అవన్నీ అనుమతిలేని ప్రాజెక్టులుగా పరిగణించాలి

హైదరాబాద్:

ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ప్రాజెక్టును అనుమతిలేని ప్రాజెక్టుగా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య  నిర్వహణ బోర్డును కోరింది. దీనితోపాటు  శ్రీశైలం కుడికాలువ, బనకచర్ల రెగ్యులేటర్‌, ఎస్కేప్‌ రెగ్యులేటర్‌, తెలుగు గంగ లింక్‌ కెనాల్‌ రెగ్యులేటర్‌లను అనుమతి లేని ప్రాజెక్టులుగానే పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. వీటన్నింటినీ అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు ఒక లేఖ రాశారు. శ్రీశైలం నుంచి 34 టీఎంసీల కన్నా ఎక్కువగా నీటిని తరలించడానికి వీల్లేదని, ఆ మేరకే బచావత్‌ ట్రైబ్యునల్‌ అనుమతి ఉందని గుర్తు చేశారు. 1976-77లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం చెన్నై తాగునీటి అవసరాల కోసం జూలై నుంచి అక్టోబరు మధ్య మాత్రమే 15 టీఎంసీల నీటిని తరలించడానికి అంగీకారం కుదిరిందని వివరించారు. 1981లో జరిగిన సాంకేతిక సలహా మండలి సమావేశంలో శ్రీశైలం కుడి కాలువకు 19 టీఎంసీల కేటాయింపులు చేశారని, రెండు కాలువలకు కలిపి 34 టీఎంసీలను మాత్రమే తరలించడానికి అనుమతి ఉందని ఆయన తెలిపారు.

ఈ ప్రాజెక్టుల నీటి కోసమే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి 11,150 క్యూసెక్కులు, ఎస్‌ఆర్‌బీసీకి 4960 క్యూసెక్కులు, చెన్నై తాగునీటి కోసం 6150 క్యూసెక్కులు తరలించేలా కాలువలు నిర్మించారని ఆయన తెలిపారు. అయితే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11500 క్యూసెక్కుల నుంచి 20 వేల క్కూసెక్కులకు, ఎస్‌ఆర్‌బీసీని రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని కూడా 11,150 క్యూసెక్కులకు పెంచారని కూడా మురళీధర రావు ఆక్షేపించారు. 1981లో బనకచర్ల వద్ద ఒక్క క్రాస్‌ రెగ్యులేటర్‌కు కేంద్ర జల సంఘం అనుమతినివ్వగా.. అనంతర కాలంలో అనుమతి లేకుండానే ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ను నిర్మించారని ఆయన ఫిర్యాదు చేశారు. కృష్ణా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ జారీ చేసిన గెజిట్‌-2లో అనుమతి ఉన్న ప్రాజెక్టుల జాబితాలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, శ్రీశైలం కుడి కాలువ, ఎస్కేప్‌ రెగ్యులేటర్‌, తెలుగుగంగ ప్రాజెక్టు రెగ్యులేటర్‌లు ఉన్నాయని,వీటిని వెంటనే అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చి, గెజిట్‌ను సవరించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.