కొత్త ఆర్ధిక సలహాదారు రజనీష్ కుమార్

వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచీ నవరత్నాల పేరిట రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టివేశాయి. సంక్షేమం పధకాలపై స్వారీ చేయడమంటేనే పులి మీద స్వారీ చేసినట్టే. ఏఒక్క పధకం లబ్దిదారులకు సాయం తగ్గినా ఫలితాలు మరోలా వుంటాయి.

సంక్షేమంతోనే ఆర్ధిక సంక్షోభం

అభివృద్ధిని పక్కన పెట్టి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వ్యయం చేస్తోందని కొన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. నవరత్నాలను అమలు చేయడానికి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకొచ్చి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టస్తోందనే విమర్శలు, ఆరోపణలు తరచూ తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వ్యక్తమౌతూనే ఉన్నాయి. అదే సమయంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైందని, వైసీపీ నేతల తీరు వల్ల ఉన్న పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్తోన్నాయనే ఆరోపణలు తరచూ వినిపిస్తోన్నవే. ఇందుకు అనేక ఉదాహరణలు వున్నాయి.

ఎస్బీఐ మాజీ ఛైర్మన్‌కు కీలక పదవి..

ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ రజినీష్ కుమార్‌ను సలహదారుగా నియమించారు. ఆర్థిక వ్యవహారాలను ఆయనకు అప్పగించారు. బుగ్గన రాజేంద్రనాథ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహదారుగా రజినీష్ కుమార్‌ను నియమించారు. రజినీష్ కుమార్ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు ఆయన రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా కొనసాగుతారు. ఆ తరువాత ఆయన హోదాను పొడిగించడమా? లేదా? అనేది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాగా- ఏపీ ప్రభుత్వం తనను ఆర్థిక వ్యవహారాల సలహదారుగా నియమించిన విషయాన్ని రజినీష్ కుమార్ ధృవీకరించారు. ఆర్థిక నిపుణుడిని సలహాదారుగా నియమించాలనే కారణంతో ఏపీ ప్రభుత్వం తనను సంప్రదించిందని చెప్పారు. ఆర్థిక సలహదారుగా నియమిస్తామని చెప్పగా.. తాను అంగీకరించినట్లు తెలిపారు.

కార్పొరేట్ సెక్టార్‌లో రజనీష్ కుమార్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం రజినీష్ కుమార్ కొన్ని ప్రైవేటు కార్పొరేట్ బ్యాంకులకు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కోటక్ మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన కోటక్ స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్‌కు ఎక్స్‌క్లూజివ్ అడ్వైజర్‌గా, హెఎస్‌బీసీ ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు. అదే సమయంలో జగన్ సర్కార్ కూడా ఆయనను ఆర్థిక సలహాదారుగా నియమించుకుంది. గత ఏడాది అక్టోబర్ లో రిటైర్ అయిన రజనీష్ కుమార్ కొటక్ గ్రూప్ లో చేరారు.

పెట్టుబడుల ఆకర్షణ ఇకపై ఆయన చేతుల్లో..

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేలా చేయడం, దీనికి సంబంధించిన సంప్రదింపులను కార్పొరేట్ కంపెనీలతో కొనసాగించడం వంటి కార్యకలాపాలను ఇకపై రజినీష్ కుమార్ పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. అదే సమయంలో- రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న రుణాలను ఎలాంటి కార్యక్రమాలు, పథకాలకు బదలాయించాలనే విషయంపైనా ఆయన సలహాలు ఇచ్చే అవకాశం లేదు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నందున.. వాటిని అలాగే కొనసాగిస్తూ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపైనా రజినీష్ కుమార్ దృష్టి సారిస్తారని తెలుస్తోంది.

రాబడి పెంచడానికీ సలహాలు ఇస్తారేమో…

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన ఆంక్షల వల్ల అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రోజువారీ ఆదాయం తగ్గిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో దాన్ని మరింత పెంచడానికి అవసరమైన చర్యలను తీసుకోవడంపైనా రజినీష్ కుమార్ ప్రభుత్వానికి సలహాలను ఇస్తారని చెబుతున్నారు. అనుత్పాదక రంగాలకు నిధులను మళ్లించడం, దుర్వినియోగాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖకు కొన్ని సూచనలు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కాగా- రజినీష్ కుమార్ నియామకం విషయంలో రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని ప్రమేయం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.