నేనెవరి పేరూ సిఫార్సు చేయలేదు: కిషన్ రెడ్డి

తాజాగా జరిగిన టీటీడీ బోర్డు నియామకంలో సభ్యులు కొందరు కేంద్ర మంత్రుల పేర్లు చెప్పి స్థానం దక్కించుకున్నారని వార్తలు వచ్చిన నేపధ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాను ఎవరి పేరూ సిఫార్సు చేయలేదని , దీనిపై చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. టీటీడీ పాలకమండలి సభ్యత్వం కోసం ఈసారి భారీగా సిఫార్సులు వచ్చాయి. దీనితో ప్రభుత్వం జంబో బోర్డును ఏర్పాటు చేసింది. దీని పైన విమర్శలు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీటీడీ బోర్డులో సిఫార్సు చేసినట్లుగా చెబుతున్న వ్యక్తికి తాను సిఫార్సు చేయలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. తాను ఎవరి పేరును సిఫార్సు చేయలేదని..ఎటువంటి లేఖలు తాను కానీ తన శాఖ నుంచి ఇవ్వలేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. టీటీడి పాలక మండలి సభ్యుడిగా ఒక వ్యక్తి పేరును కిషన్ రెడ్డి సిఫార్సు చేయటంతో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారనే ప్రచారం సాగింది. అయితే, ఈ వ్యవహారం పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదంటూ సీఎం జగన్ కు కిషన్ రెడ్డి లేఖ రాసారు. తన పేరును దుర్వినియోగం చేయడాన్ని ఆయన లేఖలో ఖండించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని జగన్‌కు సూచించారు. గతంలో టీటీడీ బోర్డు 18 మంది సభ్యులకే పరిమితం అయ్యేది. జగన్ సీఎం అయిన తరువాత తొలి సారి నియమించిన బోర్డు లో 37 మంది సభ్యులు ఉన్నారు.

ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. రెగ్యులర్ సభ్యులుగా 25 మంది.. ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందిని నియమించారు. ప్రత్యేక సభ్యులుగా నియమితులైన వారికి బోర్డు నిర్ణయాల్లో ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు. ఓటింగ్‌ హక్కు లేదు. కనీసం పాలకమండలి సమావేశంలో కూడా వీళ్లు పాల్గొనలేరు. కొండపై ప్రత్యేక మర్యాదలను మాత్రం అనుభవిస్తారు. పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్‌ మొత్తం ప్రత్యేక ఆహ్వానితులకూ వర్తిస్తుంది. అంటే… వారితో సమానంగా తగిన మర్యాదలతో శ్రీవారిని దర్శించుకోవచ్చు.

దర్శనాలకు సిఫారసులూ చేయవచ్చు. ఇప్పటికే దీని పైన టీడీపీ అధినేత తో పాటుగా సీపీఐ నేతలు అదే విధంగా కొందరు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. టీటీడీ రాజకీయ పునరావాసంగా మారి పోయిందని ఆరోపిస్తున్నారు. ఇధే అంశం పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానానికి వేసిన జంబో బోర్డును తక్షణం రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.