సజ్జలపై గురి పెట్టిన రఘు రామరాజు

 

ఇప్పటివరకు జగన్ , విజయసాయి రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని న్యాయపోరాటం చేస్తున్న ఎంపీ రఘురామ రాజు ప్రభుత్వ సలహాదారు , పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసి న్యాయ పోరాటం ప్రారంభించారు.

జోడు పదవుల్లో ఉంటున్న సజ్జల ను నిలువరిస్తూ..ఆయన పైన చర్యలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో తాజాగా పిల్ దాఖలు చేసారు. సజ్జల ప్రభుత్వ సలహాదారుడుగా వ్యవహరిస్తూ ఆయన ప్రభుత్వం నుంచి నెలకు రూ 2.50 లక్షల జీతం తీసుకుంటున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు.

సజ్జల ప్రభుత్వ వేతనం తీసుకుంటూ..

దీనికి అదనంగా మరిన్ని బాధ్యతల పేరుతో మరో రూ 2.5 లక్షలు డ్రా చేస్తున్నారని అందులో వివరించారు. అయితే, ప్రభుత్వ ఆయన్ను ప్రజా సంబంధాల సలహాదారుడిగా నియమిస్తూ అందులో పలు నిబంధనలు పేర్కొన్ని విషయాన్ని రఘురామ ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి జీతం పొందుతున్న వారికి ఏపీ సీవిల్ సర్వీసెస్ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి నిర్ధిష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలని, సివిల్ సర్వెంట్ల తరహాలో సలహాదారులు సైతం నిజాయితీగా, నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తన పిటీషన్ లో రఘు కోర్టుకు వివరించారు.

ప్రభుత్వ వేతనం..పార్టీకి సేవలు

సజ్జల వైసీపీ పార్టీ కి చెందిన వారని, ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. .మూడు జిల్లాలకు ఇన్ ఛార్జ్ గా పని చేస్తున్నారని రఘురామ పిటీషన్ లో పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయం నుంచి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ తరపున రాజకీయ పాత్ర పోషిస్తున్నారంటూ పిటీషన్ లో వివరించారు. సలహాదారుడిగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ పిటీషన్లో అనేక విషయాలను పొందు పరిచారు.

సజ్జల నియామక ఉద్దేశాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని, వైసీసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాంటూ సుదీర్ఘంగా వివరించారు.

సజ్జలకు సివిల్ సర్వీసు రూల్స్ వర్తిస్తాయంటూ..

సలహాదారులకు ప్రత్యేక నియమావళి లేదని చెబుతూ, వారికి సివిల్ సర్వీసెస్ రూల్స్ వర్తిస్తాయని తన పిటీషన్ లో రఘురామ స్పష్టం చేసారు. వీటిని పరిగణలోకి తీసుకొని సజ్జల పైన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని రఘురామ రాజు తన పిటీషన్ లో హైకోర్టును కోరారు. ఇక, ఇప్పటికే సీఎం జగన్..ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ల పైన సీబీఐ కోర్టులో విచారణ పూర్తయింది. రెండు పిటీషన్లలో ఒకే విధమైన అంశాలు ఉండటంతో వీటి పైన ఒకే సారి ఈ నెల 15న తీర్పు ఇస్తామని సిబిఐ కోర్టు వెల్లడించింది.

రఘురామ విమర్శలు..వైసీపీ లైట్ తీసుకుంటుందా

ఈ తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠకొనసాగుతున్న  సమయంలో ఇప్పుడు రఘురామ ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సజ్జల పైన హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. రాజకీయంగా సజ్జల పైన రఘురామ పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసారు. రఘురామ విమర్శల పైన అప్పట్లో సజ్జల తీవ్రంగా స్పందించారు.  ఇప్పుడు రఘురామ వ్యాఖ్యలు..విమర్శల పైన వైసీపీ నేతలు పెద్దగా స్పందించటం లేదు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తర్వాత సుప్రీం కోర్టు నుంచి బెయిల్ పొందిన రఘు పూర్తిగా ఢిల్లీకే పరిమితం అయి అక్కడి నుంచే ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల పైన టార్గెట్ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

 

15న సీబీఐ కోర్టు తీర్పు పై ఉత్కంఠ ..

ఇప్పుడు కోర్టుల్లో కేసుల ద్వారా రఘురామ వైసీపీ ముఖ్యులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నెల 15న సీబీఐ కోర్టు జగన్ – సాయిరెడ్డి బెయిల్ రద్దు కేసులో తీర్పు ఇచ్చిన తరువాత ఈ పరిణామాలు కొత్త మలుపు తీసుకొనే అవకాశం ఉంది. అయితే తాము స్పీకర్ కు ఇచ్చిన రఘురామ అనర్హత పిటీషన్ పై త్వరలోనే చర్యలు ఉంటాయని వైసిపి నేతలు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాకపోవచ్చునని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.