home page

మూడు ముక్కలాటగా విశాఖ గర్జన

సహకరించని ప్రకృతి  : నాయకుల వికృతి  

 | 
ఆంధ్రప్రదేశ్లో వికేంద్రీకరణ సూత్రం బెడిసికొట్టే ప్రయత్నంగానే కనిపిస్తోంది. ప్రశాంతంగా వున్న రాష్ట్రం మూడు ముక్కలాటగా మారిపోయింది. అధికార వైసీపీ విశాఖలో ఈ 15వ తేదీన నిర్వహించిన 'విశాఖ గర్జన' విఫలమైందా? సఫలమైందా? అన్న విషయాన్ని పక్కన పెడితే రాష్ట్రం మూడు ముక్కల రాజకీయంగా మారడం అనివార్యమైపోయింది. ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిపోయిందని, ఎన్నో ఏళ్ళగా ఏ ప్రభుత్వమూ పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాంతం దారిద్య్రంతో తాండవిస్తోందని అందుకే
విశాఖలో రాజధాని అవసరం అని విశాఖ గర్జనలో వక్తలు గొంతు చించుకొని మరి చెప్పారు. అయితే విచిత్రం ఏమిటంటే ఇంత నిస్సిగ్గుగా మాట్లాడిన వారందరూ గత ఇరవైఏళ్ళ నుంచీ ఏదో పార్టీ తరపున మంత్రులుగా అధికారం అనుభవిస్తున్న వాళ్ళే కావడం. వెనుక బాటు దనానికి వీళ్ళ బాధ్యత లేదా? ఈ పాపం వీరిది కాదా? రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళు వీరావేశంతో వెనుకబాటుతనం గురించి మాట్లాడ్డం ఉత్తరాంధ్ర ప్రజల్ని నవ్విస్తోంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని వచ్చి తీరాల్సిందేనని ఈ నాయకులు గర్జించారు. అయితే ఈ గర్జన ఎవరి మీద? అధికారంలో వున్నది వైసీపీ ప్రభుత్వం. నిర్ణయాలు తీసుకుంటున్నది, అమలు చేయాలనుకుంటున్నదీ వైసీపీ ప్రభుత్వం. అసెంబ్లీలో బిల్లు పెట్టాల్సింది వైసీపీ ప్రభుత్వం. మూడు రాజధానుల కేసు హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళిందీ వైసీపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు 'స్టే' ఇస్తే దాన్ని అదనుగా చేసుకొని రాజధాని విశాఖ అంటూ పరుగులు తీయాల్సింది వైసీపీ ప్రభుత్వం. మరి అన్ని అధికారాలనూ తమ చేతుల్లో పెట్టుకొని 'విశాఖ గర్జన' అంటే ఈ గర్జన ఎవరి మీద? అన్నది ప్రజలకు అర్ధం కాకుండా వుంది. 2019 ఎన్నికల ముందు వైసీపీ మేనిపెస్టోలో మూడు రాజధానుల గురించి వెల్లడి0చలేదు. అలా ముందుగా వెల్లడి0చి వుంటే అప్పట్లో ప్రజాభిప్రాయం ఎలా వుండేదో? వెల్లడయ్యేది. దీని ద్వారా ప్రజల అభిప్రాయం తెలిసేది. అయితే టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని అంటూ ప్రవేశ పెట్టిన బిల్లుకు అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ అడ్డు పెట్టలేదు. ప్రతిపక్ష నాయకునిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలుపుతూ మాట్లాడారు కూడా. మరి ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిచిన తరువాత మాత్రం వైసీపీ రాజధాని విషయంలో వెనక్కి తిరిగింది. మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. ఈ మూడేళ్ళ నుంచీ ఈ మూడు రాజధానుల వ్యవహారంపైనే వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తోంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ? అంటే ఇక్కడ! అని ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడి0ది. తమ ప్రాంతం నుంచి రాజధానిని తరలిస్తున్నారన్న భయంతో అమరావతిలో భూములు పోగొట్టుకున్నవారు భయంతో వున్నారు. వీళ్ళు పర్యటిస్తూ శ్రీకాకుళంలోని అరసవల్లి వరకూ పాదయాత్ర చేయడానికి బయలు దేరారు. అయితే వారి మనోభావాలకు ప్రభుత్వం ఏ మాత్రం ఏ ప్రాముఖ్యతనూ ఇవ్వడం లేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ రైతులన్న అభిప్రాయాన్నే ప్రభుత్వ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దీంతో అక్కడి రైతులు కూడా ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమైపోయారు. ఈ ఆందోళన సాగుతుండగానే వైసీపీ ఉత్తరాంధ్రలో మరో