2022లో బుల్ డోజర్ రాజకీయాలు!
Jan 1, 2023, 16:49 IST
|
న్యూఢిల్లీ : దేశంలో అణగారిన వర్గాల ప్రజలపై బీజేపీ బుల్డోజర్ రాజకీయాలు పీడకలను మిగిల్చాయి. ఆక్రమణల పేరుతో కేవలం ఒక వర్గం వారినే లక్ష్యంగా చేసుకుంటూ ఈ రాజకీయాలు సాగాయి. ఈ ఏడాదిలో (2022లో) యూపీలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి యోగి ప్రభుత్వం రెచ్చిపోయింది. బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలుగా చెప్పబడిన ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది. కనీసం ఒక నిర్దిష్ట ప్రక్రియను పాటించకుండా నియంతృత్వంగా వ్యవహరించింది. గొడవలు జరిగాయని తెలిసిన వెంటనే.. అక్కడికి బుల్డోజర్లు దిగడం.. ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుంటూ వారి ఇండ్లను కూలగొట్టడం వంటివి యోగి సర్కారు చేసింది. బాధితులకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయి. అడ్డూ, అదుపు లేకపోవడంతో యోగి ప్రభుత్వం తన నిజస్వరూపాన్ని మరింతగా బయటపెట్టి కఠినంగా వ్యవహరించింది. యోగి సర్కారు బుల్డోజర్ రాజకీయం ఇతర రాష్ట్రాలకూ పాకింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, మధ్యప్రదేశ్, గుజరాత్, అసోం, బీహార్ వంటి రాష్ట్రాలూ బుల్డోజర్లను అమాయకపు ప్రజల ఇండ్లపై ప్రయోగించాయి.
ఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్ 20న అధికారులు జహంగీర్‌పురిలోని మసీదు ద్వారం కూల్చారు అక్కడి మునిసిపల్ అధికారులు. అదే నెల 16న హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్‌దళ్ సభ్యులు ఊరేగింపు వెళ్తున్న సందర్భంగా వారు ముస్లింలతో ఘర్షణకు దిగారు. అయితే, కోర్టు ఆదేశాలున్నప్పటికీ.. అదేమీ పట్టించుకోని అక్కడి మునిసిపల్ యంత్రాంగం (బీజేపీ నేతృత్వంలోని) మసీదు గేటును కూల్చివేసింది. జులై 6న ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్‌లోని సరారు కాలే ఖాన్ ఎదురుగా ఉన్న గయాస్‌పూర్ బస్తీలో 60కి పైగా అద్దెదారులపై బుల్డోజర్‌ను ప్రయోగించింది. అలాగే, అంగన్వాడీలను కూడా కూల్చేసింది. కానీ, ఒక గోశాలను మాత్రం కనీసం ముట్టుకోకపోవడం గమనార్హం.
యూపీ :ఈ ఏడాది మార్చి 21న ఇద్దరు లైంగికదాడి నిందితులు అమీర్, ఆసిఫ్ ల ఇంటికి బుల్డోజర్‌ను తీసుకొచ్చి వారిని లొంగిపోయేలా బలవంతం చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో నిందితులు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని యూపీ పోలీసులు కోర్టులో కూడా అంగీకరించడం గమనార్హం. ఏప్రిల్ 13న రాంపూర్ జిల్లా పోలీసులు హత్య నిందితుడి ఇంటిని కూల్చివేయడంపై విచారణకు ఆదేశించారు. సహరాన్‌పూర్‌లో ఇద్దరు నిందితులు అబ్దుల్ వాకీర్, ముజమ్మిల్‌ల ఆస్తులను కూల్చినట్టు ఎస్‌ఎస్పీ ఆకాశ్ తోమర్ అంగీకరించారు. జూన్ 13న ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ జావేద్ మొహమ్మద్ (అలియాస్ జావేద్ పంప్) ఇంటిని కూల్చేసింది. డిసెంబర్ 10న జైషే మహ్మద్ కమాండర్‌గా భావిస్తున్న ఆషిక్ నెంగ్రూ ఇంటిని కూల్చివేశారు.
