home page

ఆర్ధికంగా అన్ని వర్గాలకు దెబ్బ

 | 

ఆర్థికంగా అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రజల పక్షాన నిలబడితే ప్రతిపక్ష ఛానల్సా?

 పోయినట్టు చెబుతున్న ఫోనే... ధ్వంసమైన ఫోన్లన్నింటికీ మదర్ ఫోన్

 ఎంపీ రఘురామకృష్ణంరాజు

 ప్రజల పక్షాన నిలబడిన చానెళ్లను ప్రతిపక్ష చానల్స్ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబోధించడం హాస్యాస్పదంగా ఉందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు విమర్శించారు. తనకు ఎటువంటి పేపరు లేదు... చానల్ సపోర్ట లేదని మదనపల్లి బహిరంగ సభలో  బాహాటంగానే అబద్ధాన్ని చెప్పారన్నారు. సాక్షి దినపత్రిక, ఛానల్ ఎవరిదని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... జగతి పబ్లికేషన్  పేరిట పది రూపాయల షేర్ ను  A2 తన దొంగ తెలివితేటలను ఉపయోగించి 350 రూపాయలకు అమ్మారని గుర్తు చేశారు. సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ ను నిర్వహిస్తున్నది జగతి పబ్లికేషన్స్ యాజమాన్యమేనని పేర్కొన్నారు. గతంలో పారిశ్రామికవేత్తలు అక్రమ సంపాదన పోగేసుకున్న సాక్షి దినపత్రిక, ఛానల్... ఇప్పుడు ప్రజల సొమ్ముతో నడుస్తుందన్నారు. ఉన్నది ఉన్నట్టు రాస్తున్న ఆ రెండు పేపర్లు, చానెళ్లను  ఆడిపోసుకుంటున్న ముఖ్యమంత్రి... టీవీ9, టెన్ టీవీ, ఎన్టీవీ  గురించి ఏమంటారు అని ప్రశ్నించారు. ఈ చానల్స్ ఎప్పుడైనా నిజాలు ప్రసారం చేశాయా?  అంటూ నిలదీశారు.  రాజధాని వ్యవహారంలో సుప్రీంకోర్టు చాచి లెంపకాయ కొట్టినట్లు తీర్పును ఇస్తే, ఈ చానల్స్ అన్నీ  ప్రభుత్వానికి ఊరట అంటూ కథనాలు ప్రసారం చేశాయని పేర్కొన్నారు. పాలక పక్షానికి వంత పాడుతున్న చానల్స్ అన్నింటిని,  మీ చానల్స్ గానే భావించాల్సి ఉంటుందన్నారు.. ఇక సాయి రెడ్డి నడిపే  డిజిటల్ చానల్స్ ఎన్నో ఉన్నాయని, దేవుడి పేరుతో, ఋషి పేరుతో ఉన్న చానల్స్ కు కొదవే లేదన్నారు. అలాగే 40 నుంచి 50 వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారని, అయినా తనకు పేపర్ లేదు చానల్స్ లేదని పేర్కొంటే ఎవరూ నమ్మరని అన్నారు.

 అబద్ధం అంటే నిజమా?...
 నిజం అంటే అబద్దమా జగన్

 మీ దృష్టిలో అబద్ధం అంటే నిజమా?, నిజం అంటే అబద్దమా?? జగన్మోహన్ రెడ్డి అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. కులం చూడం మతం చూడం అని చెప్పి, తమ కులం వారినే చూస్తున్నారని సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న ట్రోల్ కు సంబంధించిన ఫోటోలు మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రదర్శించారు. 
 రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా చితక్కొట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.  నాణ్యమైన మద్యం విక్రయించకుండా, ఇష్టారాజ్యంగా ధరలు పెంచి మందుబాబులను దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో రైతులకు సున్నా వడ్డీ కే రుణాలను అందజేస్తున్నామని  చెప్పి పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారే తప్పితే, ఆచరణలో అమలు కావడం లేదన్నారు. రైతులకు లక్ష కోట్ల రూపాయల రుణాలను అందజేస్తే, వడ్డీ రూపంలో 5000 వేల కోట్ల రూపాయలు చెల్లించాలన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రతిపాదించడం జరుగుతుందని చెప్పినా గత ఏడాది 155  కోట్లను, అంతకుముందు సంవత్సరం 300 కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించినట్లు ఉందన్నారు.పావలా వడ్డీకి రుణాలను మంజూరు చేసినప్పుడే రైతులు ఆనందంగా ఉండేవారని తెలిపారు. పత్రికల్లో ప్రకటనలు వేసుకున్నంత మాత్రాన, రైతులు కాని వారు నమ్ముతారేమో కానీ రైతులకు వాస్తవ పరిస్థితి తెలుసునని వారు నమ్మే అవకాశమే లేదన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన పథకాల్లో భాగంగా  విద్యార్థులకు చివరి క్వార్టర్ ఫీజులను  తల్లుల అకౌంట్లోకి బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి బదిలీ చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, గత రెండు క్వార్టర్ల సొమ్ము విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ కాలేదని తెలిసిందన్నారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు వారి బంధువులకు తెలుసునని, మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా వారు నమ్మే అవకాశం లేదన్నారు. కళాశాలలు వారిని ఫీజులు కట్టకపోతే వడలరేమో అన్నారు. 