కొత్త చిచ్చును రగులుస్తోంది. ప్రజల్లో ఎటువంటి సెంటిమెంట్ లేకపోయినా విశాఖలో రాజధాని వుండాలంటూ వైసీపీ నాయకులు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంతంగా వుండే విశాఖ నగరంలో క్రైమ్ రేటు పెరిగిపోయింది. గత రెండు నెలల్లో ఒక్క విశాఖలోనే 17 హత్యలు జరిగాయి. ఇక రాజధాని వస్తే పరిస్థితి ఎలా వుంటుందోనని విశాఖ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోతున్నారు. రాజధాని వుంటేనే అభివృద్ధి సాధ్యం అన్న వాదన సరైందని ప్రజలు నమ్మడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో వున్నప్పుడు రాజధానిని విశాఖకు మార్చాలనో, విజయవాడకు మార్చాలనో, కర్నూలుకు మార్చాలనో ఎవరూ డిమాండ్ చేయలేదు. అలాగే మూడు రాజధానులు వుండాలని ఎవరూ కోరలేదు. ఇప్పుడు మనకు మిగిలిన చిన్న రాష్ట్రానికి మాత్రం మూడు రాజధానులు కావాలని ప్రేరేపించడం వల్ల మూడు ప్రాంతాల ప్రజల్లో ప్రాంతీయ వైషమ్యాలు వచ్చే ప్రమాదం ఏర్పడిరది. నిన్న వైసీపీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, ఆర్.కె.రోజా, విడదల రజనీ, స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడిన మాటలు వాళ్ళు మాట్లాడవలసినవి కావు. మొత్తం రాష్ట్రానికి మంతులుగా వ్యవహరిస్తున్న వీళ్ళు మాట్లాడాల్సినవి కావు. మొత్తం రాష్ట్రానికి మంత్రులుగా వ్యవహరిస్తున్న వీళ్ళు ఉత్తరాంధ్రకు పరిమితమై మాట్లాడారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడ్డం వల్ల రాష్ట్ర ప్రజల్లో ఐకమత్యం కొరవడే ప్రమాదం వుంది. మరి ఇంత పెద్ద భారతదేశానికి ఢల్లీ ఒక్క చోటే రాజధాని ఎందుకుంది? మరి దేశానికి కూడా మూడు, నాలుగు రాజధానులు కోరి వుండొచ్చుకదా! ఢిల్లీలో ఆ మాత్రం డిమాండ్ చేసే మేథావులు, నాయకులు లేకనా? భిన్నత్వంలో ఏకత్వం అన్నది భారతదేశం సిద్ధాంతం. కలిసి వుంటే కలదు సుఖం అనుకునే ప్రజలున్న దేశం భారతదేశం. అందువల్ల అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసే
ప్రణాళికలు సిద్ధం చేయాలి గానీ ప్రాంతాల వారీ విడగొట్టి పాలన చేయడం ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్న వాదన కేవలం రాజకీయ లబ్దికోసం జరిగే ప్రక్రియ గానే పరిగణించాల్సి వుంటుంది. మూడు రాజధానులన్నది కేవలం వైసీపీ అజెండా. ప్రజల డిమాండ్ కాదు. విశాఖ ప్రజలు ఆశిస్తున్నది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు. దీని కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. కానీ ఈ రోజు వరకూ స్టీల్ ప్లాంట్ కోసం జరిగే ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతూ అధికారికంగా దొరకలేదు. కనీసం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి డిమాండ్ ను ప్రధాని మోడీ దృష్టిలో పెట్టే ప్రయత్నం కూడా లేదు. అంతెందుకు ఇంత వరకూ ముఖ్యమంత్రి జగన్ స్టీల్ కార్మిక నాయకులతో సమగ్ర సమావేశాన్నే నిర్వహించలేదు. ఇక రెండవది విశాఖ రైల్వే జోన్. 2019లో వెలువడిన ప్రకటనకు ఇంత వరకూ మోక్షమే లేదు. దీని గురించి కేంద్రంపై ఒత్తిడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. రైల్వే జోన్ వస్తే ఈ ప్రాంతానికి వేలాది కోట్ల పెట్టుబడులు, వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. అయినా దీనిపై దృష్టి పెట్టకుండా రాజధాని విశాఖ రావాలి. అప్పుడే అభివృద్ధి అంటూ మూడేళ్ళ నుంచి ప్రభుత్వం జపం చేస్తూ కాలయాపన చేస్తోంది. దీంతో స్థానిక వైసీపీ నాయకులు కూడా సతమతమవుతున్నారు. కార్యకర్తలు కూడా రోజుకూ సహనాన్ని కోల్పోతున్నారు. ఇకనైనా వాస్తవాలను గ్రహించి పాలన చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.
(విశాఖ నుంచి వెలువడే  లీడర్  పత్రిక సౌజన్యంతో  )