ఆత్మభిమానికి ప్రతీక ఆనం!
దమ్ముంటే ఆనం , కోటంరెడ్డి లపై చర్య తీసుకో :రఘురామ్ రాజు
Dec 30, 2022, 18:14 IST
|
ఆత్మాభిమానానికి ప్రతీక ఒకప్పుడు నేనైతే... ఇప్పుడు ఆనం
పెన్షన్ల తొలగింపును ప్రశ్నించిన కోటంరెడ్డి
దమ్ముంటే ఆనం, కోటంరెడ్డి లపై అనర్హత వేటు వేయాలి
మన సభలకు ప్రజలు ఎందుకు... ఏమి చేశామని వస్తారు??
మానసిక వికలాంగులకు నామ మాత్రపు ధరకు స్థలాన్ని కేటాయించండి
ఆ మొత్తాన్ని నేనే చెల్లిస్తాను
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలయ్యింది. ఈ తిరుగుబాటు అనేది అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న సమరం. అహంకారానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అయితే , ఆత్మాభిమానానికి ఒకప్పుడు ప్రతీక నేను , ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి. ఇన్నాళ్లు ఓపిక పట్టి, అవమానాలను సహించిన వారు ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటకు వస్తున్నారని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రజలకు ఏమి చేశామని ఓట్లు అడగమంటావని ఇటీవల మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు . రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేదని విమర్శించిన ఆనం, బటను నొక్కాను పెన్షన్లు ఇచ్చానని ముఖ్యమంత్రి చెప్పడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇవ్వలేదా? అని సూటిగా ప్రశ్నించిన రాం నారాయణరెడ్డి, 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు నే ప్రజలు ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారన్నారు. అటువంటిది రెండు వేల రూపాయల నుంచి 3000 చేస్తామని చెప్పి, ఇప్పుడు 250 నుంచి 500 రూపాయలు పెంచి పెన్షన్ ఇస్తామంటే ప్రజలు ఓట్లు వేస్తారా అన్న ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నసహితుకమైన ది తెలిపారు. 200 నుంచి 2000 రూపాయలకు పెన్షన్ మొత్తాన్ని పెంచిన చంద్రబాబు నాయుడు నే పక్కన పెట్టిన ప్రజలు, ఇప్పుడు మనల్ని ఎందుకు నమ్ముతారన్న ఆనం రామనారాయణ రెడ్డి వాదనను జగన్మోహన్ రెడ్డి ఆలకించి, ఆత్మావలోకనం చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... ఒక్క ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే కాదని, మూడు వేల పైచిలుకు పెన్షన్ల తొలగించడాన్ని నిరసిస్తూ మరొక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రిని ప్రశ్నించారని గుర్తు చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పెన్షన్లను తొలగించిన తర్వాత గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ప్రజల మధ్యకు ఎలా వెళ్ళమంటారని నిలదీశారన్నారు. ఇదే తరహా సమస్య అన్ని చోట్లలో ఉన్నదని, అయితే కొడుతారనో, తిట్టిస్తారనో చాలామంది శాసనసభ్యులు భయపడుతున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తాను ఇలాగే పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మంచి సలహాలను చెబితే, కాళ్లు కట్టి కొట్టించారని గుర్తు చేశారు.
