ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కల్యాణ్ పోరాటాన్ని అందరూ చూస్తారు: నాదెండ్ల మనోహర్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న‌ నిర్ణయంపై జనసేన నేత‌ నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించ‌కూడ‌ద‌ని ప్ర‌తిప‌క్షాలు, కార్మికులు పోరాడుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విశాఖ‌ స్టీల్ ప్లాంట్‌ విషయంలో బీజేపీతో పవన్ కల్యాణ్ మాట్లాడి ఒప్పిస్తారని నాదెండ్ల మ‌నోహ‌న్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కల్యాణ్ పోరాటాన్ని అందరూ చూస్తారని ఆయ‌న తెలిపారు.

పవన్ కల్యాణ్ వచ్చే నెలలో విశాఖలో పర్యటిస్తారని, స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపుతారని నాదెండ్ల చెప్పారు. తాము కూడా ఈ విష‌యంపై ఇన్ని రోజులుగా ఓపిక ప‌ట్టి పరిస్థితుల‌ను గ‌మ‌నించామ‌ని ఆయ‌న అన్నారు. ఇప్పుడు తమ గ‌ళం వినిపిస్తున్నామని చెప్పారు. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ చర్చించారని అన్నారు.

అంతేగానీ, పవన్ కల్యాణ్‌పై ఎలాంటి కేసులు లేవని, ఆయ‌న‌ రాజీల కోసం అమిత్ షాను కలవలేదని నాదెండ్ల స్పష్టం చేశారు. ఏపీ సమస్యలపై తాము బలంగా మాట్లాడుతున్నామ‌ని చెప్పారు. ఏపీలో జగన్ అధికారంలోకి వ‌చ్చిన తరువాత అనేక‌ సమస్యలు వ‌చ్చాయ‌ని ఆయ‌న అన్నారు. అమరావతి రైతుల ఉద్యమం పట్ల కూడా జనసేన వైఖరి స్థిరంగా ఉందని ఆయ‌న చెప్పారు. జ‌న‌సేన త‌ప్ప‌ ఇతర పార్టీలు వైసీపీపై పోరాటానికి భయపడుతున్నాయని ఆయ‌న అన్నారు.
Tags: Pawan Kalyan,Janasena,Nadendla Manohar

Leave A Reply

Your email address will not be published.