తాడేపల్లికి చేరిన భరత్ , జక్కంపూడి వివాదం

రాజమండ్రి: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య చోటు చేసుకొన్న విబేధాలను సర్దుబాటు చేసేందుకు వైసీపీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ మేరకు ఈనెల28న మార్గాని భరత్, జక్కంపూడి రాజాలను తాడేపల్లికి రావాలని ఆ పార్టీ నాయకత్వం ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా ఇన్ ఛార్జి వై.వీ.సుబ్బారెడ్డి వీరిద్దరితో మాట్లాడుతారు. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వీరి పంచాయతీ తీసుకువెళతారు.

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. రాజానగరం అసెంబ్లీ నియోజకపరిధిలో జగనన్న ఇళ్ళ స్ధలాల కోసం భూసేకరణ కోసం ఆవ భూములను ఎంపిక చేసి రైతులకు తక్కువ పరిహారం ఇచ్చినప్పటి నుంచీ ఇరువురు మధ్యా విభేదాలు తలెత్తాయి.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సెల్ఫీ దిగడాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీకి నష్టం చేసేలా మార్గాని భరత్ వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా అదే స్థాయిలో కౌంటరిచ్చారు. పార్టీకి నష్టం చేసే విధంగా తాను ఏనాడూ వ్యవహరించలేదని ప్రకటించారు. పార్టీకి నష్టం చేసేలా ఎవరు వ్యవహరిస్తున్నారో తనకు తెలుసునన్నారు. కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది.ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకొందని వైసీపీ నాయకత్వం గుర్తించింది. వీరిద్దరితో చర్చించేందుకు వైసీపీ తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి మార్గాని భరత్, జక్కంపూడి రాజాలకు తాడేపల్లి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీన ఇద్దరు నేతలు తాడేపల్లికి వెళ్లే అవకాశం ఉంది.

 

Leave A Reply

Your email address will not be published.