ప్రశ్నించిన డి ఎల్, ప్రసాద్ రెడ్డి
ప్రభుత్వ తప్పుడు విధానాలను, ముఖ్యమంత్రి అహంకారపూరిత వైఖరిని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి సైతం ప్రశ్నించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. డిఎల్ తమ పార్టీలో ఉన్నారో, లేరో తనకు తెలియదని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 32 ఏళ్ల పిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ మంత్రిగా డిఎల్ రవీంద్రారెడ్డి పని చేశారు. అంతటి సీనియర్ నాయకుడిని ఎవరు బ్రతిమాలి పార్టీలోకి తీసుకువచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారో, లేదో అని సజ్జల రామకృష్ణారెడ్డి అనడం అంటే బలుపా?. లేకపోతే పార్టీలో ఎవరు ఉన్నారో లేదో తెలుసుకునే మెకానిజం లేదా??. ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డిలు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించినట్లుగా మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో కోటాను కోట్ల రూపాయలను కొట్టేయాలని చూశారు. ఇదే విషయంపై సీనియర్ ఐఏఎస్ అధికారి రాసిన లేఖను బహిర్గతం చేయాలి. 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి కొట్టి వేసేందుకు పథకరచన చేశారు. దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తున్నామని చెబుతున్నారు. ఇంకా అవినీతి ఎక్కడ జరుగుతోందని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. మరి స్మార్ట్ మీటర్ల కొనుగోలు వ్యవహారంలో జరిగేది ఏమిటి?. అది అవినీతి కాదా??. పార్టీ ఎమ్మెల్యేల నుంచి తిరుగుబాటు ఎందుకు మొదలయ్యిందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆత్మవలోకనం చేసుకోవాలి. రాం నారాయణరెడ్డి ప్రస్తుతం సలహాలు ఇచ్చినట్లుగానే , తాను గతంలో సలహాలను ఇచ్చాను. అది ముఖ్యమంత్రి కి ఏ మాత్రం రుచించలేదు. తనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. లోక్ సభ స్పీకర్ న్యాయంగా వ్యవహరించారు. తాను ఏనాడు పార్టీని విమర్శించలేదు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను మాత్రమే ఎత్తి చూపాను. ఆరోజు నేను చేసింది నేరం, దోషం అయితే... ఈరోజు ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డిలపై దమ్ముంటే అనర్హత వేటు వేయాలి. అసెంబ్లీ స్పీకర్ మీ వాడే కాబట్టి, వారిద్దరిని అనర్హులుగా ప్రకటించాలి. విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా తన నివాసంలో బీసీ కులాలకు చెందిన ఎమ్మెల్యేలకు భోజనం పెట్టారా?, అటువంటప్పుడు ఎందుకు ఉంటుంది విశ్వసనీయత. నలుగురిని సమానంగా చూడడమే రాజకీయం. తనకు కావలసిన నలుగురిని తన వెంట పెట్టుకోవడం కాదు. పదిమందిని ప్రేమగా పలకరించడమే రాజకీయం... కాదంటే ఎన్నికల ముందు ప్రజలు రాజకీయాన్ని రుచి చూపిస్తారని రఘురామకృష్ణం రాజు అన్నారు.
పాదయాత్ర సాగనివ్వం... నడవనివ్వం అంటే కుదరదు
యువగళం పేరిట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించ తలపెట్టిన యువ గళం పాదయాత్ర కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తమ పార్టీ నాయకులు ప్రకటించడం దివాలా కోరుతనానికి నిదర్శనమని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. మన ప్రభుత్వం యువకులను మోసం చేసిందని యువకులు అంటున్నారు. యువకులతో కలసి నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాము. గత మూడున్నర ఏళ్లలో ఏనాడు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఒక్క టీచర్ ను అపాయింట్మెంట్ చేయలేదు. నాడు నేడు లో భాగంగా పాఠశాల భవనాలను నిర్మాణం చేశారు. కానీ 6000 పాఠశాలలను ఎత్తివేశారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నారా లోకేష్ పాదయాత్రను సాగనివ్వం... ఆయన్ని ప్రజల్లో నడవనివ్వమని మేరుగ నాగార్జున అంటున్నారు . గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకరించలేదా?. మనమేమైనా ఆకాశము నుంచి దిగి వచ్చామా?, మనము దేవుని బిడ్డలమా?. పోలీసు సిబ్బందిని సెక్యూరిటీగా ఇచ్చి సజావుగా పాదయాత్ర నిర్వహించుకునేలా చంద్రబాబు నాయుడు సహకరించినప్పుడు, మనము పాదయాత్ర అడ్డుకోవాలని చూడడం దిగజారుడుతనము కాదా?. రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగా ఉంటేనే, పాలక పక్షం బలపడుతుంది. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోండి. ముఖ్యమంత్రిగా ఒక ఎంపీని తన నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకోవడమే రాజకీయమా?. ప్రతిపక్షాలు ప్రేమతో విమర్శించినప్పుడు స్వాగతించాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే నడుచుకునేవారు. తనపై పోటీ చేసిన వ్యక్తిని కూడా ప్రేమతో పలకరించడం ఆయన నైజం. అంతేకానీ ఒక ఎంపీ ని కాళ్లు కట్టేసి కొట్టించడం, దాన్ని మరొకరు వీడియో చిత్రీకరిస్తే చూసి ఆనందించడం రాజకీయం కాదు. మనం యువ గళం కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తే, అంతగా సూపర్ హిట్ అవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
మన సభలకు ప్రజలు ఎందుకు వస్తారు?
