హోంశాఖ పరిధిలోనే మహిళా రక్షణ కార్యదర్శులు

మహిళా పోలీసులతో అంగన్‌వాడీ పనులా..?ఆ 15 వేల మందీ కానిస్టేబుళ్లే.!వారు పోలీసు పని మాత్రమే చేస్తారు

సీఎస్‌కు డీజీపీ సవాంగ్‌ ఘాటు లేఖ

కలెక్టర్‌ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకూపనులు చెబితే ఎలా?వాళ్లంతా ఇప్పుడు హోం పరిధిలోనే

‘ఆ 15 వేల మందీ.. మహిళా కానిస్టేబుళ్ల కిందే లెక్క.. ఈ విషయాన్ని జూన్‌ 23న ప్రభుత్వమే జీవో ద్వారా స్పష్టం చేసింది. అయినప్పటికీ వారితో అంగన్‌వాడీ, ఇతరత్రా పనులు ఎలా చేయిస్తారు..? జిల్లా కలెక్టర్‌ నుంచి ఎంపీడీవో, ఆఖరికి పంచాయతీ కార్యదర్శి కూడా వార్డు మహిళా పోలీసులపై పెత్తనం చేస్తే ఎలా’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు, గ్రామ/వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌కు ఘాటు లేఖ రాశారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి. అయితే ఇన్నాళ్లూ ‘దిశ’ చట్టం లేకున్నా 21 రోజుల్లో రేపిస్టులకు ఉరి అంటూ ప్రభుత్వం విపరీతమైన ప్రచారం చేస్తూ వచ్చింది. అదంతా ఉత్తిదేనంటూ ప్రతిపక్షాలు చేసిన ఆందోళనతో నాలుక్కరుచుకున్న హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌.. అసలా చట్టమే ఇంకా అమల్లోకి రాలేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దిశ యాప్‌ ద్వారా మహిళల్లో చైతన్యం తీసుకురావడం, దిశ పోలీసు స్టేషన్ల ద్వారా దర్యాప్తు వేగవంతం చేయడంలాంటి కార్యక్రమాలపై పోలీసు శాఖ మరింత గట్టిగా దృష్టి సారించింది. అయితే సీఎం జగన్‌ నివాసానికి సమీపంలో కృష్ణా నది ఇసుక తిన్నెలపై ఉన్న కాబోయే దంపతులను బెదిరించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన  సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో గ్రామ మహిళా రక్షణ కార్యదర్శులుగా నియమించిన 15 వేల మందిని మహిళా పోలీసులుగా పరిగణించాలని ఆదేశించారు. దీంతో జూన్‌ 23న ఈ ఆదే శాలు అమల్లోకి వచ్చాయి. ఈ 15 వేల మందికీ పోలీసు శాఖ విడతల వారీగా శిక్షణ ప్రారంభించి ఇటీవలే యూనిఫామ్‌ సైతం ఇచ్చింది. ఏ వార్డు పోలీసు ఆ వార్డు, గ్రామ పరిధిలో మహిళల రక్షణ బాధ్యతలు తీసుకోవాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి బాధితురాలితో ఫిర్యాదు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. ఏం చేస్తున్నారని ఒత్తిడి!: ఇంతవరకు బాగానేఉన్నా.. తమకు మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్‌వాడీ పనులు, చిన్న పిల్లల సంరక్షణ.. పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ సర్వేకి సంబంధించిన పనులు, ఎంపీడీవో మరో పని, ఆఖరికి కలెక్టర్లు సైతం పింఛన్ల కోత, సంక్షేమ పథకాల కుదింపు జాబితా పనులు చెబుతున్నారని సదరు మహిళా పోలీసులు వాపోతున్నారు. ఇదే సమయంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే మీ ప్రాంతంలో ఆకతాయిలు, భార్యను వేధించే భర్తలు, ఏకపక్ష ప్రేమికులు లాంటి సమాచారం ఇవ్వకుండా రోజూ ఏం చేస్తున్నారంటూ పోలీసు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నుంచి ఒత్తిడి వస్తోంది. మీరు పోలీసు శాఖ పనులే చేయాలని, యూనిఫామ్‌ ఇచ్చింది అందుకేనని అనడంతో 15 వేల మంది మహిళా సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో సీఎ్‌సకు డీజీపీ లేఖ రాయడం ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పోలీసు శాఖ సిబ్బందిపై ఇతర శాఖల పెత్తనం ఏంటని ఆయన సంధించిన ప్రశ్న కొత్త చర్చకు తెరలేపింది. జగన్‌ ప్రభుత్వం 2019 జూలైలో వారిని గ్రామ మహిళా రక్షణ కార్యదర్శులుగా నియమించిందని ఇతర శాఖలు చెబుతుంటే.. ఈ ఏడాది జూన్‌ 23న పోలీసు శాఖ పరిధిలోకి అదే ప్రభుత్వం తీసుకొచ్చిందని డీజీపీ గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని, వాటిని కాపాడేందుకే పోలీసు శాఖ ఆ 15 వేల మందితో పని చేయించుకోవడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇలాంటి సమయంలో వారికి ఇతరత్రా పనులతో పని భారం ఎక్కువైతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం ఎలాగని డీజీపీ ప్రశ్నించడం సీఎస్‌, గ్రామ సచివాలయాల శాఖకు మింగుడు పడడంలేదు. వారందరినీ తాము లేడీ కానిస్టేబుళ్లతో సమానంగా పరిగణిస్తున్నామని, రాష్ట్రంలోని గ్రామాల పరిధిలోని పోలీసు స్టేషన్‌ తరపున వారు మహిళా ప్రతినిధులంటూ జూన్‌ 23 నాటి జీవోను ఉటంకిస్తూ తన లేఖలో డీజీపీ స్పష్టంగా పేర్కొన్నారు. వారి అధికారిక శిక్షణకు అనుగుణంగా పని ఉంటుందని, దిశ యాప్‌ డౌన్‌లోడ్స్‌, బలహీనుల మ్యాపింగ్‌, మహిళా సమస్యలపై అవగాహన కల్పించడం, నేరాలను అరికట్టే ప్రయత్నం, పలు కోణాల్లో పోలీసు విధుల తరహాలో వార్డు మహిళా పోలీస్‌ డ్యూటీ ఉంటుందని వివరించారు. ఇలాంటి సమయంలో ఇతర శాఖల అధికారులు ఇస్తున్న ఆదేశాలు వారిలో గందరగోళం సృష్టిస్తున్నాయని, పోలీసు శాఖ అప్పగించిన పనులు కూడా కావడం లేదని తెలిపారు. ఇకపై వీరికి ఇతర శాఖలు పని చెప్పకుండా ఆదేశాలు జారీ చేయాలని సీఎ్‌సను కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సిబ్బంది అవసరమైతే తనను గానీ, జిల్లా ఎస్పీలను గానీ సంప్రదించవచ్చని లేఖలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.