home page

కర్ణాటకంలో ఎన్నికల వేడి మొదలు

 | 
కర్ణాటక ముఖ్యమంత్రిని మళ్లీ మార్చనున్న బీజేపీ: ఈశ్వరప్ప

కర్ణాటక విధాన సభకు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగ నున్నాయి.ప్రధాన పార్టీలు భాజపా, కాంగ్రెస్‌, జనతాదళ్‌ తమ గెలుపు కోసం ప్రచారాన్ని, ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. కమలనాథులు వరుసగా జన సంకల్ప యాత్రలతో తలమునకలై ఉండగా, దళపతులు పంచరత్న యాత్రనుKharge కొనసాగించారు. భారత్‌ జోడో యాత్ర అనంతరం ఆయా జిల్లా, తాలూకా కేంద్రాలలో కాంగ్రెస్‌ పార్టీ వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. జనసంకల్ప యాత్రలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అన్ని ప్రచార కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అనివార్యం అయ్యారు. ఆయనను పక్కన పెట్టి ప్రచారం చేసినా ఫలితాలు రావడం లేదు. పాత మైసూరు జిల్లాలో ఎక్కువ సీట్లు గెల్చుకుంటే విజయం నల్లేరుపై నడకగా మారుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఉత్తరాది తరహాలో కేవలం ప్రధాని మోదీ వర్ఛస్సు ఇక్కడ పని చేయదని కమలదళం గుర్తించింది. బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను నాయకులకు అప్పగించింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్‌, దళ్‌కు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మహేశ్‌ ఇప్పటికే భాజపాకు మద్దతును ప్రకటించారు. వెనుకబడిన వర్గాలు, సముదాయాలకు చెందిన నేతల ఇళ్లకు ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా నాయకులు వెళ్లి, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరి, ఎమ్మెల్సీగా ఉన్న హెచ్‌.విశ్వనాథ్‌ మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సిద్ధరామయ్యను, డి.కె.శివకుమార్‌ను భేటీ అయి, వారితో ఒక విడుత చర్చలు చేశారు. ఆపరేషన్‌ కమలతో భాజపాలో చేరిన నాయకులు పార్టీ ఫిరాయించకుండా కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రధాని మోదీతో పాటు, జాతీయ నాయకులతో ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేలా కాషాయ పార్టీ నేతలు వ్యూహ రచనలలో తలమునకలై ఉన్నారు.

దళపతుల ధీమా

జాతీయ పార్టీల పాలన తీరుతెన్నులతో కన్నడిగులు విసిగిపోయారని కుమారస్వామి పలుసార్లు ప్రకటించారు. వారికి ప్రత్యామ్నాయంగా దళ్‌ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమాతో ఉన్నారు. టార్గెట్ 123 పేరిట ఇప్పటికే పంచరత్న యాత్రను ప్రారంభించారు. పంచరత్న యాత్రకు వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పటికే మూడుసార్లు వర్షంతో కొన్ని చోట్ల యాత్ర వాయిదా పడుతూ వచ్చింది. రెండు దశాబ్దాల క్రితం (1994)లో ఎక్కువ సీట్లు దక్కించుకున్నట్లు మళ్లీ ఈసారి తామే అధికారంలోకి వస్తామని మాజీ ప్రధాని దేవేగౌడ ఆశపెట్టుకున్నారు. ఇప్పటికే వంద మంది అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణను కూడా ఇచ్చారు. నియోజకవర్గాలలో ప్రచారం చేసుకోమని సూచించారు. స్థానికుల సమస్యలను తెలుకుని వారు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీతో అంటీ ముట్టనట్లు ఉంటున్న నాయకులకు టిక్కెట్టు ఇవ్వమని తేల్చి చెప్పారు. తమకు తురుపుముక్కలుగా ఉంటారని భావిస్తున్న నాయకులను మళ్లీ దళ్‌లోకి తీసుకు వస్తున్నారు. జాతీయ పార్టీల నుంచి వచ్చే నాయకులు దళ్‌లోకి వస్తే వారి సేవలు వినియోగించుకుంటామని కుమారస్వామి చెప్పారు. పాత మైసూరుతో పాటు మల్నాడు, ఉత్తర కర్ణాటక, హైదరాబాద్‌ కర్ణాటకలలో ఎక్కువ సీట్లు తాము గెల్చుకుంటామని దళపతులు భావిస్తున్నారు. ఈ విభాగాలలో రైతులు, సేద్యంపై ఆధారపడి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న వారు ఎక్కువగా ఉండడమే దీనిక కారణం.

కాంగ్రెస్‌కు తప్పని తలనొప్పులు

కాంగ్రెస్‌ పార్టీకి కర్ణాటక ఒకప్పుడు కంచుకోట. ఇప్పుడు నాయకుల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరు పట్టుసాధించే ప్రయత్నాలతో తెరవెనుక ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు ఇతర పార్టీల నాయకుల కన్నా, సొంత పార్టీ నాయకులే కారణం అవుతారన్న నానుడి ఇక్కడ నిజం చేసి చూపిస్తున్నారు. ఈసారి ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, బీఎస్పీ, దళ్‌ అభ్యర్థులు తమ ఓట్లు చీల్చుతారన్న భయం హస్తవాసులను పట్టిపీడిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే సాధారణంగా కేపీసీసీ అధ్యక్షునికే ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తారు. తానే అధ్యక్షుడు కావడంతో తనకు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందని శివకుమార్‌ భావిస్తున్నారు. ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలతో కారాగారానికి వెళతారని, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ కొందరు నాయకులు ప్రచారాన్ని ప్రవేశపెట్టారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ జాతీయ నాయకులు పలుసార్లు ప్రయత్నాలు చేశారు. తాను ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత మరోసారి తాను ఎన్నికల్లో పోటీ చేయనని సిద్ధరామయ్య చేసిన వాగ్దానాన్ని ఆయన విస్మరించారు. గత ఎన్నికల్లో ఆయన వరుణ నుంచి ఓటమి పాలైనా, బాదామి నుంచి పోటీ చేసి గెల్చారు. మళ్లీ వరుణ నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కేపీసీసీ ఇచ్చిన పిలుపునకు ఐదు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ చెన్నపట్టణ నుంచి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధు, శివునితో కలిపి మరో 14 మంది నేతలను హస్తినకు రావాలని పార్టీ జాతీయ నాయకులు కబురు పెట్టారు. ఈ నెలాఖరుకు మూడు పార్టీలు తమ ప్రచార వ్యూహాలకు పదునుపెట్టి ఓటర్ల ముందుకు రానున్నాయి.