ప్రభుత్వం నిర్వహించే సభలకు ప్రజలు ఎందుకు వస్తారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి, చేయనందుకు థాంక్యూ జగన్ అంటూ యువతి యువకులు ఏకమై వస్తారా?. కేంద్ర ప్రభుత్వం పాలసీని సాకుగా చూపి 6 వేల పాఠశాలను ఎత్తివేసినందుకు, విద్యావ్యవస్థను దారుణంగా నాశనం చేసినందుకు, చిన్నపిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేసినందుకు థాంక్యూ జగన్ మావయ్య అంటూ విద్యార్థులు హాజరవుతారా?. వారం రోజుల వ్యవధిలోనే సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి, చేయనందుకు ఉద్యోగస్తులు మనం నిర్వహించే సభలకు హాజరవుతారా?. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను ఎత్తివేసి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను తీసివేసి, వాళ్లకు రావలసిన స్కీమ్స్ అన్నింటిని తొలగించినందుకు వారు మన సభలకు హాజరు కావాలా?. విద్యా దీవెన, విద్యా వసతి కార్యక్రమంలో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నాలుగు ఇనిస్టాల్మెంట్స్ గా ఇస్తామని చెప్పి, రెండు ఇనిస్టాల్మెంట్స్ ను ఎత్తివేసినందుకు విద్యార్థులు మన సభలకు హాజరవుతారా?. ఉద్యోగులు డిఏ ల కోసమే కాకుండా, జీతాల కోసం కూడా ఎదురుచూపులు చూస్తున్నందుకు మన సభలకు హాజరు కావాలా?. 50 రూపాయలు ఉన్న మద్యం సీసా క్వార్టర్ ని మధ్య నిషేధం పేరిట 200 రూపాయలకు పెంచి నగదు రూపంలో దోచుకుంటున్నందుకు మహిళా లోకానికి మనం చేసిన మేలుకొని మన సభలకు మహిళలు హాజరు కావాలా?. నాలుగు లక్షల నుండి ఆరు లక్షల పింఛన్లను తీసి వేస్తున్నందుకు అవ్వ, తాతలు మన సభలకు హాజరు కావాలా?. ప్రత్యేక హోదా పోరాడి తీసుకువచ్చామని స్కూలు, ఆర్టీసీ బస్సులలో ప్రజలు తరలి వస్తున్నారని చెబుదామా అంటూ జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. పక్కవారి సభలకు ప్రజలు హాజరవుతున్నారని మనకు ఉలికెందుకంటూ ప్రశ్నించారు. మన మీటింగులకు ప్రజలు ఎలా హాజరవుతున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. ఎప్పుడైనా అరగంట ఆలస్యంగా సభ ప్రారంభం అయితే, సభ ప్రారంభానికి ముందే ప్రజలు ప్రాంగణం నుంచి పారిపోతున్నారన్నారు. అదే ప్రతిపక్ష నేత నిర్వహించే రోడ్ షోలకు హాజరయ్యే ప్రజలు ఐదారు గంటలు ఆలస్యం అయినా ఓపికగా వేచి చూసి ఆయన ప్రసంగాన్ని వింటున్నారని పేర్కొన్నారు. కందుల్లో గొందుల్లో మీటింగులు నిర్వహిస్తున్నారని ప్రతిపక్ష నేతను మన పార్టీ నేతలు, మంత్రులు విమర్శించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు.