మధ్యప్రదేశ్ : ఏప్రిల్ 10న ఎంపీలోని ఖర్గోన్‌లో రామనవమి సందర్భంగా రాళ్లదాడి జరిగింది. ఇందులో దాదాపు 80 మందిని అక్కడి ప్రభుత్వ అరెస్టు చేసింది. అయితే, హింసాకాండకు పాల్పడిన వారి 45 ఇండ్లను కూల్చివేశారని ఇండోర్ డివిజనల్ కమిషనర్ పవన్ శర్మ వెల్లడించడం గమనార్హం. అలాగే, షియోపూర్‌లో సామూహిక లైంగికదాడి కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు మైనారిటీ వర్గానికి చెందిన వారి ఇండ్లను శివరాజ్‌సింగ్ చౌహాన్ సర్కారు కూల్చివేసింది. పోలీసుల సమక్షంలోనే వారి ఇండ్లు బుల్డోజర్లతో నేలమట్టం కావడం గమనార్హం. మొరెనా జిల్లాలోని బాన్‌మోర్ పట్టణంలో లైంగికదాడి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గిర్రాజ్ రజాక్ అనే రోజువారీ కూలీ ఇంటిని 'అక్రమ నిర్మాణం'గా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది.
గుజరాత్ : ఏప్రిల్ 10న ఆనందద్ జిల్లాలోని ఖంబత్ పట్టణంలో రామ్‌నవమి ఊరేగింపు సందర్భంగా రాళ్లు రువ్విన ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆ జిల్లా కలెక్టర్.. ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించారు. వీటిలో చాలా వరకు ఘర్షణల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వర్గానికి చెందినవారివే కావడం గమనార్హం. ఏప్రిల్ 21న సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ పోలీసులతో కలిసి గ్యాంగ్‌స్టర్ సోదరులు ఆరిఫ్, సజ్జు కొఠారీకి చెందిన ఆస్తులను కూల్చేసింది. అక్టోబరులో బెట్ ద్వారకా ద్వీపంలో సుమారు 10వేల మంది జనాభా ఉన్న 100 నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి. వీటిలో ఎక్కువ భాగం మైనారిటీ సామాజికవర్గానికి చెందినవారివే కావడం గమనార్హం. నవంబర్‌లో, కచ్ జిల్లాలోని జఖౌ హార్బర్‌లో 300 ఇండ్లు, గుడిసెలు, గోడౌన్‌లు అక్రమంగా ఉన్నాయని భావించి కూల్చేశారు. దీంతో మత్స్యకారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అసోం: మే 21న అసోంలోని నాగోన్ జిల్లాలోని ఎనిమిది ఇండ్లను అక్కడి అధికారులు కూల్చేశారు. జంతు హక్కుల కార్యకర్త వినీత్ బగారియా ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బైదుల్లా ఖాన్ నివాసాన్ని జులై 12న దిబ్రూఘర్ జిల్లా యంత్రాంగం కూల్చివేసింది. అదేనెలలో, కరీంగంజ్‌లోని ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో 90 ఇండ్లు ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్‌లో నేల మట్టమయ్యాయి. అయితే, తమ వద్ద భూమికి సంబంధించిన పత్రాలు న్నాయని బాధితులు వెల్లడించడం కొసమె రుపు.సెప్టెంబరులో 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం బోర్కొల్లా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నారని పేర్కొంటూ 299 కుటుం బాలను అక్కడి నుండి ఖాళీ చేయించారు. వీరిలో 243 మంది మైనారిటీ వర్గాలకు చెందిన కుటుంబాలే కావడం గమనార్హం.
బీహార్ : బీజేపీతో జేడీ(యూ) కొనసాగించిన సంకీర్ణ ప్రభుత్వంలోనూ బుల్డోజర్ రాజకీయాలు సాగాయి. ఏప్రిల్‌లో బీహార్ రెవెన్యూ మంత్రి రామ్ సూరత్ రారు (బీజేపీ) పరారీలో ఉన్న నేరస్థులు, రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఆక్రమించే వారిపై బుల్డోజర్ డ్రైవ్‌ను ప్రారంభిస్తామని హెచ్చరించారు. అయితే, ఆయన ప్రకటనను సీనియర్ జేడీ(యూ) నాయకుడు ఉపేంద్ర కుష్వాహా వ్యతిరేకించడం గమనార్హం. అయినప్పటికీ కొన్ని చోట్ల బీజేపీ మంత్రుల ఒత్తిళ్లతో నిర్మాణాల కూల్చివేతలు జరిగాయి. అయితే, ఇలాంటి విషయాల్లో పాట్న హైకోర్టు అధికారుల తీరునే తప్పుబట్టడం గమనార్హం.