ఆదాయం కోసం తెలంగాణ సర్కారు కొత్తమార్గాలు

పన్నేతర ఆదాయం పై దృష్టి

 తెలంగాణ లో  రాజకీయ అవసరాల కోసం సంక్షేమ పథకాలను ఇబ్బడిముబ్బడిగా ప్రవేశపెడుతున్న కెసిఆర్ ప్రభుత్వం కాసుల కోసం కష్టాలు పడుతోంది. పన్నులు పెంచడం ద్వారా ఆదాయం పెంచుకునే మార్గం అనుసరిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి పన్నేతర ఆదాయం కోసం ఆస్తులను తెగనమ్ముతోంది.

ఆర్థిక వనరులను సమకూర్చుకోడానికి పడరాని పాట్లు పడుతోంది. పన్నులు విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో పన్నేతర ఆదాయంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం భూములను అమ్మడం, అప్పులు చేయడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాలకు గ్రాంట్ల రూపంలో సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రత్యక్ష పన్నులతో ముప్పు తప్పదనే ముందుచూపుతొ నొప్పి తెలియకుండా స్టాంపు డ్యూటీ ధరల పెంపు, రిజిస్ట్రేషన్ టారిఫ్‌ను పెంచింది. బాధ తెలియకుండానే ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలను అవలంబిస్తున్నది.

గతేడాది కంటే బడ్జెట్ సైజును భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం పన్నేతర (నాన్ టాక్స్) ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచి చూపించింది. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికే ప్రభుత్వానికి ఏ రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉన్నదో స్పష్టమైన ఆలోచన ఉన్నది. పన్నేతర ఆదాయంలో కీలకంగా ఉన్న భూముల అమ్మకంపై దృష్టి పెట్టింది. ఇటీవల కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ భూముల అమ్మకం ద్వారా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకున్న ప్రభుత్వం ఈ నెల చివరకు మరికొన్ని భూములను అమ్మి కనీసంగా రూ. 10 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలనుకుంటున్నది.

భూముల అమ్మకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 30,557 కోట్లను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఈ నెల చివరకే రూ. 12 వేల కోట్లు సమకూరుతున్నది. ఇటీవల భూముల విలువలను సవరించడం, స్టాంపు-రిజిస్ట్రేషన్ల ధరలను పెంచడంతో అదనంగా రూ.8 వేల కోట్లు సమకూరుతున్నది. దీంతో దాదాపు రూ.20 వేలు కోట్లు సమకూరినట్లయింది. మిగిలినదాని కోసం మరిన్ని ఆస్తులను అమ్మే ఆలోచన చేస్తున్నది. ఆర్టీసీ భూముల అమ్మకంతో పాటు రాజీవ్ స్వగృహ ఇళ్లు, హౌజింగ్ బోర్డు స్థలాలు లాంటివాటిపై కూడా ప్రభుత్వం దృష్టి పడింది. ఇక దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోరాదన్న ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ లాంటి వాటిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది.

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రాష్ట్రానికి ఆదాయం కొద్దిగా మెరుగుపడినప్పటికీ దళితబంధు, రుణమాఫీ లాంటి పథకాలకు భారీ స్థాయిలో వెచ్చించాల్సి వస్తున్నందున ఇంకా నిధుల సమీకరణకు తిప్పలు తప్పలేదు. ఒకవైపు రిజర్వు బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటూనే మరోవైపు ప్రభుత్వ స్థిరాస్తుల అమ్మకం అనివార్యంగా భావిస్తున్నది. ఇంకోవైపు కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా గ్రాంట్ల రూపంలో సమకూర్చుకోవాలనుకుంటున్నది. బడ్జెట్ అంచనాలు, ఈ ఏడాది ఇప్పటివరకు సమకూరిన నిధులను పరిశీలిస్తే ఇంకా పూర్తి స్థాయిలో వనరుల కొరత తీవ్రంగానే ఉన్నట్లు స్పష్టమవుతున్నది.

 

Leave A Reply

Your email address will not be published.