బద్వేలు బరిలో బిజెపి వుంటుందా?

♦ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమైన  బద్వేలు ఉపఎన్నిక లో పోటీ చేయరాదని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ  కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిట్టింగ్ అభ్యర్థి వెంకట సుబ్బయ్య మృతి కారణంగా ఏర్పడిన ఈ ఖాళీని భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి వల్ల ఆయన భార్య సుధకు టిక్కెట్ ప్రకటించింది. మృతి చెందిన ఎమ్మెల్యే సతీమణి కే టిక్కెట్ ప్రకటించినందువల్ల సంప్రదాయం పాటించాలని భావించిన జనసేన ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించింది. అయితే మిత్రపక్షమైన బిజెపి అభ్యర్ధిని రంగంలోకి దింపిపోటీ ఇస్తుందని ఆపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. తెలుగు దేశం పార్టి పోటీ చేయరాదని నిర్ణయించుకుంది. ఒకవేళ బిజెపి బరిలో వున్నా అది నామమాత్రపు పోటీ అవుతుంది. బిజెపి అభ్యర్ధికి డిపాజిట్ దక్కితే గొప్పే.

బద్వేల్‌ ఉపఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. ఆదివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు టీడీపీ తెలిపింది. ఉమ్మడి ఏపీలో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇచ్చాక అక్కడ ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని నెలకొల్పింది టీడీపీయేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటించలేదని టీడీపీ నేతలు గుర్తు చేశారు. బద్వేలు బరి నుంచి తప్పుకోవడంపై స్థానిక నేతలతో చర్చించాలని జిల్లా ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.

బద్వేలు ఉపఎన్నికల్లో పోటీచేయబోవడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ తెలిపారు. మరోవైపు బీజేపీ మాత్రం పోటీకి ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కడప జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని ప్రకటించారు. అలాగే బద్వేలు నియోజకవర్గ పరిధిలో రెండు జాతీయ రహదారులు నిర్మించింది తమ ప్రభుత్వమేనన్నారు. ఐతే జనసేన, టీడీపీల నిర్ణయం నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నుంచి వైఎస్ ఆర్సీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ జి. వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆయన సతీమణి డాక్టర్ సుధను వైసీపీ అధిష్టానం అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. త్వరలోనే డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు చేయునున్నారు. అక్టోబర్ 30న ఉప ఎన్నిక, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక రెండు రోజుల క్రితం బద్వేలు ఉపఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ముఖ్యనేతలతో చర్చించారు. పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రావాలని.. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించాలని.. గతంలో కంటే ఓటింగ్ శాతం పెంచాలని కూడా నేతలకు జగన్ టార్గెట్ విధించారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడం, బీజేపీ ఇంకా స్పష్టతనివ్వకపోవడంతో ఏకగ్రీవమవుతుందనే చర్చ సర్వత్రా సాగుతోంది. అయితే పోటీ చేస్తామంటున్న బిజెపి చివరి దాకా పోటీకి దిగుతుందా లేక వైసీపీ నేతలు మాట్లాడి ఏకగ్రీవానికి ఒప్పిస్తారా..? అనేది వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.