తెలుగురాష్ట్రాలకు కొత్త సిజెల నియామకం

తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో ఛీఫ్ జస్టిస్ లను మారుస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కొహ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో ఆమె స్ధానంలో కర్నాటక హైకోర్టు యాక్టింగ్ సీజేగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ను తెలంగాణ సీజేగా కొలీజియం సిఫార్సు చేసింది. ఇక ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఛత్తీస్ ఘడ్ హైకోర్టుకు మార్చారు. ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా ఇంతవరకూ సేవలందించిన ప్రశాంత్ కుమార్ మిశ్రా  ఆంధ్రప్రదేశ్ సీజేగా వచ్చారు. దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు క్రిమినల్ కేసుల వేగవంతానికి ప్రయత్నిస్తున్న సుప్రీంకోర్టు ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. కొలీజియం సిఫారసు మేరకు ఈ బదిలీలు షురూ అయ్యాయి.

వాస్తవానికి ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరిని గతేడాది సిక్కిం హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.. ఆయన స్ధానంలో జస్టిస్ అరూప్ గోస్వామిని నియమించింది. అయితే ఏపీకి కీలకమైన మూడు రాజధానుల కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ నియామకం అప్పట్లోనే సంచలనం రేపింది. ఆ తర్వాత జస్టిస్ అరూప్ గోస్వామి ఈ ఏడాది ఆరంభంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా మూడు రాజధానుల కేసు విచారణ ప్రారంభించారు. రెగ్యులర్ విచారణ జరిపే లోపే ఆయన కూడా ఇప్పుడు బదిలీ అయ్యి ఛత్తీగ్ ఘడ్ వెళ్లబోతున్నారు. దీంతో మూడు రాజధానుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. మూడు రాజధానులపై జస్టిస్ అరూప్ గోస్వామి ధర్మాసనం నవంబర్ 15న రెగ్యులర్ విచారణ చేపట్టాలని భావించినా ఈ బదిలీ కారణంగా సాధ్యం కావడం లేదు.
కాగా, గత నెల ఆగష్టు 31న సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడం చరిత్రలో అదే తొలిసారి. అంతేకాదు, జడ్జీల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా సీజేఐ నిర్ణయించడంతో ఇది మరో చరిత్రగా నిలిచింది.

ఇక, సుప్రీం కోర్టు జడ్జిలుగా జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నం, జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సుందరేష్, జస్టిస్‌ ఏఎస్‌ ఒకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.

Leave A Reply

Your email address will not be published.