 పంచాయతీరాజ్ ఈఎన్సీ గా సివి సుబ్బారెడ్డి 

 పంచాయతీరాజ్ ఈఎన్సీగా సివి సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం విస్మయాన్ని కలిగించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన సీనియర్ అధికారులను కాదని  సివి సుబ్బారెడ్డిని నియమించడం పక్షపాత ధోరణి కాకపోతే మరేమిటి అని ప్రశ్నించారు. గతంలో బి సుబ్బారెడ్డి ఈఎన్ సీ గా వ్యవహరించే వారిని, పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఏడాదిన్నర పాటు పదవీ కాలాన్ని పొడిగించి బాధ్యతలను అప్పగించారన్నారు. ఇప్పుడు తిరిగి ఆయనకు పదవీకాలం పొడిగించే అవకాశం లేకపోవడంతో, సీనియర్లను కాదని సివి సుబ్బారెడ్డిని నియమించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి, చేసే దానికి అసలు పొంతన ఉండడం లేదని మండిపడ్డారు. బీసీలు తమ పార్టీకి బ్యాక్ బోన్ అని చెప్పుకుంటూ, ఈనెల 5వ తేదీన బీసీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. కానీ పదవుల నియామకాల్లో బీసీలను పూర్తిగా విస్మరిస్తున్నారని విమర్శించారు. పులులు, సింహాలు శాకాహారులుగా మారాయని చెబితే ప్రజలు నమ్ముతున్నారా?, లేకపోతే నమ్మినట్టు నటిస్తున్నారా?? అన్నది రానున్న రోజుల్లో తెలియనుందని చెప్పారు. తమ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం తగ్గించుకోవాలన్నారు. మీ తల్లి, తోడ పుట్టిన చెల్లి, వరుసకు సోదరి కూడా నిన్ను వదిలేసు కున్నామని పరోక్షంగా చెబుతుంటే... నేను మీ బిడ్డనని చెబితే నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరన్నారు.

 బాబుకు ప్రజలు బ్రహ్మరథం

 కర్నూలు కు హాజరైన జనాభాను తలదన్నే రీతిలో పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు హాజరయ్యారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రజలకు ఎన్ని అవాంతరాలు పెట్టినా స్వచ్ఛందంగా హాజరైన ప్రజలు ఒకవైపు అయితే,   నిర్బంధాన్ని... తవ్విన కందకాలను దాటుకొని  పారిపోయే జనం మరొకవైపు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సభ కు పెద్ద ఎత్తున హాజరై అభివాదం చేస్తున్న ప్రజానీకాన్ని, మరొకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగానే సభా ప్రాంగణం నుంచి పారిపోతున్న ప్రజలకు సంబంధించిన వీడియోను రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు.

 మాదకద్రవ్యాల వెనుక ఉన్నది వారే...!

 రాష్ట్రం లో మద్యం ముసుగులో , మాదకద్రవ్యాల సరఫరా కూడా జరిగినట్లు ఢిల్లీలోని ఉన్నత వర్గాలు భావిస్తున్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు.  ఏపీలో మద్యం వెనుక ఎవరు ఉన్నారో... మాదకద్రవ్యాల వెనుక కూడా వారే ఉన్నారన్న చర్చ కొనసాగుతుందని తెలిపారు . ప్రజల ఆరోగ్యాన్ని హరించి యువతను నిర్వీర్యం చేసి...  టన్నులు, టన్నుల కొద్దిప్రజల డబ్బులను
దోచుకునే ప్రక్రియలో ఉన్న రాజకీయ నాయకులను ప్రధాని నరేంద్ర మోడీ క్షమించరు అనిహెచ్చరించారు. తన ఫోను పోయిందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి  చెప్పడం పరిశీలిస్తే, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధం ఉన్నట్లేనని స్పష్టం అవుతుందన్నారు. గతంలో శరత్ చంద్రారెడ్డిని  తమ వాడని చెప్పి  ముఖ్యమంత్రితో కలిసి ఫోటోలు దిగిన విజయసాయిరెడ్డి, తన ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడం వెనుక అసలు మర్మం  ఏమిటో చెప్పాలన్నారు. మద్యం కుంభకోణంలో నిందితులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న వారంతా ధ్వంసం చేసిన ఫోన్లన్నింటికీ, మదర్ ఫోన్ విజయసాయిరెడ్డి పోయినట్లుగా చెబుతున్న ఫోనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు .  సోషల్ మీడియా వేదికగా దుర్గంధాన్ని వెదజల్లే ట్విట్లు చేస్తున్న వారిపై, ఒక ఎమ్మెల్యే సోదరుడిపై  న్యాయస్థానంలో నారా లోకేష్ టీం ఫిర్యాదు చేయడం శుభసూచకం అన్నారు. అలాగే పోలీసుల చేత హింసించబడిన వారంతా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పుడు కాకపోతే, రేపు ప్రభుత్వం మారిన తర్వాత అయినా వారిపై చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు.