆయన కష్టపడ్డారు సంపాదించుకున్నారు..అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కష్టపడి పైకి వచ్చారు. ఒక సినిమాకు ప్రభాస్ 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని అంటున్నా రు. దానివల్ల నీకు వచ్చే నష్టం ఏమిటని విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను వదిలేసి పార్లమెంట్లో హీరో, హీరోయిన్ల పారితోషికాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. పోలవరం ప్రాంతంలో వరదలు ఉదృతస్థాయిలో కొనసాగుతున్నప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఆ ప్రాంతంలో పర్యటించాల్సిన అంబటి రాంబాబు ఢిల్లీలో హడావిడి చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో చిత్రంలో అంబటి రాంబాబు ను 

శ్యాం బాబు పాత్రతో కించపరిచారని మా పార్టీ నాయకులు పేర్కొంటుండగా 

 , ఆ పాత్ర కు రాంబాబుకు అసలు సంబంధమే లేదని సినిమా యూనిట్ స్పష్టం చేస్తున్నారు. అయినా, పదేపదే అదే విషయాన్ని లేవనెత్తడం దారుణం. పవన్ కళ్యాణ్ ఇస్తున్న పారితోషికం పై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరపాలని అంబటి రాంబాబు వంటి వారు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజాభిప్రాయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెలిబుచ్చారు . ఇటువంటి వారి నా మనం ఎన్నుకున్నదని ప్రజలు బాధపడుతున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. సినీ పరిశ్రమ తరపున హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ తో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నివాసానికి చిరంజీవి వెళితే ఆయన్ని గేటు వద్ద నుంచి ఇంట్లోకి నడిపించారు. అదే పారిశ్రామికవేత్త అదానీ వస్తే మాత్రం కారును ఇంటి గుమ్మం వరకు అనుమతించి, ఆయనకు గుమ్మం వద్దే జగన్మోహన్ రెడ్డి దంపతులు స్వాగతం పలికారు. సినీ పరిశ్రమకు సహకరించాలని చిరంజీవి చేతులు జోడించి నమస్కరిస్తే, ఆయన్ని పెద్దగా పట్టించుకోనట్లు చూస్తున్న ఫోటోను మీడియాకు లీక్ గా విడుదల చేసి అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. సినిమా హీరోలను పకోడీ గాళ్లు అంటూ గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన ఎన్టీ రామారావు కూడా సినిమా రంగానికి చెందిన పకోడీ నే. అలాగే తమిళనాడులో అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి వారు కూడా సినిమా రంగానికి చెందిన పకోడీలే. అటువంటి సినీ పకోడి స్థాపించిన పార్టీ నుంచే కొడాలి వెంకటేశ్వరరావు రెండుసార్లు విజయం సాధించారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. వెంకటేశ్వరరావుకు మిత్రుడైన జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఈ పకోడీ అనే వ్యాఖ్య వర్తిస్తుంది. తక్షణమే కొడాలి వెంకటేశ్వరరావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. లేకపోతే సినీ హీరోలు, వారి అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. మొరగని కుక్క లేదు... విమర్శించని నోరు లేదు... ఈ రెండు లేని ఊరే లేదని... మన పని మనం చేసుకోవాలని తాజాగా రజినీకాంత్ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ , అక్షరాలా నిజం అన్నారు. చిరంజీవిని కూడా గ్రామ సింహాలు విమర్శిస్తున్నాయని, వారి విమర్శలు పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు.

 కోరుకొండలో బాబుకు బ్రహ్మరథం... కోనసీమలో జగన్ ను పట్టించుకోని ప్రజలు

 కోరుకొండలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ప్రజలు బ్రహ్మరథం పడితే, కోనసీమలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పట్టించుకోలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు . పబ్లిక్ మీటింగ్ లేకపోవడం వల్ల జన సమీకరణ చేయకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ని పట్టించుకున్న వారే లేరు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఓ 200 మంది మినహా ఎక్కువమంది ఆయన పర్యటన సందర్భంగా కనిపించలేదు . ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలకు భయపెట్టి, బ్రతిమాలి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి జనాలను సమీకరించే వారు. అసలు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి ఇది . తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడారు. నేనేమైనా తప్పులు చేసి ఉంటే సరి చేసుకుంటానని, అలాగే అధికారులు తప్పులు చేసి ఉంటే సరి చేయడానికి వచ్చానని చెప్పిన తీరు నచ్చింది. మా పార్టీ పైనున్న ద్వేషమే వల్లే, ప్రతిపక్షాల సభలకు ఇసుక వేస్తే రాలనంత జనం హాజరవుతున్నారని

రఘురామకృష్ణం రాజు తెలిపారు. సంయమనానికి బ్రాండ్ అంబాసిడర్ అయినా నారా చంద్రబాబు నాయుడు హత్యాయత్నానికి కుట్ర చేశారని ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది.14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన 

నారా చంద్రబాబు నాయుడు, హత్య రాజకీయాలను చేయాలనుకుంటే , ప్రస్తుతం పాలకపక్షంలో కొనసాగుతున్న వారిలో ఎంతమంది మిగిలేవారని ప్రశ్నించారు. చిరంజీవిపై విమర్శలు చేయడం, చంద్రబాబు నాయుడు పై కేసులు నమోదు చేయించడం చూస్తే ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి ఏమిటో అర్థం అవుతోందన్నారు.

 ఒంటరి మహిళ ఖాతా నుంచి 1.70 లక్షల రూపాయలు కొట్టివేసిన వాలంటీర్

 ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామానికి చెందిన నాగమణి అని మహిళా బ్యాంకు ఖాతా నుంచి వేలిముద్ర ఆధారంగా 1,70,000 రూపాయలను వాలంటీర్ తస్కరించారు. ఇలాగే వేలిముద్రల ఆధారంగా వాలంటీర్లు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు..

 పార్టీ పక్షాన బ్రాహ్మణులకు క్షమాపణలు చెబుతున్నా

  పంచారామాలలో ఒకటైనఎంతో ప్రాశస్త్యం కలిగిన

భీమవరం

శివాలయం పూజారి నాగేందర్ పవన్ పై ఆలయ పాలకవర్గం చైర్మన్ భర్త కోడే యుగంధర్ దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంపి వేయడం దారుణమని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. బ్రాహ్మణులు అంటే మా పార్టీకి ఎంత చులకనో ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. దేవాలయంలో భక్తులకు అడ్డుగా నిలబడిన యుగేందర్ ను మర్యాదపూర్వకంగా జరగమని కోరిన పూజారిపై దాడి చేయడం అంటే, ఇది బ్రాహ్మణ సమాజం పై జరిగిన దాడే. బ్రాహ్మణులతో పాటు యజ్ఞోపవేతాన్ని ధరించే అన్ని కులాలకు చెందిన వారు ఐక్యంగా ఈ దారుణాన్ని ఖండించాలి.. తక్షణమే యుగేందర్ క్షమాపణలు చెప్పాలి. ఈ పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా పార్టీ పక్షాన నాగేందర్ పవన్ కు నేను క్షమాపణలు చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.