మానసిక వికలాంగులను ఆదుకోండి
తనను కాళ్లు కట్టేసి కొట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో మానవత్వం ఉందని తాను అనుకోవడం లేదని కానీ ఆయన అంతరాలలో ఎక్కడైనా ఒకచోట మానవత్వం ఉండి ఉంటే మానసిక వికలాంగులకు చేయూతనివ్వాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీ, ఉషోదయ జంక్షన్ లోని పార్కులో గత ప్రభుత్వ హయాంలో మానసిక వికలాంగుల కోసం సంవత్సర కాలానికి స్థలాన్ని లీజుకు ఇచ్చింది. అయితే గత ఏడాది జూన్ 21వ తేదీన విజయసాయి రెడ్డి కి సంబంధించిన మనుషులు మానసిక వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డును, కూల్చివేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు తీసుకువచ్చిన ఎక్విప్మెంట్ ను, దాతల సహకారంతో సమకూర్చుకున్న బస్సులను సీజ్ చేశారు. శ్రీనివాస రావు అనే సామాజికవేత్త, 200 మంది మానసిక వికలాంగులైన విద్యార్థుల కోసం ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఒక్క రూపాయి ఫీజు రూపంలో తీసుకోకుండా, దాతృత్వం కలిగిన దాతల సహకారంతో వారికి విద్యాబుద్ధులను నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ కూల్చివేత ఘటనను అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్ సృజన దృష్టికి తీసుకువెళ్లగా, ఆమె న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతలోనే ఆమె బదిలీ కాగా, లక్ష్మీ షా అనే మరో మంచి అధికారి పదవి బాధ్యతలను స్వీకరించారు. మంచివారిని ఎక్కువ కాలం కొనసాగించడం మా పార్టీ నేతలకు ఇష్టం ఉండదు. మానసిక వికలాంగుల పాఠశాలను కూల్చి పార్కును అభివృద్ధి చేశారా?, అంటే అది కూడా లేదు. ప్రస్తుతం శ్రీనివాసరావు ఒక దాత ఇచ్చిన స్థలంలో రేకుల షెడ్డు ను ఏర్పాటు చేసి, విద్యార్థులకు విద్యాబుద్ధులను నేర్పిస్తున్నారు. అయితే గతంలో వారికి బల్లాలు, విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి అధునాతనమైన ఎక్విప్మెంట్, సొంత బస్సులు ఉండేవి. కానీ ఇప్పుడు అవేవీ లేవు. ఎందుకంటే వాటిని తమ పార్టీ పెద్దల ఆదేశానుసారం సీజ్ చేశారు. పార్టీ కార్యాలయాల కోసం విలువైన స్థలాలను నామమాత్రపు ధరకు లీజు కు ఇస్తున్నారు. అలాగే మానసిక వికలాంగుల పాఠశాల కోసం నామ మాత్రపు ధరకు ప్రభుత్వ స్థలాన్ని లీజుకు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తనకు మానవత్వం ఉందని చాటుకోవాలి. ఆ లీజు సొమ్ము మొత్తాన్ని తానే చెల్లిస్తాను. పార్కు స్థలంలో కాకపోతే మరొక చోట అయినా 200 మంది మానసిక వికలాంగులైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్థలాన్ని కేటాయించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులైన విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించిన ఫోటోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
హీరా బెన్ మోడీ మృతికి సంతాపం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృ మూర్తి హీరా బెన్ మోడీ మృతికి రఘురామకృష్ణం రాజు సంతాపం తెలియజేశారు. ప్రధాని తల్లి అయినప్పటికీ, హీరా బెన్ మోడీ ఎంతో సాధారణ జీవితం గడిపారని కొనియాడారు.