గుంటూరు జిల్లా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఘాటెక్కువే!

ప్రజలంతా సంతోషంగా ఉన్నారని , అసంతృప్తి అనేదే  జనంలో లేదని  అధికార పార్టీ ఘనంగా చెప్పుకుంటుంటే, పాపం అధికారపార్టీ ఎమ్మెల్యేలు మాత్రం లబోదిబో అంటున్నారట. ప్రజలంతా హ్యాపీగా ఉంటే ఎమ్మెల్యేలకు వచ్చిన సమస్య ఏమిటంటే ….

గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 2 సీట్లు మినహా అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు అయ్యారు. ఒకరు మంత్రి స్ధానం నుంచి రాజ్యసభకు వెళ్ళారు. ప్రస్తుతం హోంమంత్రి సుచరిత ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ పథకాలు మహాజోరుగా అమలు చేస్తోంది. లక్షలాది ఇళ్లస్థలాల పంపిణీ మొదలు.అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. ప్రజలంతా హ్యాపీ. ద్వితీయ శ్రేణీ నేతలూ హ్యాపీ. కానీ, ఎమ్మెల్యేలు మాత్రం టోటల్ అన్ హ్యాపీ. నిన్న మొన్నటి వరకు వాళ్లూ హ్యాపీస్‌ అనుకున్నారు. కానీ, వాళ్లు నోళ్లు విప్పితే కానీ, అసలు సమస్య  ఏంటో అర్థం కాలేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడ్డట్టు. ఒక్కో ఎమ్మెల్యే తను పడుతున్న సమస్యలను ఏకరువు పెడుతున్నారు.

గుంటూరు జిల్లా సమీక్ష సమావేశం (డిడిఆర్సీ)లో అధికారుల నిర్లక్ష్యం పై నిప్పులు చెరిగారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలని పట్టుదలతో పని చేస్తుంటే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఎమ్మెల్యేలకు సర్ది చెప్పలేక ఇన్చార్జి మంత్రి ఒక దశలో తీవ్ర అసహనానికి గురయ్యారు.

నీటి విడుదల అంశంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా కళకళలాడుతుంటే కాల్వల పై నాకాబంది పెట్టాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. గ్రామాలకు వెళ్తున్న శాసనసభ్యులను ప్రజలు పిచ్చోళ్లలా చూస్తున్నారని  బొల్ల బ్రహ్మనాయుడు. వాపోయారు.

మంగళగిరిలో అక్రమ రేషన్ మాఫియాపై సమావేశంలో నిప్పులు చెరిగారు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. తమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రేషన్ మాఫియా తరలిస్తున్న బియ్యం పట్టు పడుతుందని ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఇస్తున్న రూపాయి బియ్యాన్ని మాఫియా కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అక్రమ అమ్మకాలకు పాల్పడుతుందని ఆయన ఆవేదన చెందారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుండి డీలర్ వరకు అవినీతిమయం అయ్యారని ఆయన వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. ఎమ్మెల్యేగా తాను చెప్తున్నా సివిల్ సప్లై అధికారులు అంతులేని నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. మరోవైపు కృష్ణా వరదల వల్ల డెల్టా ప్రాంతంలో హార్టికల్చర్ పంటలకు జరిగిన నష్టానికి అధికారులు ఇప్పటికీ నష్టపరిహార లెక్కలు కట్టలేదని వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఏకంగా ఇంఛార్జి మంత్రి వద్దే ఎమ్మెల్యేలు చెప్పడం చర్చనీయాంశమైంది.

Leave A Reply

Your email address will not be published.