ఓవైపు విశృంఖల అవినీతి: మరో వైపు నిస్సహాయత

నెల్లూరు జిల్లాలో  ఉన్న 10 స్ధానాల్లో వైసీపీ 2019 ఎన్నికల్లో విజయం సాధించింది. ఇద్దరు మంత్రులు ఉన్నారు. నెల్లూరు అర్బన్ నియోజకవర్గంలో గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్నారు. ఆ జిల్లా నుంచి గతంలో పెద్దా రెడ్లుగా పేరు పొందిన బెజవాడ గోపాలరెడ్డి‌ , బెజవాడ పాపిరెడ్డి , రేబాల దశరధ రామిరెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి , ఆనంవెంకటరెడ్డి , నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి  నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి  వెంకయ్యనాయుడు , ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటి  ఉద్దండులు  ప్రాతినిథ్యం వహించారు. ఇందులో ఏసిసుబ్బారెడ్డి , ఆనం వెంకటరెడ్డి , నల్లపురెడ్డి  నీటిపారుదల శాఖ మంత్రులు గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేరు తెచ్చుకున్నారు. ప్రతిష్టాత్మకమన సోమశిల , కండలేరు , పెన్నా , సంగం ప్రాజెక్టులు నిర్మించారు. నెల్లూరు జిల్లా ప్రజల తాగు , సాగునీటి అవసరాల తర్వాతే తమిళనాడుకు  నీరు ఇవ్వాలని 11 రోజులు నిరాహారదీక్ష చేసిన చరిత్ర ఆనం రామనారాయణరెడ్డి కే ఉంది. అలాంటి జిల్లాలో ఇప్పుడు ఎమ్మెల్యేలు కొందరు ధనార్జనలో పడ్డారు.

సిలికా శాండ్‌ , ఇసుక‌ , గ్రావెల్ తవ్వకాలు, అక్రమ మద్యం  ,క్రికెట్ బెట్టింగ్, రియల్ ఎస్టేట్, ప్రభుత్వ భూముల ఆక్రమణ  ,భూసేకరణలో దళితులకు అన్యాయం, కమిషన్లు ,

ఒకటేమిటి అన్ని అసాంఘీక కార్యకలాపాలు చేస్తున్నారు. ఒకరో ఇద్దరో ఇందుకు మినహాయింపు లో ఉన్నారు.

గత నాలుగునెలలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి సోమశిల మరమ్మతులు గురించే గళమెత్తినా సాగునీటి శాఖా మంత్రి స్పందించలేదు. పంటభూముల్లో తవ్వకాలపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ నెత్తీనోరు మొత్తుకున్నా ఫలితం లేదు. భూమి రికార్డులను మార్చేస్తున్నారని ఎమ్మార్వో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు .భూముల కబ్జాదారుల గురించి జిల్లా కలెక్టరేట్ గేట్లకు ఫ్లెక్సీలను కట్టినా స్పందనలేదు.  ఇక అధికారపార్టీ అలసత్వాన్ని పక్కన పెట్టి అధికార యంత్రాంగం గురించి ఆలోచిస్తే దగదర్తి ఎయిర్ పోర్టు భూముల సేకరణలో గానీ , జగనన్న ఇళ్ళ పధకం కోసం జరిగిన భూసేకరణలో, అమాయకులైన భూయజమానులను బురిడీ కొట్టించి లక్షలు చేతుల్లో పెట్టి కోట్లు కొల్లగొట్టేశారు అధికారపార్టీ నాయకులు. ఇందుకు సహకరించని కలెక్టర్ ను సాగనంపారు.

నెల్లూరు జిల్లాలో పనిచేసే అధికారులు డబ్బు సంచులతోనే చిత్తగిస్తారన్న నానుడి వుంది. అ జిల్లా లో డబ్బు సంపాదించని కలెక్టర్లు, ఇతర శాఖల ఉన్నతాధికారుల సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఈ జిల్లా రాజకీయ నాయకులు గతంలో ఎక్కువగా మర్యాద , గౌరవం కోరుకునేవారు. అది దక్కితే చాలు అన్న చందాన వుండేవారు. ఆతిథ్యం సరేసరి. రాజకీయ నాయకులకు గౌరవం ఇచ్చి అధికారులు డబ్బులు సంపాదించి ఉడాయించేవారు. పేర్ల ప్రస్తావన పక్కన పెడితే నెల్లూరు- చెన్నై హైవే , ఇరిగేషన్ పనులు ఇక్కడి ఉన్నతాధికారులకు అక్షయపాత్రలు. ఈ జిల్లాలో డబ్బు సంపాదించక పోతే ఆ అధికారి సంపాదనలో అసమర్ధుడు కిందేలెక్క. ఒక ముఖ్య విభాగంలో పనిచేస్తున్న మహిళా అధికారి పొరుగు జిల్లాకు చెందిన ఆమె. ఆమె సొంత జిల్లాలో పెద్దగా ఆస్తులు లేవు. నెల్లూరు జిల్లా కు వచ్చి ఎన్ ఫోర్స్ మెంట్ లో ఉంటూ ఈఏడాది లోపులోనే కోటిన్నర వ్యయంతో సొంత ఇంటికి యజమాని అయ్యింది. హైవే ఇసుక లారీలు , చెన్నైలో సెటిల్మెంట్లు బాగా లాభించాయని పెన్నా ప్రవాహం సాక్షిగా చెబుతున్నారు. ఈ జిల్లా మంత్రులకు ,కొంత మంది శాసన సభ్యులకు ఈ విషయం తెలుసునని చెబుతున్నారు. బలహీన వర్గాలకు చెందిన వీరిలాంటి అధికారులు ఆర్ధికంగా బలపడుతున్న వైనం ఇది.

