సినిమా వేదికగా పవన్ ‘పొలిటికల్ ‘అటాక్

అమరావతి: ఏపీలో ధియేటర్లు, సినిమా టికెట్ల విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ మజిలీలో రెండో పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. తన పోరాటం విధానాలపైనే తప్ప వ్యక్తిగత విషయాలను బట్టి కాదని పవన్ చాలా స్పష్టంగా చెప్పారు .

ఆన్‌లైన్ ద్వారా టికెట్లను విక్రయించాలనే ఏపీ ప్రభుత్వ వివవాదాంశాన్ని పవన్ రాజ  కీయ అజెండాగా మార్చుకున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయువుపట్టును చక్కగా టార్గెట్ చేసుకున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రావడం, బెనిఫిట్ షోలను ప్రదర్శించే అవకాశం లేకుండా చేయడం ద్వారా సంబంధిత మూవీకి వచ్చే అదనపు ఆదాయాన్ని జగన్ సర్కార్ అడ్డుకున్నట్లుగా పవన్ భావిస్తున్నారు. లక్షల కోట్లున్న వ్యక్తి 2 వేల కోట్లు విలువున్న చిత్రపరిశ్రమ ను లక్ష్యంగా పెట్టుకుని , సినిమా టిక్కెట్ విక్రయ ఆదాయాన్ని అడ్డుపెట్టుకుని బ్యాంకులనుంచి అప్పులు తెచ్చుకోవడం కోసం ఈ పరిశ్రమను చంపేయాలని చూస్తున్నారని పవన్ ఆరోపించారు.

 

దీనిమీద పవన్ కల్యాణ్ ఇటీవలే `రిపబ్లిక్` మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఊహించని విధంగా ఘాటు విమర్శలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు చూపించి, అప్పులు తెచ్చుకోవాలనేది జగన్ సర్కార్ కుట్ర పన్నిందంటూ ఆరోపించారు. సినిమా టికెట్లపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ధ్వజమెత్తారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని కూడా ప్రస్తావించారు. కోడికత్తి అంశాన్నీ లేవనెత్తారు.

నవరత్నాలు, హామీలు లక్ష్యంగా…

రిపబ్లిక్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌ను పొలిటికల్ స్టేజీగా మార్చేశారనే విమర్శలను సైతం ఎదుర్కొన్నారు పవన్ కల్యాణ్. ఆ దాడిని ఆయన మరింత ఉధృతం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టుగా భావించే నవరత్నాలను టార్గెట్ చేసుకున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు, వాగ్దానాలను తాజాగా తన దాడికి ఉపయోగించుకున్నారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన చర్యల గురించి ఒక్కొక్క అంశాన్నీ వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

మద్య నిషేధం ఏమైంది?

తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామంటూ వైఎస్ జగన్ ఇచ్చిన హామీకి భిన్నంగా పరిపాలన సాగుతోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవడానికి ఉపయోగించుకుంటోందని అన్నారు. కరెంట్ ఛార్జీలను తగ్గిస్తామని భరోసా ఇచ్చిన జగన్ సర్కార్.. ఇప్పుడు ట్రూ అప్ ద్వారా అదనపు భారాన్ని మోపిందని ఆరోపించారు.

ఉద్యోగాల గురించి..

ప్రతి సంవత్సరం 6,500 పోలీసు ఉద్యోగాలను నోటిఫై చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ.. ఇప్పటిదాకా 450 ఖాళీలను మాత్రమే గుర్తించిందని అన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులను కూడా నోటిఫై చేస్తామని చెప్పి వాటిని 36కు పరిమితం చేసిందని అన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వాగ్దానం చేసినా అది నెరవేరలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇసుక ధరలను తగ్గిస్తామని, అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటామని మొదట్లో భరోసా ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేట్ సంస్థకు దాని హక్కులను బదలాయించిందని ఆరోపించారు.

63 శాతం పెరిగిన నేరాల రేటు

వైసీపీ హయాంలో రాష్ట్రంలో 63 శాతం నేరాల రేటు పెరిగిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నిలిపివేసిందని, పింఛన్లను తొలగించిందని ధ్వజమెత్తారు. ఇంటి పట్టాలను ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు. నివార్ తుఫాన్ రైతులకు ఇప్పటికీ నష్ట పరిహారాన్ని అందించలేదని, రైతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. బీసీ సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ.. విభజించు, నియమించు అనే ప్రాతిపదికన 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. దళితులకు నామమాత్రపు పదవులను ఇచ్చిందని, వారిపై నేరాలు అధికం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నవరత్నాలు.. నవ కష్టాలు

జగన్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని భావిస్తోన్న నవరత్నాలతో.. ప్రజలకు నవకష్టాలు తప్పవని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, ఇప్పటిదాకా నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర రుణాలను ప్రభుత్వం తీసుకుందని ధ్వజమెత్తారు. దిశా నిర్దేశం లేని పరిపాలన సాగించడం వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకునిపోయే ప్రమాదం నెలకొని ఉందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సంక్షేమ కార్పొరేషన్లకు సంబంధించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, దాని ఊసే ఎత్తట్లేదని పవన్ అన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.