జనం ఓటు జగన్ పాలన కోసమా? సలహాదారులపాలనకా?

జనం ఓటు వేసింది జగన్ రెడ్డికి
పరిపాలిస్తున్నది జగన్ సలహాదారుడు
ఇదెక్కడి చిత్రం అంటున్న జనం.
(గోసాలప్రసాద్)
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనం మదిలో ఒకటే ప్రశ్న. మనం(జనం)జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ఓట్లు వేశామా? లేక సలహాదారుల పెత్తనం కోసమా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. జగన్ మంత్రివర్గంలో 25 మంది మంత్రులు ఉన్నారు. వారందరికీ ప్రజా సంక్షేమం చూసేందుకు శాఖలను కేటాయించారు.అంటే వారు(మంత్రులు)సమర్ధవంతంగా ఆయా శాఖలను నిర్వహించడానికి అవసరమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వుంటాయి. రాజ్యాంగ బద్ధంగా తమ శాఖలను నిర్వహిస్తామని ప్రమాణం కూడా చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మంత్రులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారా అంటే ఒక్క మంత్రి కూడా పట్టుమని పదిరోజులు కూడా రాష్ట్ర సచివాలయంలో కనిపించరు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. జనం అదృష్టం బావుంటే ఆరోజు సదరు శాఖల మంత్రులు సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ప్రభుత్వానికి కళ్ళూ చెవులుగా పనిచేయాల్సిన సమాచార శాఖకు కూడా పెద్దగా పనివుండదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే పీఆర్వోలు ప్రెస్ నోట్లు తయారు చేసి పత్రికలకు ముఖ్యంగా సాక్షికి ఇస్తారు.అంతే. ప్రతిపక్షాలు లేదా మీడియాలో వార్తలు వస్తే వాటికి వివరణలు , సవరణలు ఇచ్చేది కూడా ముఖ్యమంత్రి కార్యాలయమే.ఒకవేళ ఏదైనా వివరణో లేదా ఖండనో ఇవ్వాల్సి వస్తే అది కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వస్తాయి. సినియర్ ఉన్నతాధికారులు సైతం అదే పత్రికా ప్రకటలను చదవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే గగనమే. అందుకు ఎంతో పలుకుబడి వుండాలి. అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ సిఎం దర్శనం అంత త్వరగా లభించదు.ఇప్పటికైతే ప్రభుత్వం తరఫున ప్రజలకు నిత్యం మీడియాలో కనిపించేది , వినిపించేది ఒకే ఒక్క సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. సచివాలయంలో ఏమంత్రి ఉన్నా లేకున్నా ఆయన ఒక్కరే దిక్కు. ఉద్యోగుల సమస్యలు , పిఆర్సీ , సీపీఎస్ రద్దు వంటి అంశాలపైకూడా ఉద్యోగ సంఘాలతో సజ్జల మాత్రమే మాట్లాడారు.ఉద్యోగుల దౌర్భాగ్యం ఏమిటంటే వారి సమస్యలను వినడానికి మంత్రులు లేదా ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలైతే లేవు. చివరికి ఉద్యోగ సంఘ నాయకులు సలహాదారు సజ్జలను కలిసి ముఖ్యమంత్రి ని కలిసినంత సంబర పడ్డారు. సజ్జలవారు సకలశాఖల మంత్రిగా కీర్తించబడుతున్నారు. ఏమంత్రికి సంబంధించిన విషయమైనా సజ్జల వారే పత్రికల వారితో మాట్లాడుతారు.విద్యుత్ సమస్య వచ్చింది్ వెంటనే సజ్జల వారు స్పందించారు.రాష్ట్రంలో జనం సాయంత్రం 6 నుంచి 10 వరకూ టీవీలు , ఫ్రిజ్ లూ , ఏసీలు వాడొద్దని జనానికి సజ్జలవారు సెలవిచ్చారు. ఉద్యోగులు సమస్యలను ప్రస్తావిస్తే ఆర్ధికమంత్రి , అధికారులతో సంబంధించి ఒక మాట కూడా వారి చెవిన వేసారో లేదో-
అక్టోబర్ చివరి నాటికే పీఆర్సీ ఇస్తామనీ , నవంబరు నెలాఖరులోగా మిగతా సమస్యలు పరిష్కారం చూస్తామని సజ్జల వారు సెలవిచ్చారు. ఏతావాతా అన్నింటికీ సజ్జల వారే సర్కారుకు దిక్కులా వున్నారు. జగన్ కోసం ఓటు వేసిన జనం బిక్కుబిక్కుమంటూ వున్నారు. ఇదేనా జనం కోరుకున్న జగన్ పాలన అని ప్రశ్నిస్తున్న వారికి పోలీసులు నోటీసులు ఇచ్చినా హాశ్చర్యపోనవసరంలేదు.
(గోసాలప్రసాద్)

Leave A Reply

Your email address will not be published.