ఇక శాసన సభ్యుల విషయానికి వస్తే కోవూరు శాసన సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతారు. ఈయన తండ్రి నల్లపు రెడ్డి శ్రీనివాసుల రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి. ప్రసన్న తరచూ జిల్లా యంత్రాంగం మీద , మండల స్ధాయి అధికారులు పైనా విరుచుకుపడ్తూ వుంటారు. రాబోయే కాలంలో కాబోయే మంత్రిగా పేరు ప్రచారంలో ఉండేటట్లు చూసుకుంటూ వుంటారు.

 

ఇక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే ఈయన నేనూ-నా కార్యకర్త అంటూ ఒక కార్యక్రమం పెట్టుకుని జనం వద్దకు వెళతారు. రెండోసారి శాసన సభ్యుడు అయినా నియోజకవర్గంలో పట్టు అంతా తమ్ముడు గిరిధర్ రెడ్డి కే అప్పగించారు.  నగరంలో కొన్ని చోట్ల ఎమ్మెల్యే తమ్ముడు పేరుతోనే కార్యకర్తలు, నాయకులు ఫ్లెక్సీలను పెడుతూవుంటారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనిచేసే అధికారులు ఎమ్మెల్యే తమ్ముడి నే అధికారికంగా కలుస్తూ వుంటారు. ఈవిషయాన్ని ఒక జిల్లా స్ధాయి అధికారి ధృవీకరించారు కూడా. ఎమ్మెల్యే పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. ప్రభుత్వం పై వున్న వ్యతిరేకత ప్రభావం కొంత మేరకు ఎమ్మెల్యేలపై కనిపిస్తోంది.

నెల్లూరు నగరంలో కొన్ని డివిజన్లు , మాగంటి లే అవుట్ ( నెల్లూరు లో ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతం) హరనాథ్ పురం వంటి కాస్ట్లీ ప్రాంతాలు రూరల్ నియోజకవర్గంలో ఉంటాయి. శ్రీధర్ రెడ్డి అప్పుడప్పుడు నిజాలు నిర్మొహమాటంగా మాట్లాడుతూ వుంటారన్న పేరు ప్రజల్లో వుంది.

 ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌లో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు త‌ప్ప , అభివృద్ధి లేద‌నే ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు బ‌లం చేకూర్చేలా కోటంరెడ్డి ఇటీవల అన్న మాట‌లు నెల్లూరులో ఇప్పుడు చర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

నెల్లూరు న‌గ‌రంలోని 18వ డివిజ‌న్ హ‌ర‌నాథ‌పురం ఎక్స్‌టెన్ష‌న్ ప్రాంతంలో డ్రైనేజీ నిర్మాణం, అలాగే స‌మీపంలోని మినీ బైపాస్‌కు అనుసంధానంగా రోడ్డు వేయించాల‌ని ఆ ప్రాంత ప్ర‌జ‌లు కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిని కోరారు. ఈ ప‌నులు చేయ‌డానికి త‌న నిస్స‌హాయ‌త‌ను వ్య‌క్తం చేయ‌డానికి కోటంరెడ్డి ఏ మాత్రం వెనుకంజ వేయ‌లేదట. కార్పొరేష‌న్‌లో ఒక్క రూపాయి లేద‌ని, దీంతో తానేమీ చేయ‌లేనని ప్ర‌జ‌ల‌కు తేల్చి  ఆయన చెప్పారట. అంతేకాదు, అర్థం చేసుకోవాల‌ని ప్రజలను ఆయన వేడుకోవ‌డం గ‌మ‌నార్హం అంటున్నారు.

“మీరంద‌రూ చ‌దువుకున్న వాళ్లు. మీకు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హామీలిచ్చి అదిగో ఇదిగో అంటూ మాట త‌ప్ప లేను. ప‌రిస్థితిని అర్థం చేసుకోండి. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు వ‌ల్ల అభివృద్ధి ప‌నుల‌కు నిధులు కేటాయించ‌లేని పరిస్థితి అని ‘ఆయన బ‌దులిచ్చారట. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు వ‌ల్ల అభివృద్ధి ప‌నుల‌కు నిధులు కేటాయించ‌లేని పరిస్థితి” అని కోటంరెడ్డి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారని కర్ణపిశాచి కధనమని చెబుతున్నారు. ఇదే ప‌రిస్థితి రాష్ట్ర‌మంతా నెల‌కుంది. మొన్న విశాఖపట్నం జిల్లా లో కన్నబాబు అనే ఎమ్మెల్యే కూడా రోడ్డు మరామ్మతులకు డబ్బులు ఇప్పించాలని కోరినప్పుడు సదరు ఎమ్మెల్యే కూడా నిస్సహాయత వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయ్యింది.

అలాగే జగనన్న ఇళ్ళులో గదులు సోభనం చేసుకోవడానికి పనికి రావని కూడా అధికారుల సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. మిగతా ఎమ్మెల్యేలు ప్రజలతో ఉన్నా , కోటంరెడ్డిలా ప్ర‌జ‌ల మొహం మీద మిగిలిన ఎమ్మెల్యేలు చెప్ప‌లేని ప‌రిస్థితి. సొంత ప్ర‌భుత్వ విధానాల‌పై కోటంరెడ్డి ఒక ర‌క‌మైన నిర‌స‌న ప్ర‌క‌టించేందుకే… బ‌హిరంగంగా మాట్లాడార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

(మిగతా రెండో భాగం రేపు)

 

Leave A Reply

Your email address will not be published.