సృజన తో ఢీకొట్టిన వైసిపి కార్పొరేటర్లు

జీవీఎంసీ కమిషనర్ సృజన ట్వీట్ కలకలం-వైసీపీ నేతలతో వార్ నేపథ్యం-ఏం జరుగుతోంది ?

ఏపీలో మూడు రాజధానులు తెరపైకి వచ్చాక విశాఖకు పెరిగిన ప్రాధాన్యత ఇప్పుడు అక్కడ వైసీపీ నేతలకు వరంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అక్కడి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో అదికారుల్ని కానీ, వారి నిర్ణయాల్ని కానీ లెక్క చేసే పరిస్ధితులు కనిపించడం లేదు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ నేతలకూ, జీవీఎంసీ కమిషనర్ సృజనకూ మధ్య వార్ మొదలైంది. తమ ఆధిపత్యం సాగనివ్వడం లేదనే అక్కసుతో ఆమెపై ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ ఛార్జ్ విజయసాయిరెడ్డికి వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని ఇచ్చింది. అంటే మూడు రాజధానుల్లో అసలు రాజధాని విశాఖే అన్నమాట. దీంతో సహజంగానే రాజధాని రాకముందే అక్కడ పాగా వేయాలని నిర్ణయించుకున్న అధికార వైసీపీ నేతలు తమ మాట చెల్లుబాటు కావాలని కోరుకుంటున్నారు. కానీ వేగంగా అభివృద్ధి చెందుతూున్న నగరం కావడం, అక్రమాలకు ఊతమిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న భావనతో జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు వీరికి బ్రేకులు వేస్తూ వస్తోంది. అయినా వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఏకంగా అధికారులతో నేరుగా వార్ కే దిగుతున్నారు.
విశాఖలో తాజాగా కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. వీటిలో వైసీపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుని విజేతగా నిలిచింది. దీంతో తాజాగా ఎన్నికైన కార్పోరేటర్లు కొందరు వార్డు సచివాలయాలను అడ్డాగా చేసుకుని సిబ్బందికి ఆదేశాలివ్వడంతోపాటు గంటల పాటు సమీక్షలు నిర్వహించడం చర్చగా మారుతోంది. వైసీపీ ప్రజాప్రతినిధుల తీరు చూసిన విపక్ష కార్పోరేటర్లు కూడా అదే బాట పడుతున్నారు. 22 వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వార్డు సమీక్ష నిర్వహించారు. దీనికి హాజరయ్యారని వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని కమిషనర్ సస్పెండ్ చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ పీతల మూర్తి ఒక రోజున కమిషనర్ కారుకు అడ్డంగా నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు దీనిపై చర్య తీసుకోలేమని చేతులెత్తేశారు. వైసీపీ మహిళా కార్పొరేటర్ల తరఫున వారి భర్తలే వార్డు సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నప్పుడు సిబ్బందిపై ఎందుకు చర్య తీసుకోలేదని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి కమిషనర్ ను ప్రశ్నించారు. దాంతో ఆ సిబ్బందిపై కూడా కమిషనర్ చర్యలు తీసుకున్నారు.

 

ఈ వ్యవహారంపై కమిషనర్ సృజన దృష్టిసారించారు. నేరుగా ప్రభుత్వ పెద్దలకే ఫిర్యాదు చేశారు. దీంతో వారి నుంచి అందిన సూచనల ఆధారంగా సృజన కీలక చర్యలు చేపడుతున్నారు కార్పొరేటర్లు నేరుగా సమీక్షలు చేస్తే హాజరుకావొద్దని.. అలాంటి వారిపై చర్యలు ఉంటాయని సిబ్బందికి కమిషనర్ హెచ్చరించారు. దీంతో కమిషనర్ తీరుపై వైసీపి కార్పొరేటర్లంతా గుర్రుగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో కమిషనర్ ను మార్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో కమిషనర్ సృజన ఒక ట్వీట్ చేసి తనకు బలం చేకూర్చారని , ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడంతా ఆ ట్వీట్ పైనే చర్చ.

Leave A Reply

Your email address will not be published.