పంచాయతీలకు ‘ఏకగ్రీవ బహుమతి’ ఎగనామం!

ఏకగ్రీవాలకు నగదు బహుమతి ఎగనామం!

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినప్పుడు ప్రజలు తమ పంచాయతీలకు సర్పంచ్ లను , వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే జనాభా ప్రాతిపదికన నగదు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 13 వేల పంచాయతీలకు గాను 1400 పంచాయతీలు ఏకగ్రీవంగా నిలిచాయి. వీటికి సంబంధించి ఇంతవరకూ నయాపైసా బహుమతి సొమ్ములు పంచాయతీలకు విడుదల చేయలేదు.

పంచాయ‌తీల‌ను ఏక‌గ్రీవాలు చేసుకోవ‌డంలో ఉన్న శ్ర‌ద్ధ‌… ప్రోత్సాహ‌కాన్ని అందించ‌డంలో జ‌గ‌న్ స‌ర్కార్‌కు లేద‌నే విమ‌ర్శ‌లు వస్తున్నాయి.  నగదు బహుమతులు ఇవ్వడమన్నది ఆర్థిక వ్య‌వ‌హారంతో ముడిప‌డి ఉంది. ఒకవైపు సర్పంచ్ లకు చాలా జిల్లాల్లో చెక్ పవర్ ఇవ్వలేదు. దీనిపై కర్నూలు జిల్లా పంచాయతీ అధికారిపై కోర్టు ఆదేశాలు ధిక్కరించినందుకు కోర్టు ధిక్కారణ  చర్యలు తీసుకోవాలని కోర్టు రిజిస్ట్రార్ ను హైకోర్టు ఆదేశించింది.   దీంతో ఏక‌గ్రీవ‌ స‌ర్పంచులు ప్రోత్సాహ‌క న‌గ‌దు మాట ఎత్తితే చాలు అధికారులు చేతులెత్తి దండం పెట్టి ఆఒక్క విషయం అడగవద్దని వేడుకోవ‌డం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది.

రాష్ట్ర పంచాయ‌తీశాఖ తాజాగా ఏక‌గ్రీవ పంచాయ‌తీల నివేదిక‌ను త‌యారు చేసింది. ఈ నివేదిక ప్ర‌కారం ఏపీలో భారీగా పంచాయతీలు ఏక‌గ్రీవాల‌కు నోచుకున్నాయి. ఆరు నెల‌ల క్రితం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా పంచాయ‌తీలకు పార్టీల‌కు అతీతంగా ఎన్నిక‌లు జ‌రిగే సంప్ర‌దాయం ఉంది.

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహక నిధులు ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ప్రకటించింది. రెండు వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షలు, 2001నుంచి 5వేల జనాబా ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు, 5001 నుంచి 10వేల జనాభా గల పంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేలు పైనున్న పంచాయతీలకు రూ.20లక్షలు చొప్పున న‌జ‌రానా ఇస్తామని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్రకటించింది.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో మొత్తం 13,095 పంచాయతీల్లో సర్పంచుల పదవులతోపాటు దాదాపు 1.31 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 2,199 సర్పంచు స్థానాలు, 48,022 వార్డులు ఏకగ్రీవమ‌య్యాయి. వీటిలో రెండు వేలు, అంతకు తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,401 చోట్ల ఏకగ్రీవమ‌య్యాయి. అలాగే 10 వేల‌కు పైగా జ‌నాభా ఉన్న 11 పెద్ద పంచాయ‌తీల్లో మొత్తం వార్డు స‌భ్యుల‌తో పాటు స‌ర్పంచులు ఏక‌గ్రీవమ‌య్యారు.

పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిసి ఆరు నెల‌లైనా ప్రోత్సాహ‌క బ‌హుమ‌తి అంద‌క‌పోవ‌డంతో అభివృద్ధి ప‌నులు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయాయ‌ని స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధులు వాపోతున్నారు. వీరిలో 95 శాతానికి పైగా అధికార పార్టీ నేత‌లే ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ వైఖ‌రి చూస్తుంటే ఇప్ప‌ట్లో ప్రోత్సాహ‌క బ‌హుమ‌తి అందుతుంద‌న్న న‌మ్మ‌కం లేద‌ని స‌ర్పంచులు చెబుతుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Leave A Reply

Your email address will not be published.