home page

తమిళనాడు గవర్నర్ను రీకాల్ చేయాలని డిఎంకె డిమాండ్

ప్రభుత్వ విధానాలను అడ్డుకుంటున్నారు  

 | 
Stalin

 గవర్నర్ ఆర్‌ఎన్ రవిని తక్షణమే వెనుకకు పిలిపించుకోవాలని (రీకాల్) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేయడానికి తమిళనాడు పాలకపక్షం డిఎంకె తీసుకున్న నిర్ణయం రాజ్‌భవన్‌లపై చిరకాలంగా వున్న వివాదాన్ని తిరిగి తెర మీదికి తెచ్చింది.

ఇది ఈనాటి వివాదం కాదు. కాంగ్రెస్ , యుపిఎ ప్రభుత్వాలున్నప్పుడూ గవర్నర్లు కేంద్రం ఏజెంట్లుగా పని చేసి రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను నానా ఇబ్బందులు పెట్టారు. ఇప్పటి బిజెపియేతర పార్టీల ప్రభుత్వాలున్న రాష్ట్రాలలోని గవర్నర్లు వారి కంటే మరి రెండు ఆకులు ఎక్కువ చదువుకున్నారు. తమకు సంబంధంలేని విషయాల్లో కూడా జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలను, పాలక పక్షాలను ఇరుకున పెట్టే ప్రయత్నం రోజువారీగా చేస్తున్నారు.

ఒక రాష్ట్ర ప్రభుత్వం తన గవర్నర్‌ను వెనుకకు తీసుకోవాలని కోరే పరిస్థితి తలెత్తిందంటే ఆ గవర్నర్ ఎంతగా గీటుదాటారో ఊహించవచ్చు. ప్రస్తుతం కేరళ, తమిళనాడు గవర్నర్లు ఇద్దరూ ఈ విద్యలో ఆరితేరారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ నేరుగా ఒక మంత్రినే తొలగించాలంటూ ముఖ్యమంత్రికి సిఫారసు చేశారు. ఆ మంత్రి ఎడల తాను నమ్మకాన్ని కోల్పోయానని అతడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ అందులో పేర్కొన్నారు. తమిళనాడు గవర్నర్ రవి అనేక విషయాలపై అక్కడి ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెట్టే వైఖరిని ప్రదర్శిస్తున్నారు. తమిళులు అమిత గౌరవంతో, భక్తితో చూసే తిరుక్కురళ్ గ్రంథాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడారు. తమిళనాడు అవలంబిస్తున్న రెండు భాషల విధానాన్ని విమర్శించారు. తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జాతీయ ఉమ్మడి వైద్య పరీక్ష నీట్ విషయంలోనూ, విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్‌లర్ల నియామకం పైనా రాష్ట్ర ప్రభుత్వంతో లడాయికి దిగారు.

డిఎంకె ప్రభుత్వం పంపించిన అనేక బిల్లులకు ఆమోదం తెలపకుండా తన వద్ద వుంచుకున్నాడు. అలా వుంచుకున్న 21 బిల్లులకు ఆమోదం తెలపాలంటూ గత జూన్‌లో ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్‌ను అర్థించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ రవిని రీకాల్ చేయాలంటూ రాష్ట్రపతిని అర్థించాలని డిఎంకె నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు తయారు చేసిన పిటిషన్‌పై సంతకాలు చేయాలంటూ తమతో ఏకీభవించే భావ సారూప్యత గల ఎంపిలందరికీ డిఎంకె పార్లమెంటరీ పార్టీ నేత టిఆర్ బాలు లేఖ రాశారు. ఇటీవల జరిగిన కోయంబత్తూరు బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కు అప్పగించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి గవర్నర్ రవి తన అతిక్రమణ మనస్తత్వాన్ని మరోసారి ప్రదర్శించుకున్నారు. గతంలో బెంగాల్‌లో అప్పటి గవర్నర్‌గా పని చేసిన (ప్రస్తుత ఉపరాష్ట్రపతి) జగ్దీప్ ధంకర్‌ను తమిళనాడు గవర్నర్ రవి మించిపోతున్నారు.

ప్రతి దేశానికి ఒకే మతం వుంటుందని ఇండియాకు కూడా అదే శరణ్యమని ఇటీవల ఆయన చేసిన ప్రకటన పట్ల డిఎంకె, దాని సహచర పార్టీలు 11 తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్రంలోని బిజెపి నాయకత్వాన్ని సంతోషపెట్టేందుకు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నందున రాజీనామా చేసి వెళ్ళిపోవాలని రవిని డిఎంకె కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి. గవర్నర్ వ్యవస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చక్కని వారధిగా పని చేయాలే గాని కేంద్ర పాలకుల జేబు వ్యవస్థగా పని చేయకూడదు. కాని కేంద్రంలోని పాలక పక్షంతో విభేదించే పార్టీల పాలనలోని రాష్ట్రాల గవర్నర్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనికి విరుగుడు ఏమిటి, ఎలా అనేది తక్షణం సమాధానం చెప్పవలసిన ప్రశ్న. రాజ్యాంగ నిపుణుల సూచనలు తీసుకొని ఆ మేరకు గవరర్ల విధులు, బాధ్యతలలో సవరణ తీసుకు రావలసిన అవసరం వుంది. లేకపోతే రాజ్‌భవన్లు కుట్ర రాజకీయాల కేంద్రాలుగా ప్రజా వ్యతిరేక లక్షణాన్ని మరింతగా పూసుకుంటాయి. వాస్తవానికి గవర్నర్లు శాసన సభలో మెజారిటీ అనుభవిస్తున్న రాష్ట్ర మంత్రి వర్గాల సిఫారసుల మేరకే పని చేయాలి.

కాని తమకున్న కొన్ని విచక్షణాధికారాలను వారు సాగదీసి తమకు అనువుగా, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వినియోగించే సాహసం చేస్తున్నారు. గవర్నర్లు మంత్రి వర్గాల సలహా మేరకే పని చేయాలని రాజ్యాంగం చెబుతున్నది. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని అనేక సార్లు ధ్రువపరిచింది. రాజ్యాంగం గవర్నర్‌కు ఎదురులేని విచక్షణాధికారాలు ఇవ్వలేదని ఒక సందర్భంలో స్పష్టం చేసింది. గవర్నర్ సంతృప్తి చెందడం లేదా అసంతృప్తి చెందడం అనేవి రాష్ట్ర ప్రభుత్వాల అభీష్టానికి లోబడి వుండేవి మాత్రమేనని కూడా తీర్పు చెప్పిన సందర్భాలున్నాయి. అందుచేత గవర్నర్ల అధికారాలకు మరొకసారి స్పష్టమైన హద్దు గీత గీయవలసి వుంది. డిఎంకె కోరుతున్నట్టు రాష్ట్రపతి నేరుగా తనంతతానుగా గవర్నర్‌ను తొలగించే అవకాశం లేదు. రాష్ట్రపతి కూడా కేంద్ర మంత్రివర్గం సలహా మేరకే పని చేయవలసి వుంటుంది. అందుచేత గవర్నర్లను తొలగించడమనేది కేంద్ర ప్రభుత్వం చేతిలోనే వుంది.