దసరానాటికి నరేగ బకాయిలు చెల్లించాలి

అమరావతి: దసరా నాటికి బకాయిలున్నా నరేగా నిధులు చెల్లించి తీరాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. నిధులు చెల్లించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.

పిటిషనర్ల తరపున మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాల పాటి శ్రీనివాస్‌, వీరారెడ్డి, నర్రా శ్రీనివాస్‌ వాదించారు. కేంద్రం అక్టోబర్‌ 31లోపు బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్‌ ఫైల్‌ చేసిందని, ఇప్పటికే రూ.1,100 కోట్లు చెల్లించామని కేంద్రం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాదనపై పిటిషనర్‌ తరపు న్యాయవాదుల అభ్యంతరం తెలిపారు. సోషల్‌ ఆడిట్‌ జరిగాకా మళ్లీ విచారణ పేరిట కొర్రీలు వేస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. సర్పంచ్‌ అకౌంట్లలోకి నిధులు వెళ్తే ఇవ్వడంలేదని న్యాయవాదులు పేర్కొన్నారు. వారంరోజుల్లో కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించాలని సర్పంచ్‌లకు ఆదేశాలిచ్చామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

హైకోర్టుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు

ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. ఐఏఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, గిరిజా శంకర్, గోపాలకృష్ణ ద్వివేది విచారణకు హాజరయ్యారు.

60 శాతం పనులకు డబ్బులు చెల్లించామని.. 40 శాతం పనులకు చెల్లించాల్సి ఉందని న్యాయస్థానానికి అధికారులు వివరించారు. రూ.400 కోట్ల మేర బిల్లుల ప్రతిపాదనలు సెప్టెంబర్ 18న రాష్ట్ర ప్రభుత్వం పంపిందని.. వాటిని పరిశీలించి ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

కొన్ని చోట్ల నగదు వచ్చినా పంచాయతీ సర్పంచ్‌లు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏడు రోజుల్లోగా బిల్లులు చెల్లించాలని పంచాయతీలకు ఆదేశాలిచ్చామని.. బిల్లులను చెల్లించకపోతే చర్యలు తీసుకుంటాని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.

 

Leave A Reply

Your email address will not be published.