ఏటా కోటి దాకా బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీ తెలంగాణ లో ఊరూ, వాడా సంబురమే నింపింది. ఏటా 96లక్షల మందికి ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. రెండురోజుల నుంచి చీరల పంపిణీ ప్రారంభించడంతో బారులు తీరిన మహిళలు రంగురంగుల చీరలు అందుకుంటూ మురిసిపోతున్నారు. వరుసగా ఏడో ఏడాది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టింది. ఈనేత చీరల తయారీకి చేనేత సంఘాలకు ఆర్ధికంగా సహాయపడుతోంది.

‘నచ్చిన కలరే నాకొచ్చింది’ అంటూ సంతోషపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ముమ్మరంగా సాగుతున్నది. రెండ్రోజుల్లో 20 లక్షల వరకు చీరలను పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈనెల 2న చీరల పంపిణీ ప్రారంభం కాగా.. శనివారం 4.68 లక్షల మందికి, ఆదివారం 15 లక్షల మందికి చీరల పంపిణీ చేసినట్టు తెలిపారు. ఆహారభద్రత కార్డులో నమోదై ఉండి, 18 ఏండ్ల వయసు నిండిన 1.08 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.

నేతన్నకు పని.. ఆడబిడ్డకు కానుక
బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాక మరమగ్గాల నేతన్నలకు నిరంతరం పని దొరుకుతున్నది. ఫలితంగా వారి జీవన స్థితిగతులు, నైపుణ్యంలో మార్పు వచ్చింది. ఇప్పుడు నేతన్నలు సరికొత్త డిజైన్లతో వస్ర్తాలు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధించారు. ప్రాజెక్టు తాలూకు సానుకూల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవర్‌లూమ్‌ కార్మికుల వేతనాలు రెట్టింపయ్యాయి. సుమారు 20 వేలమంది పవర్‌లూమ్‌ కార్మికులకు చేతినిండా పని దొరుకుతున్నది. గతంలో పనిలేక ఆత్మహత్యలే శరణ్యమనుకున్న నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయనడంలో సందేహం లేదు. చీరల నాణ్యత, డిజైన్లు, రంగుల ఎంపిక తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నాం. క్షేత్రస్థాయి నుంచి ప్రాతినిధ్యం ఉన్న మెప్మా, సెర్ప్‌ స్వయం సహాయక బృందాల్లోని మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొన్నాం. అందుకు అనుగుణంగా నిఫ్ట్‌ డిజైనర్లతో చీరలకు డిజైన్‌ చేయించాం. ఈ సంవత్సరం 30 సరికొత్త డిజైన్లు, 20 విభిన్న రంగులతో కూడిన 810 రకాల చీరలను పంపిణీ చేస్తున్నాం. జరీ అంచుతో 100% పాలిస్టర్‌ ఫిలిమెంట్‌ / నూలుతో 6.30 మీటర్ల పొడవుగల చీరలు ఒక కోటి, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వృద్ధ మహిళల కోసం ప్రత్యేకంగా 9 మీటర్లు పొడవు గల ఎనిమిది లక్షల చీరలు పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాది బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం రూ.333.14 కోట్లు కేటాయించింది. – కేటీఆర్‌, చేనేత, జౌళి, పరిశ్రమలశాఖ మంత్రి

కొత్త డిజైన్లు ఆకర్షిస్తున్నాయి
ఈ ఏడాది సరికొత్త డిజైన్లతో చీరలను తయారు చేయించాం. మహిళల అభిరుచికి అనుగుణంగా క్షేత్రస్థాయినుంచి అభిప్రాయాలు సేకరించి, నిఫ్ట్‌ వంటి ప్రఖ్యాతిగాంచిన సంస్థతో డిజైన్లు చేయించాం. ఫలితంగా మహిళలు చీరలపట్ల ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఆహారభద్రత కార్డుల్లోని డాటా ఆధారంగా మహిళలందరికీ సరిపోయేలా చీరలు సిద్ధం చేశాం. ఏటా సగటున 96.5 లక్షల మంది చీరలు తీసుకుంటున్నారు. – శైలజా రామయ్యర్‌, చేనేత, వస్త్ర పరిశ్రమలశాఖ కమిషనర్‌

Leave A Reply

Your email address will not be published.