న్యాయమూర్తుల నియామకంలో జాప్యం?

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసిన 68 మంది జ్యుడీషియల్‌ అధికారులు, న్యాయవాదులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో సుప్రీం కోర్టు కు తొమ్మిది మంది న్యాయ మూ‌ర్తుల నియామకాలు జెట్ స్పీడుతో ఆమోదించింది. ఇప్పుడు మాత్రం 68 మందికి సంబంధించి ఫైలుకు మోక్షం లభించలేదు.

ఈ ఏడాది ఆగస్టు 8 నుంచి సెప్టెంబరు 1 మధ్య దేశంలోని వివిధ హైకోర్టులు ప్రతిపాదించిన 100మందికిపైగా పేర్లను పరిశీలించిన సుప్రీంకోర్టు కొలీజియం.. అందులో 68మందిని 12హైకోర్టుల్లో జడ్జిలుగా నియమించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అత్యున్నత వర్గాలు వెల్లడించాయి. ఈ 68 మందిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు, జమ్మూకశ్మీర్‌కు చెందిన ఒకరి పేర్ల ను మూడోసారి పంపించారు. మరో 10 మందిని రెండోసారి సిఫారసు చేశారు. మిగిలిన వారి పేర్లను తొలిసారి ప్రతిపాదించారు. కాగా, వివిధ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి పొందేందుకు సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం 8 మంది పేర్లను సిఫారసు చేసిందని, అందులో కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌ కూడా ఉన్నారని సమాచారం.

Leave A Reply

Your email address will not be published.